Modi: ఒకేసారి ఉద్యోగులు, వ్యాపారులకు మోదీ సర్కార్ దీపావళి కానుక
Modi: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన కీలక నిర్ణయాలు ఇప్పటికే తీసుకున్నారు. జనవరి 2025 నుండి అమల్లోకి వచ్చేలా 2% డీఏ/డీఆర్ పెంపును మార్చి 2025లో కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది.

Modi
దీపావళి పండుగ సమీపిస్తుండటంతో, కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్లు, సామాన్య ప్రజలు, వ్యాపారులకు భారీ శుభవార్త చెప్పనుందని సమాచారం. పెరుగుతున్న డియర్‌నెస్ అలవెన్స్ (DA), డియర్‌నెస్ రిలీఫ్ (DR) ప్రకటనలు ఒకవైపు సిద్ధమవుతుండగా, మరోవైపు జీఎస్టీ సంస్కరణలను అమలు చేయడంపై ప్రధానమంత్రి మోదీ(Modi) దృష్టి సారించారు. ఈ పరిణామాలు ఈ పండుగ సీజన్‌ను మరింత ఉత్సాహంగా మార్చనున్నాయి.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన కీలక నిర్ణయాలు ఇప్పటికే తీసుకున్నారు. జనవరి 2025 నుండి అమల్లోకి వచ్చేలా 2% డీఏ/డీఆర్ పెంపును మార్చి 2025లో కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. దీంతో 48 లక్షల మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 66 లక్షల మందికి పైగా పెన్షనర్లు ఇప్పుడు 55% డీఏ/డీఆర్ పొందుతున్నారు. ఇదిలా ఉండగా, జూలై 2025కి సంబంధించిన తదుపరి పెంపును సెప్టెంబర్ నెలలో ప్రకటించవచ్చని నివేదికలు సూచిస్తున్నాయి. ఈసారి 3% పెంపు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు, దీనితో డీఏ 58%కి పెరుగుతుంది. ఈ నిర్ణయం దీపావళి నాటికి అమలులోకి రావచ్చని భావిస్తున్నారు.

అదే సమయంలో, దేశ ఆర్థిక వ్యవస్థను మరింత పటిష్టం చేయడానికి, వ్యాపారాలను సులభతరం చేయడానికి ప్రధాని మోదీ(Modi) కీలకమైన జీఎస్టీ సంస్కరణలను ఈ దీపావళికి ముందే అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సంస్కరణలు సుపరిపాలనకు చిహ్నం. జీవితాన్ని, వ్యాపారాన్ని సులభతరం చేయడమే మా లక్ష్యం. అందుకే మేము తదుపరి తరం సంస్కరణలను జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తున్నాము” అని ఆయన తెలిపారు. ఈ సంస్కరణలు దీపావళికి ఒక డబుల్ బోనస్‌గా నిలుస్తాయని, పేదలు, మధ్యతరగతి ప్రజలు, చిన్న, పెద్ద వ్యాపారులకు నేరుగా ప్రయోజనం కలుగుతుందని ఆయన అన్నారు.
మరిన్ని నేషనల్ న్యూస్అప్ డేట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
దీంతోపాటు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన మరో ముఖ్యమైన అంశం 8వ వేతన సంఘం(8th Pay Commission). జనవరి 2025లో దీనికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినా, అధికారిక నోటిఫికేషన్ ఇంకా విడుదల కాలేదు. దీనికి సంబంధించి సకాలంలో నోటిఫికేషన్ జారీ చేయబడుతుందని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి గతంలో పార్లమెంటులో తెలిపారు. ఈ వేతన సంఘం అమలుతో భవిష్యత్తులో ఉద్యోగుల జీతాలు, పెన్షన్లలో మరింత గణనీయమైన పెరుగుదల ఆశించవచ్చు. ఈ మూడు కీలకమైన అంశాలు ఈ దీపావళికి ప్రజలకు నిజమైన కానుకలుగా నిలవనున్నాయి.