World Radio Day:ఆకాశవాణి వార్తలు చదువుతున్నది – కాలం.. రేడియో జ్ఞాపకాలతో మధుర ప్రయాణం
World Radio Day: సింపుల్‌గా చెప్పాలంటే రేడియో ఒక తరానికి స్ఫూర్తి, మరో తరానికి మధుర జ్ఞాపకం.
World Radio Day
ఇప్పుడు అంతా అరచేతిలో ప్రపంచాన్ని చూపించే ఇంటర్నెట్ యుగం. కానీ, ఒకప్పుడు ఒక చిన్న పెట్టె లాంటి రేడియోనే ఎంతోమందికి సర్వం..సర్వస్వం కూడా. ఫిబ్రవరి 13 ప్రపంచ రేడియో దినోత్సవం ( World Radio Day)సందర్భంగా ఆ పాత జ్ఞాపకాల పొరలను ఒక్కసారి తవ్వి చూస్తే.. ఎన్ని మధుర క్షణాలు కనిపిస్తాయో. అప్పట్లో ప్రతి ఇంట్లోనూ రేడియో ఒక కుటుంబ సభ్యుడిలాగే ఉండేది. ఉదయాన్నే మంగళధ్వనితో మొదలై, రాత్రి వార్తలు వినే వరకు ఆ రేడియో చుట్టూనే ఎంతోమంది కాలం తిరిగేది.
రేడియోలో పాటలు వినబడటానికి ఆ ఏరియల్‌ను అటు ఇటు తిప్పడం, సిగ్నల్ సరిగా రాకపోతే రేడియోను ఒక్కసారి మెల్లగా తట్టడం.. అదొక పెద్ద అచీవ్‌మెంట్ అందరికీ. బ్యాటరీ సెల్స్ అయిపోయాయన్న అనుమానంతో.. వాటిని ఎండలో పెట్టి మళ్లీ వాడిన రోజులు ఎంతమందికి ఇప్పటికీ మధుర జ్ఞాపకాలుగా మిగిలిపోయాయో మరి. ఆ రోజుల్లో రేడియో కేవలం ఒక పరికరం కానే కాదు, అదొక ఎమోషన్. ఇంటి యజమానులే కాదు..పొలాల్లో రైతులు, వంటగదిలో గృహిణులు, పరీక్షల కోసం సిద్ధమయ్యే విద్యార్థులు.. అందరికీ కూడా రేడియోనే నేస్తం.
ఆకాశవాణి.. వార్తలు చదువుతున్నదని ఆ గంభీరమైన గొంతు వినబడగానే.. ఇంట్లో అంతా నిశ్శబ్దంగా అయిపోవడం గుర్తొస్తే ఇప్పటికీ మనసును తట్టే ఆ భావనను ఎవరూ వర్ణించలేరేమో. దేశ ప్రధాని సందేశం నుంచి క్రికెట్ కామెంటరీ వరకు అంతా ఆ చిన్న పెట్టెలోనే .
ముఖ్యంగా రేడియో నాటకాలు, బాలానందం, కార్మికుల కార్యక్రమం వంటివి ఎంతోమందికి విజ్ఞానాన్ని, వినోదాన్ని పంచేవి. టీవీలు లేని ఆ కాలంలో ఆ బుల్లి రేడియో అందించిన ఊహాశక్తి సాటిలేనిది. ఎందుకంటే ఆ మాటలను బట్టి బొమ్మలను ఊహించుకోవడం ప్రతీ ఒక్కరికీ ఒక వింత అనుభూతి అనే చెప్పొచ్చు. మనిషిలోని క్రియేటివిటీని పెంచిందీ కూడా బహుశా ఇదేనేమో.

అయితే ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్లు వచ్చినా కూడా, ఎఫ్.ఎమ్ (FM) రూపంలో రేడియో తన ఉనికిని చాటుకుంటూనే ఉండటం విశేషమే. డ్రైవింగ్ చేసేటప్పుడు గానీ, పని ఒత్తిడిలో ఉన్నప్పుడు గానీ నేటికీ ఆ రేడియో మంచి కంపెనీ ఇస్తూనే ఉంది. టెక్నాలజీ ఎంత మారినా, ఆకాశవాణి ఇచ్చే ఆ లైవ్ అనుభూతిని ఏ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ఇవ్వలేదంటే కాస్త అతిశయోక్తి అనిపించినా కూడా అదే నిజం. ఎందుకంటే రేడియో మాటలతోనే కాదు, మన మనసులతో కూడా మాట్లాడుతుంది కాబట్టి.
సింపుల్‌గా చెప్పాలంటే రేడియో ఒక తరానికి స్ఫూర్తి, మరో తరానికి మధుర జ్ఞాపకం. ఈ ప్రపంచ రేడియో దినోత్సవం( World Radio Day) వేళ, ఒక్కసారి మీ ఇంట్లో పాత రేడియో ఉంటే కనుక ఓసారి దుమ్ము దులిపి చూసుకోండి. అందులో వచ్చే అక్షరాల అలలు..మిమ్మల్ని మళ్లీ మీ బాల్యంలోకి తీసుకెళ్తాయేమో.



