Maharashtra: మహారాష్ట్రలో పవార్ ఫ్యామిలీ రీ-యూనియన్..ఈ పొత్తు వెనుక అసలు మాస్టర్ ప్లాన్ ఇదేనా?
Maharashtra: గడియారం, బూర గుర్తులు మళ్లీ కలవడం మహారాష్ట్ర రాజకీయాల్లో సంచలనమే సృష్టించింది.
Maharashtra
మహారాష్ట్ర (Maharashtra)రాజకీయాల గతిని మార్చే కీలక పరిణామం చోటుచేసుకుంది. కొంతకాలంగా విడిపోయి, వేర్వేరు దారుల్లో నడిచిన పవార్ కుటుంబం మళ్లీ ఒక్కటైంది. డెప్యూటీ సీఎం అజిత్ పవార్ నేతృత్వంలోని నేషనల్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ), తన బాబాయ్ శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ (ఎస్పీ)తో కలిసి 2026 జనవరి 15న జరగనున్న పింప్రి-చించ్వడ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. గడియారం , బూర గుర్తులు మళ్లీ కలవడం మహారాష్ట్ర(Maharashtra) రాజకీయాల్లో సంచలనమే సృష్టించింది. అయితే ఇది కేవలం సీట్ల సర్దుబాటు మాత్రమే కాదు, 2029 వరకు మహారాష్ట్ర పవర్ ప్లే ఎలా ఉండబోతుందో చెప్పే ఒక పెద్ద రాజకీయ ట్రైలర్ అని విశ్లేషకులు భావిస్తున్నారు.
పింప్రి-చించ్వడ్ , పుణె ప్రాంతాలు పవార్ కుటుంబానికి కంచుకోటలు. అక్కడ విడివిడిగా పోటీ చేస్తే ఓట్లు చీలిపోయి బీజేపీ లేదా షిండే శివసేన లాభపడే అవకాశం ఉంది. అందుకే మరాఠా-ఓబీసీ ఓటు బ్యాంక్ చెక్కుచెదరకుండా ఉండాలి అంటే పవార్ కుటుంబం కలవడం అనివార్యమైంది. దీనిని అజిత్ పవార్ అభివృద్ధి కోసం తీసుకున్న నిర్ణయం అని అభివర్ణించినా కూడా, దీని వెనుక తన రాజకీయ వారసత్వాన్ని సుస్థిరం చేసుకోవాలన్న బలమైన ఆకాంక్ష కనిపిస్తోంది. తానూ పవార్ వారసుడినే అని క్యాడర్‌కు సంకేతం ఇస్తూ, భవిష్యత్తులో పార్టీని మళ్లీ ఏకం చేసే దిశగా అజిత్ పవార్ పావులు కదుపుతున్నారు.
ఈ పొత్తు వల్ల పవార్ కుటుంబానికి లాభనష్టాలు సమానంగా ఉన్నాయి.లాభం ఏంటంటే పవార్ బ్రాండ్ మళ్లీ బలోపేతం అవుతుంది. విడిపోయిన కుటుంబం అనే ముద్ర పోయి, రాజకీయంగా బేరమాడే శక్తి (Bargaining Power) పెరుగుతుంది. అజిత్ పవార్ బీజేపీ-షిండే కూటమిలో ఉన్నప్పటికీ, లోకల్ స్థాయిలో శరద్ పవార్‌తో కలవడం ద్వారా అటు బీజేపీకి కూడా చెక్ పెట్టవచ్చు. ఇక నష్టం సంగతి చూస్తే శరద్ పవార్ వర్గంలోని క్యాడర్‌లో కొంత గందరగోళం ఏర్పడొచ్చు. బీజేపీతో కలిసి ఉన్న అజిత్ పవార్‌తో మళ్లీ జతకట్టడంపై కార్యకర్తలు ఎలా స్పందిస్తారనేది చర్చనీయాంశం.

బీజేపీ , మహావికాస్ అఘాడీ (MVA) పరిస్థితి ఏమిటి? .. పవార్ కుటుంబం కలవడంతో బీజేపీకి అర్బన్ బెల్టుల్లో గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా పుణె, పింప్రి-చించ్వడ్ వంటి నగరాల్లో పవార్ల జంట బలం పెరిగితే కనుక బీజేపీ సీట్లు తగ్గే ప్రమాదం ఉంది. మరోవైపు, శరద్ పవార్ వర్గం పుణెలో మళ్లీ ఎంవీఏతో చర్చలు జరపడం ద్వారా తనను తాను ఇంకా యాంటీ-బీజేపీ క్యాంప్‌లోనే ఉన్నట్లు ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు. అయితే కాంగ్రెస్, శివసేన (యూబీటీ) మాత్రం.. పవార్ కుటుంబం బీజేపీతో సైలెంట్ అండర్ స్టాండింగ్‌లో ఉందేమోనన్న అనుమానాలను వ్యక్తం చేస్తున్నాయి.
ఎవరికి కింగ్ మేకర్ అయ్యే అవకాశం ఉంది?.. జనవరి 15న జరిగే 29 మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు ఈ పొత్తుకు ఒక ల్యాబ్ టెస్ట్ లాంటివి. ఈ ప్రయోగం కనుక సక్సెస్ అయితే, రాబోయే అసెంబ్లీ , లోక్‌సభ ఎన్నికలకి మహారాష్ట్ర(Maharashtra)లో కొత్త సమీకరణాలు పుట్టుకొస్తాయి. అజిత్ పవార్ తన బలాన్ని నిరూపించుకుని బీజేపీతో మరింత గట్టిగా బేరమాడొచ్చు, అలాగే శరద్ పవార్ కూడా తన క్యాడర్ బలాన్ని చాటి చెప్పొచ్చు. మొత్తానికి, పవార్ కుటుంబం మళ్లీ ఒక్కటవ్వడం అనేది ఒక మున్సిపల్ ఒప్పందం మాత్రం కాదు, మహారాష్ట్రలో రాబోయే పెద్ద రాజకీయ యుద్ధానికి పునాది. ఎవరికీ శాశ్వత లాభం లేకపోయినా, పవార్ బ్రాండ్ మాత్రం మళ్లీ సెంటర్ స్టేజ్‌లోకి వచ్చి కూర్చుంది.



