ISRO: బాహుబలి రాకెట్‌తో అమెరికాకు ఇస్రో సాయం..ఇస్రో వందో ప్రయోగం ప్రత్యేకత ఏంటి?
ISRO: టవర్లు లేని మారుమూల ప్రాంతాల్లో కూడా ఈ ఉపగ్రహం ద్వారా హై-స్పీడ్ ఇంటర్నెట్ , కాల్స్ మాట్లాడుకునే సదుపాయం కలుగుతుంది.
ISRO
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) మరో అద్భుతమైన మైలురాయిని చేరుకోవడానికి సిద్ధమైంది. మన దేశ గర్వకారణమైన ఇస్రో, అంతరిక్ష ప్రయోగాల్లో వందవ ప్రయోగాన్ని (100th Mission) పూర్తి చేసుకోబోతోంది.
ఇది కేవలం ఒక ప్రయోగం మాత్రమే కాదు, భారత దేశం అంతరిక్ష రంగంలో ఎంతటి శక్తిగా ఎదిగిందో ప్రపంచానికి చాటిచెప్పే సందర్భం. ఒకప్పుడు సైకిల్‌పై రాకెట్ భాగాలను తీసుకెళ్లి, కేరళలోని తుంబా తీరం నుంచి చిన్న రాకెట్లను ప్రయోగించిన ఇస్రో, నేడు అమెరికా లాంటి అగ్రరాజ్యాల భారీ ఉపగ్రహాలను నింగిలోకి మోసుకెళ్లే స్థాయికి చేరుకుంది. ఈ నెల 24వ తేదీన శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ చారిత్రాత్మక ప్రయోగం జరగనుంది.
ఈ ప్రయోగంలో ప్రధాన ఆకర్షణ ఎల్వీఎమ్-3 (LVM-3) రాకెట్. దీన్ని మనం ముద్దుగా ‘బాహుబలి’ రాకెట్ అని పిలుచుకుంటాం. అయితే ఈసారి ప్రయోగించబోయేది కేవలం బాహుబలి కాదు, దానికి మరిన్ని మెరుగులు దిద్ది సామర్థ్యాన్ని పెంచిన ‘బాహుబలి-2’ లాంటి వెర్షన్ అని చెప్పొచ్చు.
🚀 LVM3-M6 Mission Launch Scheduled
The launch of LVM3-M6 is scheduled on 24 December 2025 at 08:54 hrs IST from the Second Launch Pad (SLP), SDSC SHAR, Sriharikota.
👀 The public can witness the launch from the Launch View Gallery, SDSC SHAR by registering online:
👉… pic.twitter.com/DXJ9JsFAhM— ISRO (@isro) December 19, 2025
గతంలో ఇస్రో (ISRO)కేవలం రెండు టన్నుల బరువున్న ఉపగ్రహాలను మాత్రమే ప్రయోగించగలిగేది. అంతకంటే ఎక్కువ బరువు ఉంటే మనం రష్యా లేదా ఫ్రెంచ్ గయానా దేశాల సహాయం కోరాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు మన బాహుబలి రాకెట్ 4 టన్నుల నుంచి ఏకంగా 6.5 టన్నుల బరువును మోసుకెళ్లేలా అప్‌గ్రేడ్ అయ్యింది. ఈ ప్రయోగం ద్వారా అమెరికాకు చెందిన ‘బ్లూబర్డ్-6’ (BlueBird-6) అనే భారీ ఉపగ్రహాన్ని ఇస్రో అంతరిక్షంలోకి ప్రవేశపెట్టనుంది.
బ్లూబర్డ్-6 ఉపగ్రహం గురించి చెప్పుకోవాలంటే, ఇది టెక్సాస్‌కు చెందిన ‘ఏ ఎస్ స్పేస్ మొబైల్’ అనే సంస్థ రూపొందించింది. నేరుగా మొబైల్ ఫోన్లకు బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందించడం ఈ ఉపగ్రహం యొక్క ప్రత్యేకత. అంటే టవర్లు లేని మారుమూల ప్రాంతాల్లో కూడా ఈ ఉపగ్రహం ద్వారా హై-స్పీడ్ ఇంటర్నెట్ , కాల్స్ మాట్లాడుకునే సదుపాయం కలుగుతుంది.

ఇస్రో చరిత్రలో ఇది అత్యంత బరువైన వాణిజ్య ప్రయోగం. అమెరికా తన ఉపగ్రహాన్ని ప్రయోగించడానికి ఇస్రోను ఎంచుకుందంటేనే మన టెక్నాలజీపై వారికి ఉన్న నమ్మకం ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇది మన దేశానికి విదేశీ మారక ద్రవ్యాన్ని తీసుకురావడమే కాకుండా, అంతరిక్ష మార్కెట్లో భారత్ వాటాను పెంచుతుంది.
ఈ 100వ ప్రయోగం విజయవంతం అయితే, ఇస్రో తర్వాత ప్రతిష్టాత్మక ప్రాజెక్టు అయిన ‘గగన్‌యాన్’కు మార్గం సుగమం అవుతుంది. ఎందుకంటే గగన్‌యాన్ ద్వారా భారతీయ వ్యోమగాములను అంతరిక్షంలోకి తీసుకెళ్లడానికి కూడా ఇదే ఎల్వీఎమ్-3 రాకెట్‌ను వాడబోతున్నారు. ఒకప్పుడు మనల్ని అవహేళన చేసిన దేశాలే ఇప్పుడు మన రాకెట్ల కోసం క్యూ కడుతున్నాయి.

డిసెంబర్ 24 ఉదయం 8.50 గంటలకు ఈ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ చారిత్రక ఘట్టాన్ని చూడటానికి ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. మన శాస్త్రవేత్తల కృషి, పట్టుదల ఈ ప్రయోగంతో మరోసారి ప్రపంచ వేదికపై మెరవబోతున్నాయి.



