Flag: త్రివర్ణ పతాకంలో ప్రతి రంగు,అశోక చక్రం చెప్పే సందేశం తెలుసా?
Flag: ఈ తరంలో చాలా తక్కువ మందికి మాత్రమే ఈ జెండాలోని మూడు రంగుల ప్రాముఖ్యత తెలుసు.

Flag
ఈ సంవత్సరం ఆగస్టు 15, 2025న భారతదేశం తన 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకోబోతోంది.ఆగస్టు 15 అనేది కేవలం ఒక సెలవు రోజు కాదు, మన దేశ చరిత్రలో ఒక సువర్ణాక్షరాల రోజు. 1947 ఆగస్టు 15న భారతదేశం సుమారు 200 సంవత్సరాల బ్రిటిష్ పాలన నుంచి విముక్తి పొంది, స్వేచ్ఛా భారతావనిగా అవతరించింది. ఈ రోజున మనం స్వాతంత్య్రం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన ఎందరో వీరులను, స్వాతంత్య్ర సమరయోధులను గుర్తు చేసుకుంటాం
భారతదేశ జాతీయ పతాకం(Flag), త్రివర్ణ పతాకం, మన దేశ స్వేచ్ఛ, ఐక్యత , గౌరవానికి చిహ్నం. ఈ తరంలో చాలా తక్కువ మందికి మాత్రమే ఈ జెండాలోని మూడు రంగుల ప్రాముఖ్యత తెలుసు. ఈ త్రివర్ణ పతాకంలో ఉన్న ప్రతి అంశం ఒక ప్రత్యేక సందేశాన్ని ఇస్తుంది.
మన జాతీయ జెండా (Flag)పొడవు, వెడల్పుల నిష్పత్తి 3:2లో ఉంటుంది. ఇందులో మూడు రంగులు సమానంగా ఉంటాయి. మధ్యలో ఉన్న అశోక చక్రం ముదురు నీలం రంగులో, 24 గీతలతో ఉంటుంది. ఈ నిర్మాణం వెనుక ఒక లోతైన అర్థం దాగి ఉంది.
త్రివర్ణ పతాకం(Flag) పైభాగంలో ఉండే కాషాయం (Saffron) రంగు దేశం యొక్క బలం మరియు ధైర్యానికి చిహ్నం. మన దేశ వీరుల త్యాగానికి, దేశభక్తికి ఇది నిలువెత్తు నిదర్శనం. ఈ రంగు మనలో ధైర్యాన్ని, త్యాగాన్ని నింపుతుంది.

మధ్యలో ఉండే తెలుపు(White) రంగు శాంతి, సత్యానికి చిహ్నం. భారతదేశం శాంతిని ప్రేమించే దేశమని, అహింసను విశ్వసిస్తుందని ఈ రంగు తెలియజేస్తుంది. ఇది మన మనసులో స్వచ్ఛతను, నిజాయితీని పెంపొందిస్తుంది.
జెండా దిగువన ఉండే ఆకుపచ్చ (Green) రంగు మన దేశం యొక్క పచ్చదనం, సుసంపన్నత మరియు అభివృద్ధికి చిహ్నం. భారతదేశం ఒక వ్యవసాయ దేశం కాబట్టి, ఈ రంగు వ్యవసాయం, ప్రకృతికి ఉన్న ప్రాముఖ్యతను మనకు గుర్తు చేస్తుంది.

తెల్లటి రంగు మధ్యలో ఉన్న ముదురు నీలం రంగు వృత్తాన్ని అశోక చక్రం అంటారు. ఇది అశోకుని ధర్మ చక్రం నుంచి స్వీకరించబడింది. దీనిలో ఉన్న 24 గీతలు రోజులోని 24 గంటలను సూచిస్తాయి. ఈ ప్రతి గీత ఒక విలువను తెలియజేస్తుంది, అవి: సత్యం, ధర్మం, శాంతి, అహింస వంటివి. ఈ చక్రం మన దేశం నిరంతరం ముందుకు సాగాలని, పురోగతిని సాధించాలని బోధిస్తుంది.
మన త్రివర్ణ పతాకాన్ని పింగళి వెంకయ్య రూపొందించారు. 1947 జూలై 22న రాజ్యాంగ సభ ఈ త్రివర్ణ పతాకానికి భారత జాతీయ జెండా హోదాను ఇచ్చింది. మన త్రివర్ణ పతాకం కేవలం ఒక జెండా మాత్రమే కాదు, మన దేశ గర్వం, స్వాతంత్య్రానికి చిహ్నం. అందుకే జెండాను ఎగురవేసేటప్పుడు మనం అనేక నియమాలను, గౌరవ మర్యాదలను పాటిస్తాం.