Ziro Valley: అరుణాచల్ ప్రదేశ్‌లోని మినీ స్విట్జర్లాండ్..ఇక్కడి ఆచారాలు,అందాలు అన్నీ స్పెషలే
Ziro Valley: సముద్ర మట్టానికి సుమారు 5 వేల అడుగుల ఎత్తులో ఉండే ఈ లోయ, లోయ చుట్టూ పైన్ చెట్లు, పచ్చని వరి పొలాలు, ఎత్తైన కొండలతో పర్యాటకులను ఆ ప్రాంతం మంత్రముగ్ధులను చేస్తుంది.
Ziro Valley
చాలామంది వేసవి సెలవుల్లో లేదా హాలిడేస్‌లో ఊటీ, కొడైకెనాల్, మనాలీ వంటి ప్రదేశాలకు వెళ్తుంటారు. కానీ, ప్రకృతి ప్రేమికులకు మాత్రం అరుణాచల్ ప్రదేశ్‌లోని ‘జిరో వ్యాలీ’ (Ziro Valley) ఒక స్వర్గంలాంటిది. దీనిని భారతదేశపు ‘మినీ స్విట్జర్లాండ్’ అని పిలుస్తారు.
సముద్ర మట్టానికి సుమారు 5 వేల అడుగుల ఎత్తులో ఉండే ఈ లోయ, లోయ చుట్టూ పైన్ చెట్లు, పచ్చని వరి పొలాలు, ఎత్తైన కొండలతో పర్యాటకులను ఆ ప్రాంతం మంత్రముగ్ధులను చేస్తుంది. అయితే జిరో వ్యాలీ(Ziro Valley) కేవలం ప్రకృతి అందాలకు మాత్రమే కాదు, అక్కడ నివసించే అపతాని (Apatani)అనే తెగ వారి విలక్షణమైన సంస్కృతికి కూడా ప్రపంచవ్యాప్తంగా పేరు పొందింది.
అపతాని తెగ వారు ప్రకృతిని ఆరాధిస్తారు. వారి వ్యవసాయ పద్ధతులు చూడటానికి చాలా విభిన్నంగా ఉంటాయి. ఒకే పొలంలో వరిని పండిస్తూ ఉంటారు. మళ్లీ అందులోనే చేపలను కూడా పెంచుతారు. దీనిని ‘ఫిష్ కమ్ పాడీ కల్చర్’ అంటారు. ఈ పద్ధతి ప్రపంచంలో మరో చూద్దామన్నా కూడా ఎక్కడా కనిపించదు.

ఇక్కడ మరొక వింతైన విషయం ఏమిటంటే, ఈ తెగకు చెందిన మహిళలు ముక్కుకు పెద్ద పెద్ద నల్లటి బిళ్లలు (Nose plugs) లేదా నల్లటి గీతలు పెట్టుకుంటారు. ఎందుకంటే పూర్వకాలంలో అపతాని మహిళలు చాలా అందంగా ఉండేవారట.. వారిని ఇతర తెగల వారు ఎత్తుకెళ్లకుండా ఉండటానికే ఇలా వారికి వారే తమ ముఖాలను వికృతం చేసుకునేవారని స్థానికులు చెబుతూ ఉంటారు. చివరకు ఇది ఇప్పుడు వారి సంస్కృతిలో ఒక భాగంగా మారిపోయింది.
టూరిస్టుల కోసం ఇక్కడ జీరో మ్యూజిక్ ఫెస్టివల్ కూడా జరుగుతుంది. సంగీత ప్రియులకు అయితే ఇది ఒక పెద్ద పండుగలాంటిది. సెప్టెంబర్ నెలలో జరిగే ఈ ఉత్సవానికి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడో ఉన్న కళాకారులు వస్తుంటారు.
ప్రశాంతమైన వాతావరణం, అక్కడి స్థానికంగా చేసే స్పెషల్ వంటకాలు, వెదురుతో చేసిన వస్తువులు పర్యాటకులకు సరికొత్త అనుభూతిని ఇస్తాయి. ఎవరైనా సరే రద్దీ లేని, ప్రశాంతమైన ప్రదేశానికి వెళ్లాలనుకుంటే మాత్రం వారికి జిరో వ్యాలీ (Ziro Valley)ఒక అద్భుతమైన ఛాయిస్. ఇక్కడి హోం స్టేలలో ఉంటూ స్థానిక సంస్కృతిని దగ్గర నుంచి చూడటం ఒక మర్చిపోలేని అనుభవం అవుతుంది.



