Literature: ఆచార్య దేవోభవ
Literature: సమాజ నిద్రావస్థను సమూలంగా వదిలించగల అందరికీ ఆచార్యదేవోభవ..

Literature
ఒడి నుండి బడిలోకి చేరే
ఆ స్వేచ్ఛా విహంగాలను
ఆకర్షించే ప్రకృతతడు..
అమ్మ ప్రపంచము నుండి
అమూల్య ప్రపంచములోకి
ఆహ్వానించే పత్రికతడు..
చిటికెన వ్రేలు పట్టి నడిపే
చిట్టి చేతులతో
బలపం పట్టించే బ్రాహ్మణుడతడు..
ముద్దు ముద్దు మాటలను
చిట్టి పొట్టి పాటలుగా మార్చి
ఆటలాడించే ఆప్తుడతడు..
చిన్నారి అంతరంగాన్ని
ఆసాంతం అవపోషణ చేసిన
ఆత్మబంధువతడు..
మనసు కన్న కలలకు
వెన్ను తట్టి నిలిచి
ప్రోత్సహించే మిత్రుడతడు..
వివిధ పాత్రలతో
విద్యార్థుల నగుమోము పై
విరులు పూయించే విదూషకుడతడు..
నీతి సూక్తులను
నిత్య బోధనలో చేర్చి
ప్రబోధించే బోధకుడతడు…
పుస్తకమే కాదు
ప్రపంచమే పాఠమని
బోధించే తత్వవేత్తతడు..
అజ్ఞాన పథములో
అక్షర దీపం వెలిగించే
మార్గదర్శకుడతడు..
కన్నీటి బిందువునయినా
ధైర్య సింధువుగా మార్చే
మానసిక వైద్యుడతడు..
తప్పులు చేసినా
చిన్న చూపు చూడని
సహన సముద్రమతడు..
సమాజ నిద్రావస్థను
సమూలంగా వదిలించగల
వైతాళికుడతడు..
అతడంటేనే ఓ ఆలోచన
అతడంటేనే ఓ ఆరాధన
అతడంటే అక్షరం
అతడంటే అజరామరం
అతడంటే స్ఫూర్తి
అతడంటే దీప్తి
అతడో పెద్ద బాలశిక్ష
అతడో నిత్య పరీక్ష
అతడో జ్ఞాన తారక
అతడో ప్రేరణ శిఖర
అతడంటే అన్నీ..
అతడంటే తనకు సాటి అతడే..
అతడంటే గురువులైన
ఆమె కూడా..
ఆదిదేవుడనిపించే
ఆచార్యుడు…
అమృతాలు పంచే
అధ్యాపకుడు…
ఉషస్సులు వెలిగించే
ఉపాధ్యాయుడు..
అందరికీ
ఆచార్యదేవోభవ..
— ఫణి మండల
Very nice sir
Very nice sir
Very nice👌👌
Supr
గురు దేవోభవ….
Acharya devobhava happy teacher day superga vundhi
happy teachers day phani
nic 👍
Very nice 👏👏👍
happy teachers day 🤝🤝🤝
Very nice sir చక్కగా రాశారు సూపర్