Just LifestyleLatest News

love:నాడు సిరా చుక్కల సాక్షిగా- నేడు ఎమోజీల చాటున..లవ్ జర్నీ ఎటువైపు?

love: మనసులోని మాటను కాగితంపై పెట్టడానికి గంటల తరబడి, రోజుల తరబడి ఆలోచించేవారు.

love

కాలం మారుతోంది. టెక్నాలజీ పెరుగుతోంది. మనిషిలోని ప్రేమ అలాగే ఉన్నా..ఆ ప్రేమను వ్యక్తపరిచే విధానంలో మాత్రం బోలెడు మార్పులు వచ్చేశాయి. ఒకప్పుడు ప్రేమలో పడ్డారంటే వారిదొక మౌన పోరాటంగా ఉండేది. మనసులోని మాటను కాగితంపై పెట్టడానికి గంటల తరబడి, రోజుల తరబడి ఆలోచించేవారు.

ప్రేమ(love) లేఖ రాసేటప్పుడు ఒణికిన ఆ చేతులు, అక్షరాల మాటున దాగున్న ఆ ఆరాటం, ఉత్తరం చివరన పెట్టిన గులాబీ రేకులు.. ఇవన్నీ ఒక కావ్యంలా సాగిపోయేవి. ఆ ఉత్తరం అసలు గమ్యం చేరుతుందో లేదో తెలీదు, ఒకవేళ చేరినా సమాధానం వస్తుందో రాదో కూడా అస్సలు తెలీదు. ఆ వేచి చూడటంలోనే ఒక తెలియని తీపి ఉండేది. ఆ నిరీక్షణే పాతకాలం నాటి ప్రేమలోని గాఢతను తెలియజేసేది.

కానీ ఇప్పుడు? అంతా ఇన్‌స్టంట్ యుగం. ప్రేమైనా, బ్రేకప్ అయినా అంతా స్మార్ట్‌ఫోన్ స్క్రీన్ మీదే ముగిసిపోతోంది. మనసులోని భావాలను అక్షరాల్లో రాయాల్సిన పనేలేదు, ఒక్క హార్ట్ ఎమోజీ పంపిస్తే సరిపోతుంది.

అప్పుడు ప్రేమలేఖ రాస్తే అది జీవితాంతం ఒక మధుర జ్ఞాపకంలా దాచుకునేవారు.కానీ ఇప్పుడు వాట్సాప్ చాట్‌లు ఎప్పుడు డిలీట్ ఫర్ ఎవ్రీవన్ అవుతున్నాయో కూడా తెలీడం లేదు.

అప్పుడు ప్రేమికులు ఒకరినొకరు చూసుకోవడానికి జాతరలకో, గుడులకో, సినిమాలకో వెళ్లేవారు. కానీ ఇప్పుడు వీడియో కాల్‌తో మొదలై, ఇన్‌స్టాగ్రామ్ స్టేటస్‌లతో ప్రపంచానికి చాటిచెప్పే వరకు వచ్చేసింది. నాడు ప్రేమలో సీక్రెసీ ఉండేది, నేడు అంతా ఓపెన్ అన్న మైండ్ సెట్ పెరిగిపోయింది.

ఇంకా చెప్పాలంటే వాట్సాప్ స్టేటస్‌లు వచ్చాక ..ప్రేమలో ఒక విచిత్రమైన అలవాటు మొదలైంది. ప్రేమికుల మధ్య ఏదైనా గొడవ జరిగితే ఒక బాధాకరమైన కోట్ స్టేటస్ పెట్టడం, సంతోషంగా ఉంటే ఒక లవ్ కొటేషన్, సాంగ్స్ పెట్టడం ఇప్పుడొక ట్రెండ్‌గా మారింది.

ఒకప్పుడు ఎదురెదురుగా నిలబడి మాట్లాడటానికే భయపడేవారు, ఇప్పుడు బ్లాక్ చేయడం, అన్‌ఫాలో చేయడం ద్వారా ఓపెన్‌గా తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు.

love
love

అప్పుడు సిరా చుక్క కారితే అది కన్నీటి చుక్క అని ఎదుటివాళ్లు అర్థం చేసుకునేంత గాఢత ఆ ఉత్తరాలలో ఉండేది. ఇప్పుడు వంద ఎమోజీలు పంపినా, అవతలి వ్యక్తి నిజంగా ఏ మూడ్‌లో ఉన్నారో అర్ధం చేసుకోలేకపోతున్నారు.

అయితే, పాత తరంలో ప్రేమ గొప్పదా, కొత్త జనరేషన్ లవ్ గొప్పదా అంటే.. రెండింటికీ వేటి అందాలు వాటికి ఉన్నాయి. ఆనాటి ఉత్తరాల్లో సహనం ఉంది, నేటి చాటింగ్‌లో వేగం ఉంటుంది.

అప్పటి ప్రేమలో దూరం ఎక్కువ ఉన్నా బంధం బలంగా ఉండేది, ఇప్పటి ప్రేమలో రెగ్యులర్‌గా టచ్‌లో ఉన్నా ఏదో తెలియని అభద్రతా భావం వెంటాడుతోంది. అయితే .. ప్రేమను వ్యక్తపరిచే సాధనం ఉత్తరమైనా, వాట్సాప్ అయినా.. అందులో ఉండే ‘నిజాయితీ’ మాత్రం మారకూడదన్న విషయాన్ని మర్చిపోకూడదు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button