Just NationalJust InternationalLatest News

IndiGo: ప్రయాణికులకు నరకం చూపించిన ఇండిగోకి డబుల్ షాక్..కేంద్రంపై ఢిల్లీ హైకోర్టు ఫైర్!

IndiGo:ఒక సంస్థలో సంక్షోభం ఏర్పడితే, దాన్ని ఇతర విమానయాన సంస్థలు ప్రయోజనంగా మార్చుకోవడానికి ఎలా అనుమతి ఇచ్చారని న్యాయస్థానం ప్రశ్నించింది.

IndiGo

వారం రోజులుగా విమాన ప్రయాణికులకు అష్టకష్టాలు చూపించిన ఇండిగో ఎయిర్‌లైన్స్ (IndiGo Airlines) సంస్థపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలకు దిగగా, మరోవైపు ఢిల్లీ హైకోర్టు ఈ మొత్తం వ్యవహారంలో కేంద్రం వైఖరిని తప్పుబట్టడం చర్చనీయాంశమైంది. సాంకేతిక లోపాలు, సిబ్బంది సమస్యలు, నిర్వహణ వైఫల్యాలతో సతమతమవుతున్న ఇండిగో సంస్థకు ఈ చర్యలు డబుల్ షాక్ ఇచ్చాయి.

మొదటి షాక్ 10 శాతం సర్వీసుల కోత..ప్రయాణికులకు జరిగిన అసౌకర్యానికి గాను, ఇండిగో (IndiGo)సంస్థపై కఠినమైన చర్యలు ఉంటాయని కేంద్రం ప్రకటించిన 24 గంటల్లోనే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) కీలక ఆదేశాలు జారీ చేసింది.

రోజుకు 200 సర్వీసులు రద్దు.. ఇండిగో ప్రస్తుతం నడుపుతున్న విమాన సర్వీసుల్లో ఏకంగా 10 శాతం తగ్గించేయాలని ఆదేశించింది. దీని ప్రకారం, ఇండిగో రోజుకు కనీసం 200 విమాన సర్వీసులను రద్దు చేసుకోవాలి.

ఈ సర్వీసుల కోత నిర్ణయం తక్షణమే అమల్లోకి వచ్చి, వచ్చే మార్చి నెల వరకు (సుమారు నాలుగు నెలలు) కొనసాగనుంది.ఈ కోత ఇండిగోపై భారీ ఆర్థిక భారాన్ని మోపడమే కాకుండా, ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న వేలాది మంది ప్రయాణికులు తమ ప్రయాణాలను రీషెడ్యూల్ చేసుకోవాల్సి వస్తుంది.

రెండవ షాక్ గుత్తాధిపత్యంపై సీసీఐ దర్యాప్తు..ఇంత పెద్ద సంక్షోభానికి దారి తీసిన ఇండిగో వెనుక ఉద్దేశాలను దర్యాప్తు సంస్థలు పరిశీలించబోతున్నాయి.

మోనోపలీ కోణం.. విమానయాన రంగంలో తాను పూర్తి గుత్తాధిపత్యం (Monopoly) వహించేలా ఏదైనా వ్యూహం పన్నిందా? లేక పోటీని అణచివేయడానికి ప్రయత్నించిందా అనే కోణంలో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (CCI) విచారణ ప్రారంభించనుంది.

IndiGo
IndiGo

పోటీపై ప్రభావం.. ఇండిగో తరచుగా తన సర్వీసులను రద్దు చేసుకోవడం వల్ల ఇతర సంస్థలకు ప్రయోజనం చేకూరుతోందా, తద్వారా మార్కెట్‌లో ఇండిగో ఆధిపత్యం పెంచుకోవడానికి ప్రయత్నించిందా అనేది సీసీఐ పరిశీలించే ప్రధాన అంశం.

ఈ సంక్షోభంపై స్పందించిన ఢిల్లీ హైకోర్టు, ఇండిగోపై మాత్రమే కాక, మొత్తం వ్యవహారంలో కేంద్రం వ్యవహరించిన తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఇండిగో(IndiGo) విమానాలు వరుసగా రద్దు అవుతున్న సమయంలో, ఇతర విమానయాన సంస్థలు టికెట్ ఛార్జీలను భారీగా పెంచి (ముంబై-ఢిల్లీ మార్గంలో ఎకానమీ వన్-వే టిక్కెట్ ధర రూ. 35 వేల నుంచి రూ. 39 వేల వరకు) దోపిడీకి పాల్పడగా, కేంద్రం ఎందుకు వెంటనే స్పందించలేదని కోర్టు నిలదీసింది.

ఒక సంస్థలో సంక్షోభం ఏర్పడితే, దాన్ని ఇతర విమానయాన సంస్థలు ప్రయోజనంగా మార్చుకోవడానికి ఎలా అనుమతి ఇచ్చారని న్యాయస్థానం ప్రశ్నించింది.

అదనపు సొలిసిటర్ జనరల్ కేంద్రం తీసుకున్న చర్యల జాబితాను కోర్టుకు సమర్పించగా, న్యాయస్థానం వాటిని తిరస్కరించింది. “మీరు సంక్షోభం ఏర్పడిన తర్వాతే చర్యలు తీసుకున్నారు. ప్రశ్న అది కాదు. అసలు ఆ పరిస్థితి ఎందుకు తలెత్తింది? అప్పటి వరకు మీరు ఏం చేస్తున్నారు?” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. పైలట్‌లపై అధిక పనిభారం సమస్యను నివారించడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని కోర్టు కేంద్రాన్ని ఆదేశించింది.

మొత్తంగా, ఇండిగో డబుల్ షాక్ ఎదుర్కొంటూ, ఆర్థికంగా దెబ్బ తింటుండగా, ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యలు కేంద్ర విమానయాన రెగ్యులేటరీ వ్యవస్థలో లోపాలను ఎత్తి చూపాయి.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button