Pav Bhaji:పావ్‌భాజీకి ఈ పేరెలా వచ్చింది? అసలు దీని చరిత్రేంటో తెలుసా?
Pav Bhaji:ముంబై పావ్‌భాజీకి, అమెరికా అంతర్యుద్ధానికి ఉన్న సంబంధం ఏమిటో చాలా మందికి తెలియదు.

Pav Bhaji
మన దేశంలో ఎక్కడికి వెళ్లినా కనిపించే వంటకం పావ్‌భాజీ(Pav Bhaji). ఇక ముంబైలో అయితే దీనికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అక్కడి ప్రజలు దీన్ని తినకుండా ఉండలేరంటే అతిశయోక్తి కాదు. అయితే, నిజానికి ఈ వంటకం ముంబైలోనే తయారైంది. కానీ దీని ఆవిర్భావానికి కారణం మాత్రం సుదూరంగా జరిగిన అమెరికా అంతర్యుద్ధం (American Civil War). అవును..ముంబై పావ్‌భాజీకి, అమెరికా అంతర్యుద్ధానికి ఉన్న సంబంధం ఏమిటో చాలా మందికి తెలియదు.
1861-1865 మధ్య అమెరికాలో అంతర్యుద్ధం జరిగింది. ఈ యుద్ధం వల్ల పత్తి సరఫరాలో సంక్షోభం ఏర్పడింది. దీంతో అమెరికా పత్తి కోసం ముంబై నుంచి భారీగా దిగుమతి చేసుకోవడం మొదలుపెట్టింది. ఆ సమయంలో ముంబైలోని పత్తి మిల్లుల్లో పనులు బాగా పెరిగాయి. కొన్నిసార్లు కార్మికులు రాత్రంతా పని చేయాల్సి వచ్చేది.

అయితే, రాత్రిపూట ఆకలి వేస్తే తినడానికి కార్మికులకు ఎలాంటి సరైన, వేగంగా లభించే ఆహారం దొరికేది కాదు. ఈ సమస్యను గమనించిన చిరుతిండ్లు విక్రయించే వ్యాపారులు ఒక ఉపాయం ఆలోచించారు. వారు అందుబాటులో ఉన్న కూరగాయలు అన్నింటిని కలిపి ఒకేసారి వేడివేడిగా కూరలా (మసాలా కర్రీ) వండేవారు. ఆ తర్వాత, వెన్నలో (Butter) బ్రెడ్‌ను వేయించి, ఈ కూరతోపాటు తక్కువ ధరలో, తక్కువ సమయంలో కార్మికులకు అందించేవారు. అలా కడుపు నిండా తినే ఒక సంపూర్ణ ఆహారం తయారైంది.
ఈ వంటకాన్ని అప్పటి నుంచి పావ్‌భాజీ(Pav Bhaji) అని పిలవడం మొదలుపెట్టారు. బ్రెడ్‌ను ‘పావ్’ అని పిలుస్తారు. దీనికి గల కారణమేంటంటే… సాధారణంగా ఒక బ్రెడ్‌ను నాలుగు భాగాలుగా (నాలుగులో ఒక వంతు) విభజించి ఇస్తుంటారు. మరాఠీలో నాలుగులో ఒక వంతును లేదా పావు భాగంను ‘పావ్’ అని పిలుస్తారు. అందుకే ఆ బ్రెడ్‌ను పావ్ అంటారని చెబుతుంటారు. అలాగే మరాఠీ భాషలో ‘భాజీ’ (Bhaji)అంటే వివిధ కూరగాయలతో వండిన కూర.
అలా ఈ రెండిటిని కలిపి పావ్‌భాజీ అని పిలుస్తున్నారు. ముంబైలో పుట్టిన ఈ ఆహారం కాలక్రమేణా దేశవ్యాప్తంగా విభిన్న రుచులతో ఆహార ప్రియులకు అందుబాటులోకి వచ్చింది.