Just NationalLatest News

EC : ఈసీ ‘SIR’ నిర్ణయం వెనుక అసలు కథ

EC : భారత ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మగా నిలిచే ఎన్నికల ప్రక్రియను మరింత పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఒక కీలక నిర్ణయం తీసుకుంది.

EC : భారత ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మగా నిలిచే ఎన్నికల ప్రక్రియను మరింత పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఓటర్ల జాబితాల సమగ్రతను కాపాడే లక్ష్యంతో దేశవ్యాప్తంగా ‘ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ’ (Special Integrated Revision – SIR) కార్యక్రమాన్ని చేపట్టాలని ప్రకటించింది. దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఈ SIR ప్రక్రియ కోసం త్వరలో షెడ్యూల్‌ను జారీ చేస్తామని ఈసీ తన తాజా ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

EC

ఈసీ నిర్ణయం వెనుక రాజ్యాంగ బలం.. చట్టబద్ధత
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 మరియు ప్రజాప్రాతినిధ్య చట్టం, 1950 ప్రకారం, పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలకు సంబంధించిన ఓటర్ల జాబితాల తయారీ, ఎన్నికల నిర్వహణ, పర్యవేక్షణ, నియంత్రణ, దిశానిర్దేశం చేసే అధికారం కేంద్ర ఎన్నికల సంఘానికి ఉంది. ఈ అధికారాల ఆధారంగానే స్వేచ్ఛాయుత, న్యాయబద్ధమైన ఎన్నికల నిర్వహణకు SIR అత్యవసరమని ఈసీ పేర్కొంది.

ఓటర్ల జాబితాల తయారీకి సంబంధించిన విధానాలన్నీ ప్రజాప్రాతినిధ్య చట్టం, 1950 మరియు ప్రజాప్రాతినిధ్య చట్టం, 1960 ప్రకారం జరుగుతాయి. గతంలోనూ, ఈసీ అనేక సందర్భాల్లో SIRను చేపట్టింది. చివరిసారిగా 2003లో బీహార్‌తో సహా దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఓటర్ల జాబితాలను కొత్తగా తయారు చేయడానికి ఈ ప్రక్రియను నిర్వహించింది.

ఎందుకు ఈ ‘ప్రత్యేక సమగ్ర సవరణ’ (SIR)? అంటే..ఓటర్ల జాబితాలో అర్హులైన ప్రతి ఒక్కరూ ఉండాలి, అనర్హులు తొలగించబడాలి అనే సూత్రంపై ఈసీ కట్టుబడి ఉంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 326 ప్రకారం, భారత పౌరుడై ఉండి, అర్హత తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించబడుతుంది.

గత 20 సంవత్సరాల్లో, ఓటర్ల జాబితాలో భారీ స్థాయిలో మార్పులు చోటు చేసుకున్నాయి. వేగవంతమైన పట్టణీకరణ, ప్రజల తరచుగా వలసలు వంటి కారణాల వల్ల ఈ మార్పులు తప్పనిసరి అయ్యాయి. దీని వల్ల, కొంతమంది ఓటర్లు ఒకచోట తమ ఓటు హక్కును నమోదు చేసుకొని, మరోచోటికి వెళ్లి స్థిరపడినా కూడా, వారి ఓట్లు అసలు నివాస స్థలంలోనే కొనసాగుతున్నాయి.

ఇలాంటి అసామరస్యాలను సరిదిద్దడానికి, ప్రతి వ్యక్తిని ఓటరుగా నమోదు చేసుకునే ముందు లేదా వారి వివరాలను నవీకరించే ముందు ధ్రువీకరించడానికి SIR అవసరం అని ఈసీ నొక్కి చెప్పింది. ఇది ఓటర్ల జాబితా సమగ్రతకు అత్యంత కీలకం. ఇలా.. ప్రజాప్రాతినిధ్య చట్టం, 1950లోని సెక్షన్ 21 సహా ఇతర నిబంధనల ప్రకారం SIRను నిర్దేశించే అధికారం ఈసీకి ఉంది.

ఓటర్ల జాబితా(Voter List) సమగ్రతను పరిరక్షించడానికి దేశవ్యాప్తంగా SIRను ప్రారంభించాలని ఈసీ నిర్ణయించినా కూడా.. ప్రస్తుత పరిస్థితుల వల్ల బీహార్‌లోని రాబోయే శాసనసభ ఎన్నికల దృష్ట్యా అక్కడి నుంచే ఈ ప్రక్రియను మొదలుపెట్టాలని ఈసీ నిర్ణయం తీసుకుంది.

బీహార్‌లో చివరి SIR 2003లో చేపట్టబడింది, అప్పటి అర్హత తేదీ 01-01-2003. ఇప్పుడు, 2003 నాటి ఓటర్ల జాబితాలో పేరు నమోదు కాని ఏ వ్యక్తి అయినా, అర్హత గల పత్రాలను సమర్పించి తమ పేరును ఓటరు జాబితాలో చేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. దేశంలోని మిగిలిన ప్రాంతాలలో SIR కోసం షెడ్యూల్‌ను సకాలంలో జారీ చేస్తామని ఈసీ స్పష్టం చేసింది.

కాగా, బీహార్‌(Bihar)లో SIR చేపడుతుండటంపై రాజకీయ రచ్చ మొదలైంది. బీజేపీ , దాని మిత్రపక్షాలకు లబ్ధి చేకూరే విధంగా ఈ ప్రక్రియను చేపడుతున్నారని ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ ఆరోపణలను ఎన్నికల సంఘం ఇటీవల గట్టిగా ఖండించింది. సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌పై కౌంటర్‌ అఫిడవిట్‌లో ఈసీ తన రాజ్యాంగ బాధ్యతలను సమర్థించుకుంది. నకిలీ ఓటర్లను జాబితా నుంచి తొలగించడమే SIR ముఖ్య ఉద్దేశమని, దీని వల్ల అర్హులైన ఓటర్లకు ఎలాంటి నష్టం ఉండబోదని స్పష్టం చేసింది. మొత్తంగా ప్రస్తుతం బీహార్‌ రాష్ట్రం ఈ SIR ప్రక్రియకు సంబంధించిన రాజకీయ చర్చలతో హాటుహాటుగా మారింది.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button