Just SportsLatest News

India vs Namibia : టీమిండియా ఆల్ రౌండ్ షో..నమీబియాపై భారీ విజయం

India vs Namibia : టీ20 ప్రపంచకప్ లో భారత్ జూలు విదుల్చుతోంది. తొలి మ్యాచ్ లో కాస్త తడబడుతూ గెలిచిన టీమిండియా రెండో మ్యాచ్ లో నమీబియాను చిత్తు చేసింది.

India vs Namibia

టీ20 ప్రపంచకప్ లో భారత్ జూలు విదుల్చుతోంది. తొలి మ్యాచ్ లో కాస్త తడబడుతూ గెలిచిన టీమిండియా రెండో మ్యాచ్ లో నమీబియాను(India vs Namibia) చిత్తు చేసింది. బ్యాటింగ్ లో ఇషాన్ కిషన్ విధ్వంసానికి హార్థిక్ పాండ్యా మెరుపులు తోడవడంతో భారీస్కోరు చేసింది. తర్వాత బౌలింగ్ లో స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తిప్పేయడంతో భారీ విజయాన్ని అందుకుంది.

టీమిండియా, నమీబియాను(India vs Namibia) మ్యాచ్ లో ఊహించినట్టుగానే తుది జట్టులో రెండు మార్పులతో బరిలోకి దిగింది. అభిషేక్ శర్మ కోలుకోకపోవడంతో సంజూ శాంసన్ కు చోటు దక్కింది. అలాగే మహ్మద్ సిరాజ్ ప్లేస్ లో జస్ప్రీత్ బుమ్రా తిరిగి వచ్చాడు. టాస్ గెలిచిన నమీబియా బౌలింగ్ ఎంచుకుంది. భారీ స్కోరే లక్ష్యంగా బ్యాటింగ్ కు దిగిన భారత్ కు ఓపెనర్లు సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ అనుకున్న ఆరంభాన్నివ్వలేకపోయారు. వచ్చిన అవకాశాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోలేకపోయిన సంజూ శాంసన్ 8 బంతుల్లో 1 ఫోర్ , 3 సిక్సర్లతో 22 పరుగులకు ఔటయ్యాడు.

అయితే ఫామ్ లో ఉన్న ఇషాన్ కిషన్ మాత్రం రెచ్చిపోయాడు. తన బ్యాటింగ్ విధ్వంసం కొనసాగిస్తూ నమీబియా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదేశాడు. అటు తిలక్ వర్మ కూడా దూకుడుగానే ఆడాడు. వీరిద్దరూ రెండో వికెట్ కు 31 బంతుల్లోనే 79 పరుగులు జోడించారు. మరో సెంచరీ చేస్తాడనుకుంటుండగా ఇషాన్ కిషన్ 24 బంతుల్లో 61 రన్స్ కు వెనుదిరిగాడు. కాసేపటికే తిలక్ వర్మ , సూర్యకుమార్ యాదవ్ పరుగులకే ఔటవడంతో మరో 2 వికెట్లు కోల్పోయింది.

ఈ పరిస్థితుల్లో హార్థిక్ పాండ్యా, శివమ్ దూబే మెరుపులు మెరిపించారు. ముఖ్యంగా పాండ్యా తనదైన భారీ సిక్సర్లతో నమీబియా బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 28 బంతుల్లోనే 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 52 రన్స్ చేశాడు. దూబే (23) పరుగులు చేయగా.. చివర్లో టెయిలెండర్లు వరుసగా వికెట్లు ఇచ్చేసుకున్నారు. చివరికి భారత్ 9 వికెట్లకు 209 పరుగులు చేసింది. నమీబియా కెప్టెన్ ఎరాస్మస్ 20 పరుగులకు 4 వికెట్లు పడగొట్టి అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు.

India vs Namibia
India vs Namibia

తర్వాత ఛేజింగ్ లో నమీబియా దూకుడుగానే ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఈ క్రమంలో నమీబియా ఓపెనర్లు తొలి వికెట్ కు 33 పరుగులు జోడించారు. తర్వాత అర్షదీప్ సింగ్ వీరి పార్టనర్ షిప్ ను బ్రేక్ చేయగా.. ఫ్రైలింగ్ (22), స్టికాంప్ (29) పరుగులకు ఔటయ్యారు. ఇక్కడ నుంచి భారత్ పూర్తిగా పట్టుబిగించింది. స్పిన్నర్ల ఎంట్రీతో నమీబియా చేతులెత్తేసింది. వరుణ్ చక్రవర్తి అద్భుతమైన స్పెల్ తో నమీబియాను తిప్పేశాడు. కేవలం 2 ఓవర్లలో 7 పరుగులకు 3 వికెట్లు పడగొట్టాడు. అటు అక్షర్ పటేల్ కూడా స్పిన్ మ్యాజిక్ చూపించడంతో నమీబియా కోలుకోలేకపోయింది.

భారత బౌలర్లలో పాండ్యా 2 , దూబే 2, అర్షదీప్ , బుమ్రా ఒక్కో వికెట్ పడగొట్టారు. దీంతో భారత్ 94 పరుగుల తేడాతో గెలిచింది. ఈ గెలుపుతో గ్రూప్ ఏలో భారత్ టాప్ ప్లేస్ కు దూసుకెళ్లింది.

మరిన్ని స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button