Book Fair: అశోక్ నగర్ లైబ్రరీ నుంచి ఎన్టీఆర్ స్టేడియం వరకు.. హైదరాబాద్ బుక్ ఫెయిర్ చారిత్రక ప్రస్థానం!
Book Fair: డిసెంబర్ 19 నుంచి 29 వరకు ప్రతిరోజూ మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 9 గంటల వరకు హైదరాబాద్ బుక్ ఫెయిర్ సందర్శకులకు అనుమతి ఉంటుంది.
Book Fair
పుస్తక ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే హైదరాబాద్ బుక్ ఫెయిర్ – 2025 (Book Fair)అట్టహాసంగా ప్రారంభమైంది. శుక్రవారం సాయంత్రం లోయర్ ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న ఎన్టీఆర్ స్టేడియంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రొఫెసర్ కోదండరాం ఈ పుస్తక జాతరను ప్రారంభించారు. ఈసారి ఈ ప్రాంగణానికి ప్రజా కవి ‘అందెశ్రీ’ పేరు పెట్టడం ఒక విశేషం. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ, ఈ డిజిటల్ యుగంలో కూడా పుస్తకాలు చదివే అలవాటు తగ్గలేదని, అది మన సంస్కృతిని కాపాడుతుందని అన్నారు. ప్రతి ఇల్లు ఒక లైబ్రరీగా మారాలని ఆయన పిలుపునిచ్చారు. హైదరాబాద్ బుక్ ఫెయిర్ అనేది కేవలం పుస్తకాల అమ్మకం మాత్రమే కాదు, అదొక గొప్ప సాహిత్య ఉత్సవం.
హైదరాబాద్ బుక్ ఫెయిర్(Book Fair) చరిత్ర చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఇది 1985లో కేవలం కొన్ని స్టాల్స్ తో, అశోక్ నగర్ లోని సిటీ సెంట్రల్ లైబ్రరీ ప్రాంగణంలో చాలా చిన్నగా మొదలైంది. అప్పట్లో కేవలం స్థానిక పబ్లిషర్లు మాత్రమే ఉండేవారు. కానీ ఏటికేడాది దీనికి వస్తున్న స్పందన చూసి, వేదికలను మారుస్తూ వచ్చారు.
నిజాం కాలేజ్ గ్రౌండ్స్, పబ్లిక్ గార్డెన్స్, ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ దాటుకుని ఇప్పుడు ఎన్టీఆర్ స్టేడియం వరకు చేరింది. ఈ 38 ఏళ్ల ప్రస్థానంలో ఇది దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద బుక్ ఫెయిర్లలో ఒకటిగా నిలిచింది. ఈసారి 250కి పైగా స్టాల్స్, లక్షలాది పుస్తకాలు ఇక్కడ కొలువుదీరాయి. డిసెంబర్ 19 నుంచి 29 వరకు ప్రతిరోజూ మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 9 గంటల వరకు సందర్శకులకు అనుమతి ఉంటుంది.

విజయవాడ లేదా తిరుపతిలో జరిగే బుక్ ఫెయిర్ల కంటే హైదరాబాద్ బుక్ ఫెయిర్ ఎందుకు ప్రత్యేకం అంటే, ఇక్కడ ఉన్న వైవిధ్యం అంటారు పుస్తక ప్రియులు. హైదరాబాద్ ఒక కాస్మోపాలిటన్ నగరం కాబట్టి, ఇక్కడ తెలుగుతో పాటు ఉర్దూ, హిందీ, ఇంగ్లీష్, అరబిక్ భాషల పుస్తకాలు కూడా భారీగా అందుబాటులో ఉంటాయి. అలాగే, ఇక్కడ ‘కోటి’ బుక్ మార్కెట్ లో దొరికే అరుదైన సెకండ్ హ్యాండ్ పుస్తకాల స్టాల్స్ కూడా ఉంటాయి.
పాత తరం పాఠకులకు ఇష్టమైన నవలల నుంచి, నేటి తరం విద్యార్థులకు కావలసిన గ్రూప్స్, సివిల్స్ కోచింగ్ పుస్తకాల వరకు అన్నీ ఒకే చోట దొరకడం హైదరాబాద్ బుక్ ఫెయిర్ స్పెషాలిటీ. దీనికి తోడు ప్రతిరోజూ సాయంత్రం కవిసమ్మేళనాలు, పుస్తక ఆవిష్కరణలు ఈ జాతరకు మరింత కళను తీసుకొస్తాయి.
ఇప్పుడు’లాక్ ద బాక్స్’ వంటి ప్రైవేట్ బుక్ ఫెయిర్లు వస్తున్నా కూడా, హైదరాబాద్ బుక్ ఫెయిర్ కు ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఎందుకంటే ఇది ఒక ఎమోషన్. కుటుంబం మొత్తం కలిసి ట్యాంక్ బండ్ దగ్గర సాయంత్రం పూట పుస్తకాలు చూస్తూ, అక్కడ దొరికే తినుబండారాలు ఆస్వాదిస్తూ గడపడం హైదరాబాదీల కల్చర్లో భాగమైపోయింది.
పుస్తకం చదవడం అంటే ఒక చరిత్రలోకి ప్రయాణం చేయడం అని కోదండరాం గారు చెప్పినట్లు, ఈ పది రోజుల పాటు ఎన్టీఆర్ స్టేడియం ఒక జ్ఞాన భాండాగారంగా మారుతుంది. మీరు కూడా పుస్తక ప్రియులైతే, ఈ సాహిత్య జాతరను అస్సలు మిస్ అవ్వకండి.



