FASTag: ఫాస్టాగ్ ఏడాది పాస్.. ఈజీగా మొబైల్‌లోనే ఇలా రిజిస్టర్ చేసుకోవచ్చు..
FASTag:ముందుగా 'రాజమార్గ యాత్ర' యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి లేదా NHAI అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.

FASTag
ఆగస్టు 15వ తేదీ నుంచి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ప్రారంభించనున్న కొత్త వార్షిక ఫాస్టాగ్ పాస్ వాహనదారులకు ఒక గొప్ప శుభవార్త చెబుతోంది. ఇకపై జాతీయ రహదారులపై ప్రయాణాలు మరింత సౌకర్యవంతంగా, తక్కువ ఖర్చుతో మారనున్నాయి. ఈ పాస్ ద్వారా ఫాస్టాగ్ రీఛార్జ్‌ల గురించి లేదా పదేపదే టోల్ చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేకుండా ఏడాది పొడవునా సాఫీగా ప్రయాణించవచ్చు.
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రవేశపెట్టిన ఈ ఫాస్టాగ్(FASTag) వార్షిక పాస్, ఎక్కువగా హైవేలపై ప్రయాణించే వారికి సమయాన్ని, డబ్బును ఆదా చేస్తుంది. కార్లు, జీపులు, వ్యాన్‌లు వంటి ప్రైవేట్ వాహనాలకు మాత్రమే ఇది వర్తిస్తుంది. ఈ పాస్ కోసం ఒకేసారి రూ. 3,000 చెల్లించి, ఏడాదిలో 200 టోల్ క్రాసింగ్‌ల వరకు ఉచితంగా ప్రయాణించవచ్చు. ఇది టోల్ గేట్స్ వద్ద క్యూలో నిలబడాల్సిన అవసరాన్ని, ట్రాఫిక్ రద్దీని తగ్గించి, ప్రయాణికుల విలువైన సమయాన్ని ఆదా చేస్తుంది. ఇప్పటికే ఫాస్టాగ్ ఉన్నవారు కొత్త పాస్‌ను కొనాల్సిన అవసరం లేదని రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
ఈ వార్షిక ఫాస్టాగ్ పాస్ NHAI నిర్వహించే జాతీయ రహదారులు మరియు జాతీయ ఎక్స్‌ప్రెస్‌వేల పై మాత్రమే పనిచేస్తుంది. రాష్ట్ర రహదారులు లేదా మున్సిపల్ టోల్ రోడ్లపై మీ ఫాస్టాగ్ పనిచేసినప్పటికీ, టోల్ ఛార్జీలు ఎప్పటిలాగే వర్తిస్తాయి. ఈ పాస్ గడువు ముగిసిన తర్వాత సాధారణ ఫాస్టాగ్ సిస్టంలాగే రీఛార్జ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఏడాదిలో 200 ట్రిప్‌లు దాటితే, పాస్‌ను మళ్లీ రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఈ ఫాస్టాగ్ (FASTag)వార్షిక పాస్‌ను ఆన్‌లైన్‌లో సులభంగా పొందవచ్చు. దీని కోసం ముందుగా ‘రాజమార్గ యాత్ర’ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి లేదా NHAI అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. అక్కడ మీ వాహన రిజిస్ట్రేషన్ నంబర్ వివరాలను ఎంటర్ చేయాలి. మీ ప్రస్తుత ఫాస్టాగ్ యాక్టివ్‌గా, గడువు ముగియకుండా మరియు బ్లాక్‌లిస్ట్ చేయకుండా ఉన్నట్లు నిర్ధారించుకోవాలి. ఆ తర్వాత, రూ. 3,000 ఆన్‌లైన్‌లో చెల్లించాలి. చెల్లింపు పూర్తయిన వెంటనే, మీ యాన్యువల్ ఫాస్టాగ్ పాస్(FASTag annual pass) మీ ప్రస్తుత ఫాస్టాగ్ అకౌంట్‌కు లింక్ అవుతుంది. ఈ విధంగా మీరు సులభంగా జాతీయ రహదారులపై అపరిమిత ప్రయాణాన్ని ఆస్వాదించొచ్చు.
Also Read: FASTag :ఆగస్టు 15 నుంచి హైదరాబాద్ ORRపై ఫాస్టాగ్ వార్షిక పాస్ వర్తించదా?