Antibiotics :యాంటీబయాటిక్స్ ఎప్పుడు వాడాలి, ఎప్పుడు వద్దు?
Antibiotics: యాంటీబయాటిక్స్ శరీరంలోకి వెళ్లిన తర్వాత అసలు ఏం జరుగుతుందో, దాని వల్ల భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసుకోవడం ముఖ్యం.

Antibiotics
కొంతమంది చిన్నపాటి జ్వరం వచ్చినా, లేదా జలుబు చేసినా డాక్టర్ సలహా లేకుండా నేరుగా మెడికల్ షాపుకి వెళ్లి యాంటీబయాటిక్స్ కొనుక్కుని వేసుకుంటారు. అయితే త్వరగా కోలుకోవాలనే ఉద్దేశంతో చేసే ఈ పని, మన ఆరోగ్యానికి ఎంత ప్రమాదకరమో చాలామందికి తెలియదు. ఆ యాంటీబయాటిక్స్ శరీరంలోకి వెళ్లిన తర్వాత అసలు ఏం జరుగుతుందో, దాని వల్ల భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసుకోవడం ముఖ్యం.
యాంటీబయాటిక్స్ (antibiotics)ఎలా పనిచేస్తాయంటే..యాంటీబయాటిక్స్ అనేవి బ్యాక్టీరియా వల్ల వచ్చే ఇన్ఫెక్షన్లను నయం చేయడానికి ఉపయోగించే శక్తివంతమైన మందులు. ఇవి వైరస్‌ల వల్ల వచ్చే జ్వరం, దగ్గు, జలుబు వంటి వాటిపై పనిచేయవు. ఉదాహరణకు, జలుబు అనేది రైన్‌వైరస్ అనే వైరస్ వల్ల వస్తుంది. దీనికి యాంటీబయాటిక్స్ వేసుకుంటే ఎలాంటి ఉపయోగం ఉండదు, కానీ చాలామంది తెలియక వేసుకుంటారు.

అసలు యాంటీబయాటిక్ (antibiotics)రెసిస్టెన్స్ అంటే ఏంటంటే.. ఒక వ్యక్తి సరైన కారణం లేకుండా లేదా సరైన మోతాదులో యాంటీబయాటిక్స్ వాడితే, శరీరంలోని బ్యాక్టీరియా ఆ మందులకు అలవాటు పడిపోతుంది. దీన్నే యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అంటారు. ఆ తరువాత ఆ బ్యాక్టీరియాను చంపడానికి వేసుకునే మందులు పనిచేయవు. ఈ సమస్య వల్ల భవిష్యత్తులో నిజంగా ఏదైనా తీవ్రమైన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు దాన్ని నయం చేయడం కష్టంగా మారుతుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య నిపుణులను ఆందోళనకు గురిచేస్తున్న ఒక పెద్ద సమస్య.
ఎప్పుడయినా సరే డాక్టర్ సలహా తప్పనిసరి. స్వయంగా మందులు వాడకుండా, ఎప్పుడూ డాక్టర్ సలహా తీసుకున్న తర్వాతే యాంటీబయాటిక్స్(antibiotics) వాడాలి. డాక్టర్ సూచించిన విధంగా పూర్తి కోర్సు వాడాలి. మధ్యలో ఆపేయకూడదు. మధ్యలో ఆపేస్తే మళ్ళీ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వచ్చే అవకాశం ఉంది. జలుబు, జ్వరం వంటి లక్షణాలు ఉంటే అది వైరల్ ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఉంది. ఇలాంటి వాటికి విశ్రాంతి, సరైన ఆహారం, నీరు తాగడం ముఖ్యం.కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ ఏ రకానికి చెందినదో తెలుసుకోవడానికి వైద్యులు కొన్ని పరీక్షలు చేస్తారు.
యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ పెరగడం వల్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కూడా ఆందోళన వ్యక్తం చేస్తోంది. మనం చిన్న జాగ్రత్తలు తీసుకుంటే భవిష్యత్తులో వచ్చే తీవ్రమైన ఆరోగ్య సమస్యల నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చు.