Kerala: కేరళ వెళ్లాలనుకుంటున్నారా? తక్కువ బడ్జెట్లో మున్నార్ చుట్టి వస్తారా? అయితే పక్కా ప్లాన్ ఇదే!
Kerala: చాలామంది కేరళ వెళ్లాలంటే కనీసం 50 వేల రూపాయలైనా ఖర్చవుతుందని వెనకడుగు వేస్తుంటారు. కానీ పక్కా ప్లానింగ్ ఉంటే కేవలం 10 వేల నుంచి 15 వేల రూపాయల బడ్జెట్లోనే మున్నార్‌ను చుట్టి రావచ్చు.
Kerala
మన దేశంలోని పర్యాటక ప్రాంతాల్లో కేరళకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉందన్న విషయం తెలిసిందే. అందుకే కేరళను గాడ్స్ ఓన్ కంట్రీ పేరుతో పిలుస్తారు. కేరళ(Kerala)లో అనేక అందమైన ప్రదేశాలు ఉన్నా.. పర్యాటకుల మనసు గెలుచుకునేది మాత్రం మున్నార్. సముద్ర మట్టానికి సుమారు 1600 మీటర్ల ఎత్తులో ఉండే ఈ హిల్ స్టేషన్, పచ్చని టీ తోటలకు, పొగమంచు పర్వతాలకు ఫేమస్. అయితే చాలామంది కేరళ వెళ్లాలంటే కనీసం 50 వేల రూపాయలైనా ఖర్చవుతుందని వెనకడుగు వేస్తుంటారు. కానీ పక్కా ప్లానింగ్ ఉంటే కేవలం 10 వేల నుంచి 15 వేల రూపాయల బడ్జెట్లోనే మున్నార్‌ను చుట్టి రావచ్చు.
హైదరాబాద్ లేదా విజయవాడ నుంచి మున్నార్ వెళ్లడానికి డైరక్ట్ ట్రైన్లు ఉండవు. ముందుగా కేరళలోని అలువా (Aluva) లేదా ఎర్నాకులం (Ernakulam) రైల్వే స్టేషన్‌కు ట్రైన్ బుక్ చేసుకోవాలి.దీనికోసం మీరు కనీసం రెండు నెలల ముందే స్లీపర్ క్లాస్ లేదా థర్డ్ ఏసీ బుక్ చేసుకుంటే ప్రయాణ ఖర్చులు చాలా వరకు ఇక్కడే తగ్గిపోతాయి. స్టేషన్ దిగిన తర్వాత మున్నార్ వెళ్లడానికి అక్కడుండే ప్రైవేట్ ట్యాక్సీలు కనీసం 3000 రూపాయల వరకు అడుగుతాయి. అందుకే మీరు స్టేషన్ బయట ఉండే కేరళ ఆర్టీసీ (KSRTC) బస్సు ఎక్కితే కేవలం 150 రూపాయల లోపే మున్నార్ చేరుకోవచ్చు. అంతేకాదు ఈ బస్సు జర్నీ పర్వతాల మధ్య చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుంది.
మున్నార్ టౌన్ మధ్యలో హోటల్స్ తీసుకుంటే ఖర్చు ఎక్కువుంటుంది. దానికి బదులు మున్నార్ కు 5 నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉండే హోమ్ స్టేలను ఎంచుకోండి. అక్కడ మీకు కేరళ(Kerala) సంప్రదాయ ఇళ్లలో ఉండే అనుభూతీ కలుగుతుంది. రోజుకు 1000 రూపాయలకే మంచి రూములు దొరుకుతాయి. ఆన్లైన్ వెబ్సైట్లలో కాకుండా.. గూగుల్ మ్యాప్స్ లో వెతికి ఫోన్ చేసి బుక్ చేసుకుంటే ఇంకాస్త డిస్కౌంట్ దొరుకుతుంది.

ఫస్ట్ డే ఎరవికులం నేషనల్ పార్క్ సందర్శించాలి. ఇక్కడ నీలగిరి తార్ అనే అరుదైన కొండ గొర్రెలు ప్రత్యేకంగా కనిపిస్తాయి. దీని కోసం మీరు ముందే ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకుంటే లైన్లో నిలబడే పని ఉండదు. ఇక రెండో రోజు మట్టుపెట్టి డ్యామ్, ఎకో పాయింట్ , కుండల లేక్ చూడొచ్చు. ఎకో పాయింట్ దగ్గర మీరు గట్టిగా అరిస్తే మీ గొంతు మీకే మళ్లీ వినిపిస్తుంది.ఇక థర్డ్ డే టీ మ్యూజియం,స్థానిక టీ తోటల్లో తిరుగుతూ ఫోటోలు తీసుకోవచ్చు.
అక్కడ తిరగడానికి ట్యాక్సీ కంటే బైక్ రెంట్‌కు తీసుకోవడం మంచిది. రోజుకు 500 రూపాయలకే స్కూటర్ లేదా బైక్ దొరుకుతుంది. పెట్రోల్ ఖర్చు కలిపినా మీకు రోజుకు 700 రూపాయల కంటే ఎక్కువ కాదు. ఇక భోజనం విషయానికి వస్తే, స్థానిక మెస్ లలో లభించే కేరళ(Kerala) మీల్స్ చాలా రుచిగానూ, చౌకగానూ ఉంటాయి.
మున్నార్ వెళ్లడానికి సెప్టెంబర్ నుంచి మార్చి వరకు అత్యంత అనుకూలమైన సమయం. కాబట్టి ఈ చలికాలంలోనే మీ ప్లాన్ ప్రిపేర్ చేసుకోండి.
కేరళ మున్నార్ ట్రిప్ బడ్జెట్, మున్నార్ లో చూడదగ్గ ప్రదేశాలు, తక్కువ ఖర్చుతో కేరళ ప్రయాణం.



