Employment Guarantee Act: ఉపాధి హామీ చట్టం పేరు మార్పు ..లోక్సభలో దుమారం ఎందుకు?
Employment Guarantee Act: ఉపాధి హామీ చట్టం బిల్లు ఆమోదం పొందే సమయంలో సభలో ప్రతిపక్షాల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి.
Employment Guarantee Act
భారతదేశ గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు పని కల్పించే అతిపెద్ద పథకమైన ఉపాధి హామీ (Employment Guarantee Act)చట్టం విషయంలో కేంద్ర ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది.
2005వ సంవత్సరంలో అప్పటి యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని (MGNREGA) రద్దు చేసి, దాని స్థానంలో వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్-గ్రామీణ్ (వీ బీ జీ రామ్ జీ) అనే కొత్త చట్టాన్ని అమలు చేయబోతున్నారు.
ఈ కొత్త బిల్లుకు తాజాగా లోక్సభలో ఆమోదం లభించింది. అయితే ఈ బిల్లు ఆమోదం పొందే సమయంలో సభలో ప్రతిపక్షాల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే మహాత్మా గాంధీ పేరును ఈ పథకం నుంచి తొలగించిందని ప్రతిపక్ష సభ్యులు ఆరోపిస్తూ గందరగోళం సృష్టించారు. ఈ గొడవల మధ్యే ప్రభుత్వం బిల్లును నెగ్గించుకుంది.

ఈ కొత్త చట్టం గురించి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, ఇది గ్రామాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తుందని చెప్పారు. గ్రామాలు స్వయం సమృద్ధి సాధించాలన్న గాంధీ గారి కలను ఈ పథకం నిజం చేస్తుందని, పేదరికం లేని గ్రామాలను నిర్మించడమే తమ లక్ష్యమని ఆయన వివరించారు. గ్రామాల సమగ్ర అభివృద్ధికి ఈ మిషన్ ఎంతో తోడ్పడుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
అయితే ప్రతిపక్ష ఎంపీలు మాత్రం ఈ వాదనను కొట్టిపారేస్తున్నారు. ముఖ్యంగా తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా మాట్లాడుతూ, గాంధీ గారి పేరును తీసేయడం ద్వారా ప్రభుత్వం రామరాజ్య భావనను దెబ్బతీస్తోందని విమర్శించారు.
గాంధీ , రవీంద్రనాథ్ ఠాగూర్ వంటి మహనీయుల గౌరవాన్ని కేంద్రం తుంగలో తొక్కిందని మండిపడ్డారు. ఈ పాత పథకం గ్రామీణ భారతాన్ని ఆర్థికంగా ఆదుకుందని, ఇప్పుడు కేవలం పేరు మార్చి పాత పథకాన్ని నీరుగారుస్తున్నారని ఆరోపించారు.



