Unnao Rape Case: ఉన్నావో అత్యాచార కేసు.. కుల్దీప్ సింగ్ బెయిల్ పై సుప్రీం స్టే
Unnao Rape Case: దీనిపై బాధిత మహిళ, ఆమె సన్నిహితులు ఢిల్లీలో నిరసనకు దిగడం. వారిపై భద్రతా బలగాలు దురుసుగా ప్రవర్తించడం కూడా తీవ్ర దుమారాన్ని రేపింది.
Unnao Rape Case
పలుకుబడి ఉన్న నేతలు ఏ కేసులో దోషిగా తేలినా శిక్ష తప్పించుకునేందుకు తమ పరిధిలో అన్ని ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ముఖ్యంగా రాజకీయ నాయకుడైతే ఇక అధికారులపైనా, పోలీసులపైనా, చివరకు కోర్టులపైనా ఒత్తిడి తెచ్చేందుకు వెనుకాడరు. అయితే కింది స్థాయిలో వీరి ఒత్తిడి పనిచేసినా అత్యున్నత న్యాయస్థానం దగ్గర మాత్రం వీరి వేషాలకు చెక్ పడుతుంటుంది.
తాజాగా సుప్రీంకోర్టులో మరోసారి ఇలాంటి ఘటనే ఎదురైంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావో అత్యాచార కేసు(Unnao Rape Case)లో దోషిగా తేలిన బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్‌కు సుప్రీంకోర్టు దిమ్మతిరిగే షాకిచ్చింది. ఢిల్లీ హైకోర్టు ఇటీవల అతనికిచ్చిన బెయిల్ పై స్టే విధించింది. నిజానికి ఈ కేసులో మొదట నుంచీ ఊహించని మలుపులు చోటు చేసుకుంటున్నాయి.
తన పలుకుబడితో ఏదో విధంగా కేసు నుంచి తప్పించుకుందామని చివరి వరకూ ప్రయత్నాలు చేసిన కుల్దీప్ సింగ్ సెంగార్ చివరికి దొరికిపోయి దోషిగా తేలారు. అయితే శిక్ష అనుభవిస్తూనే తెరవెనుక తన ప్రయత్నాలు మాత్రం ఆపలేదు. ఈ క్రమంలోనే ఢిల్లీ హైకోర్టులో బెయిల్ మంజూరవగా బాధితురాలు సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. అత్యున్నత న్యాయస్థానం ఆమె పక్షానే నిలిచింది.
జూన్ 2017లో ఈ ఉన్నావో అత్యాచార ఘటన(Unnao Rape Case) దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి శశిసింగ్ అనే మహిళ బాధితురాలను బీజేపీ నేత కుల్దీప్ సెంగర్ వద్దకు తీసుకెళ్లింది. అప్పుడు ఆయన ఉన్నావో ఎమ్మెల్యేగా ఉన్నారు. శశిసింగ్ మాటలు నమ్మి వచ్చిన మైనర్ బాధితురాలిపై ఎమ్మెల్యే అత్యాచారానికి పాల్పడ్డాడు. ఉద్యోగం ఇవ్వకపోగా అత్యాచారం గురించి ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు.

బాధితురాలు ఫిర్యాదు చేసినప్పుడు తప్పుడు కేసు పెట్టి ఆమె తండ్రిని అరెస్ట్ చేయించడం, అతను జైలులోనే చనిపోవడం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని రేపింది. మధ్యలో ఉన్నావో అత్యాచార (Unnao Rape Case)బాధిత మహిళను చంపేందుకు కూడా ప్రయత్నించారు. ఆ ఘటనలో బాధితురాలు తప్పించుకోగా ఆమె బంధువులైన ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. బాధితురాలి లాయర్ తీవ్రంగా గాయపడడంతో ఎమ్మెల్యేపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. అటు పలు ప్రజాసంఘాలు, ఇతర రాజకీయ నాయకులు దీనిని తీవ్రంగా ఖండించి బాధితురాలికి అండగా నిలవడంతో దేశవ్యాప్తంగా ఈ రేసు సంచలనంగా మారింది.
చివరకు ట్రయల్ కోర్టు విచారణలో దోషిగా తేలిన కుల్దీప్ సింగ్ సెంగార్ కు జీవితఖైదు పడింది. దీనిపై ఆయన హైకోర్టును ఆశ్రయించగా కోర్టు ఆ శిక్షను నిలిపివేస్తూ బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ మంజూరు చేసే క్రమంలో ఢిల్లీ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు కూడా వివాదాస్పదమయ్యాయి.
దీనిపై బాధిత మహిళ, ఆమె సన్నిహితులు ఢిల్లీలో నిరసనకు దిగడం. వారిపై భద్రతా బలగాలు దురుసుగా ప్రవర్తించడం కూడా తీవ్ర దుమారాన్ని రేపింది. ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తూ బాధితురాలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిని విచారించిన అత్యున్నత న్యాయస్థానం బెయిల్ పై స్టే విధించి కుల్దీప్ సింగ్ కు నోటీసులు జారీ చేసింది.



