Phone:జేబులో ఫోన్ లేకపోయినా మోగుతున్నట్లు అనిపిస్తోందా? అయితే అది అదే కావొచ్చు..
Phone: చివరకు మన బట్టలు మనకు టచ్ అయినా లేదా ఏదైనా చిన్న కదలిక జరిగినా, మెదడు దానిని పొరపాటున ఫోన్ వైబ్రేషన్ గా అన్పించేలా చేస్తుంది.
Phone
ప్రస్తుత డిజిటల్ యుగంలో మనమంతా ఏదొక సమయంలో ఒక వింత అనుభవాన్ని ఎదుర్కొని ఉంటాం. మన జేబులో ,లేదా బ్యాగ్లో ఫోన్ ఉన్నప్పుడు అది వైబ్రేట్ అయినట్లు , రింగ్ టోన్ వినిపించినట్లు అనిపిస్తుంది. వెంటనే ఫోన్ (Phone) తీసి చూస్తే అక్కడ ఎలాంటి కాల్ గానీ, మెసేజ్ గానీ ఉండదు.
ఒక్కోసారి అసలు జేబులో ఫోన్ (Phone) లేకపోయినా మనకు ఆ వైబ్రేషన్ టచ్ కలుగుతుంది. దీనినే సైకాలజీలో ‘ఫాంటమ్ వైబ్రేషన్ సిండ్రోమ్’ (Phantom Vibration Syndrome) అని పిలుస్తారు. అయితే ఇది వినడానికి చిన్న విషయంగా అనిపించినా, మన మెదడు స్మార్ట్ ఫోన్లకు ఎంతగా బానిస అయిపోయిందో చెప్పడానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ అంటున్నారు మానసిక నిపుణులు.
దీని వెనుక ఉన్న సైకాలజీ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మనం నిరంతరం ఫోన్ నుంచి వచ్చే నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తూ ఉంటాం. ఈ సమయంలో మన మెదడు ఒక రకమైన ‘హైపర్ విజిలెన్స్’ (అతి జాగ్రత్త) స్థితిలోకి వెళ్లిపోతుంది.
చివరకు మన బట్టలు మనకు టచ్ అయినా లేదా ఏదైనా చిన్న కదలిక జరిగినా, మెదడు దానిని పొరపాటున ఫోన్ వైబ్రేషన్ గా అన్పించేలా చేస్తుంది. అంటే మెదడు ఒక రకమైన భ్రమను సృష్టిస్తుంది. చివరకు ఒక రకంగా చెప్పాలంటే, మన మెదడు ఫోన్ కాల్స్ లేదా మెసేజ్ల కోసం ఎంతగా ఆరాటపడుతుందంటే, ఏమీ లేకపోయినా ఉన్నట్లుగా మనల్ని నమ్మించేస్తుంది.
పరిశోధనల ప్రకారం, స్మార్ట్ ఫోన్ ఎక్కువగా వాడే వారిలో దాదాపు 90 శాతం మంది ఈ ఫాంటమ్ వైబ్రేషన్ ను అనుభవిస్తున్నారట. ఇది మన మానసిక ఒత్తిడి ఆందోళనకు (Anxiety) సంకేతం. మనం సోషల్ మీడియాకు లేదా ఇంటర్నెట్ కు ఎంతగా అలవాటు పడిపోయామంటే, ఒక్క నిమిషం ఫోన్ వైబ్రేట్ అవ్వకపోయినా కూడా మనం ఏదో కోల్పోతున్నామనే ఫీల్ (FOMO) మనలో ఏర్పడుతుంది. దీనివల్ల మెదడు నిరంతరం అలర్ట్ గా ఉండి, లేని వైబ్రేషన్లను కూడా ఉన్నట్లుగా క్రియేట్ చేస్తుంది. ఇది మన ఏకాగ్రతను దెబ్బతీస్తుంది అలాగే నిద్రలేమికి కూడా దారితీస్తుంది.

అయితే దీని నుంచి బయటపడటం పెద్ద కష్టం ఏమీ కాదంటున్నారు సైకాలజిస్టులు. రోజులో కొంత సమయం ఫోన్కు దూరంగా ఉండే ‘డిజిటల్ డిటాక్స్’ పాటించడం వల్ల మెదడు మళ్లీ సాధారణ స్థితికి వస్తుందట. ఫోన్ ను ఎప్పుడూ జేబులో లేదా చేతితో పట్టుకోకుండా టేబుల్ మీద పెట్టడం లేదా వైబ్రేషన్ మోడ్ ఆపేయడం వంటి చిన్న మార్పులు చేయడం వల్ల ఈ సిండ్రోమ్ కొద్ది రోజుల్లోనే తగ్గుతుందని చెబుతున్నారు.
ఏది ఏమయినా టెక్నాలజీ మన జీవితాన్ని ఈజీ చేయాలి కానీ, మన మెదడును నియంత్రించే స్థాయికి వెళ్లకూడదు. కాసేపు ఫోన్ పక్కన పెట్టి ప్రశాంతంగా ఉండమని ఈ ఫాంటమ్ వైబ్రేషన్ అనేది మన మెదడు మనకు ఇస్తున్న ఒక చిన్న హెచ్చరిక అని తెలుసుకోవాలి.
Anvesh:ప్రపంచ యాత్రకు అన్వేష్ గుడ్ బై..ఇది ప్రజా సేవనా లేక సేఫ్ ఎగ్జిటా?



