Just NationalJust InternationalLatest News

Hindus :బంగ్లాదేశ్‌లో హిందువులపై ఆగని దాడులు,హత్యలు.. భారత్ పట్ల ఇంత విద్వేషం ఎందుకు?

Hindus : తాజాగా అమృత్ మండల్, దీపు చంద్ర దాస్ వంటి హిందువుల హత్యలు బంగ్లాదేశ్‌లోని భయానక పరిస్థితులకు అద్దం పడుతున్నాయి.

Hindus

బంగ్లాదేశ్ ఇప్పుడు ఒక అగ్నిగుండంలా మారిపోయింది. మొన్నటి వరకు స్వేచ్ఛ కోసం పోరాడిన విద్యార్థులు, ఇప్పుడు మైనారిటీల ప్రాణాలు తీసే స్థాయికి దిగజారడం విచారకరం. తాజాగా అమృత్ మండల్, దీపు చంద్ర దాస్ వంటి హిందువుల హత్యలు బంగ్లాదేశ్‌లోని భయానక పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. అయితే ఈ దారుణ హింస వెనుక కేవలం మతం మాత్రమే లేదు. దీని వెనుక ఒక బలమైన రాజకీయ విద్వేషం, భారత్ పట్ల పేరుకుపోయిన కోపం కూడా ఉందంటున్నారు విశ్లేషకులు.

దీంతో అసలు బంగ్లాదేశ్‌లో భారతదేశం పట్ల ఇంత వ్యతిరేకత ఎందుకు పెరుగుతోంది? ముఖ్యంగా హిందువులే (Hindus )ఎందుకు టార్గెట్ అవుతున్నారు? దీనికి షేక్ హసీనాకు భారత్ ఆశ్రయం ఇవ్వడమే కారణమా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

బంగ్లాదేశ్‌లో ప్రస్తుతమున్న మెజారిటీ ప్రజలు భారతదేశాన్ని ఒక పొరుగు దేశంలా కాకుండా, షేక్ హసీనాను ఇన్నాళ్లూ కాపాడిన ఒక శక్తిలా చూస్తున్నారు. 15 ఏళ్ల పాటు హసీనా నిరంకుశ పాలన కొనసాగడానికి భాతర్ మద్దతే కారణమని అక్కడి వారు బలంగా నమ్ముతున్నారు. హసీనాను భారత్ ఇప్పటికీ తన దేశంలో దాచి ఉంచడంతో పాటు ఆమెను ఇంకా తమకు అప్పగించకపోవడం అక్కడి విప్లవకారులకు, విద్యార్థి సంఘాలకు ఆగ్రహం తెప్పిస్తోంది. ఈ కోపం సహజంగానే భారత్‌కు దగ్గరగా ఉండే హిందూ(Hindus ) మైనారిటీలపై పడుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

బంగ్లాదేశ్‌లో హిందువులు(Hindus ) సంప్రదాయబద్ధంగా షేక్ హసీనా నాయకత్వంలోని అవామీ లీగ్ పార్టీకి మద్దతుదారులుగా ఉండేవారు. ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు హిందువులకు రక్షణ బాగానే ఉండేది. ఇప్పుడు ఆ పార్టీ అక్కడ పతనమవ్వడంతో, ప్రత్యర్థులు (ముఖ్యంగా జమాత్-ఏ-ఇస్లామీ వంటి ఇస్లామిక్ సంస్థలు) హిందువులను అవామీ లీగ్ ఏజెంట్లుగా, భారత అనుకూలురుగా ముద్ర వేసి దాడులు చేస్తున్నారు.

Hindus
Hindus

హసీనా రాజీనామా చేసిన ఆగస్టు 5 నుంచి ఇప్పటి వరకు బంగ్లాదేశ్‌లో సుమారు 2,900 పైగా మైనారిటీలపై దాడులు జరిగినట్లు స్వతంత్ర సంస్థలు చెబుతున్నాయి.

దీపు చంద్ర దాస్ హత్య.. మైమెన్‌సింగ్‌లో ఈ యువకుడిని దారుణంగా చంపి, మృతదేహానికి నిప్పంటించారు.
అమృత్ మండల్ హత్య.. రాజ్‌బరిలో తాజాగా గుంపు దాడిలో ఈ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.
దేవాలయాల ధ్వంసం.. దాదాపు 150కి పైగా హిందూ దేవాలయాలు, ఇస్కాన్ సెంటర్లు ధ్వంసమయ్యాయి.
ఆస్తుల లూటీ.. వందలాది హిందూ కుటుంబాల ఇళ్లు, దుకాణాలను తగులబెట్టి ఆస్తులను లాక్కున్నారు.

ఇటీవలే ఇస్లామిక్ విప్లవ నాయకుడు ఒస్మాన్ హదీపై కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరపడం, అతను సింగపూర్ ఆసుపత్రిలో మరణించడం మరో మలుపు తిరిగింది. ఈ దాడి వెనుక భారతదేశం హస్తం ఉందని, హసీనా అనుచరులే ఈ పని చేశారని అక్కడి మత ఛాందసవాదులు పనిగట్టుకుని మరీ విద్వేషాన్ని రగిలిస్తున్నారు. ఇది చివరకు భారత దౌత్య కార్యాలయాలపై దాడులకు, హిందువులపై మరిన్ని దాడులకు దారితీస్తోంది.

భారతదేశం ఇప్పుడు ఒక క్లిష్ట పరిస్థితిలో ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అటు షేక్ హసీనా వంటి మిత్రురాలిని వదులుకోలేక, ఇటు బంగ్లాదేశ్‌లో పెరుగుతున్న తమపై వ్యతిరేకతను ఆపలేక సతమతమవుతోంది. భారత్ ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా, బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ఇవన్నీ చిన్న చిన్న గొడవలే అని కొట్టిపారేయడం చూసి మన అధికారులు, షాక్ అవుతున్నారు.

మొత్తంగా చెప్పాలంటే బంగ్లాదేశ్‌లో జరుగుతుంది కేవలం మత ఘర్షణ కాదు.. ఇది ఒక దేశం తన ఉనికిని కోల్పోతున్న వేళ, తన పొరుగు దేశంపై చూపిస్తున్న అసహనం అని చెప్పాలి. హిందువులను రక్షించుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు అందరి మీద ఉంది. భారత్ కేవలం హెచ్చరికలతో సరిపెట్టకుండా, దౌత్యపరంగా కఠిన చర్యలు తీసుకుంటేనే అక్కడ భారతీయులకు భద్రత లభిస్తుంది.

మరిన్ని ఇంటర్నేషనల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button