Just NationalLatest News

Cold: గజగజ వణికిస్తున్న చలి..స్కూల్ టైమింగ్స్ మార్పు!

Cold: ఉత్తర భారతదేశం నుంచి వీస్తున్న చలి గాలుల ప్రభావంతో రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు చేరుకున్నాయి.

Cold

తెలంగాణ రాష్ట్రాన్ని చలి (Cold)పులి గజగజ వణికిస్తోంది. కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతుండటంతో ప్రజలు, ముఖ్యంగా చిన్న పిల్లలు,వృద్ధులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఉత్తర భారతదేశం నుంచి వీస్తున్న చలి గాలుల ప్రభావంతో రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు చేరుకున్నాయి.

తెల్లవారుజామున దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో వాహనదారులు రోడ్లపైకి రావడానికి భయపడుతున్నారు. ఈ విపరీతమైన చలి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, విద్యార్థుల ఆరోగ్యం పాడవకూడదనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం , జిల్లా యంత్రాంగాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి.

ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో చలి(Cold) తీవ్రత అత్యధికంగా ఉంది. ఇక్కడ కనిష్ట ఉష్ణోగ్రతలు 6 నుంచి 7 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయాయి. ఇంతటి చలిలో ఉదయం 8 లేదా 9 గంటలకే విద్యార్థులు పాఠశాలలకు వెళ్లడం వల్ల వారికి జలుబు, దగ్గు వంటి అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. దీన్ని గమనించిన ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా గారు తక్షణమే స్పందించి స్కూల్ టైమింగ్స్ మారుస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Cold
Cold

ఇప్పటివరకు ఉదయం 9.00 గంటల నుంచి సాయంత్రం 4.15 గంటల వరకు ఉన్న సమయాలను సవరించారు. కొత్త నిబంధనల ప్రకారం పాఠశాలలు ఉదయం 9.40 గంటలకు ప్రారంభమై, సాయంత్రం 4.30 గంటల వరకు కొనసాగుతాయి.

ఈ మార్పులు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, కేజీబీవీ , మోడల్ స్కూళ్లకు వర్తిస్తాయని కలెక్టర్ స్పష్టం చేశారు. ఎవరైనా ఈ నిబంధనలను ఉల్లంఘించి పాఠశాలలను త్వరగా ప్రారంభిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

కేవలం ఆదిలాబాద్ మాత్రమే కాకుండా, హైదరాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మెదక్ వంటి జిల్లాల్లో కూడా చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. రాబోయే 24 నుండి 48 గంటల్లో చలి గాలులు ఇంకా తీవ్రమయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. పరిస్థితిని బట్టి మిగిలిన జిల్లాల్లో కూడా కలెక్టర్లు పాఠశాల సమయాల్లో మార్పులు చేసే అవకాశం కనిపిస్తోంది.

మరిన్ని నేషనల్ న్యూస్అప్ డేట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button