Ambati Rambabu: ఫేక్ వీడియోతో మళ్లీ బుక్కయిన అంబటి రాంబాబు..ఈసారి ఏకంగా..
Ambati Rambabu: గతంలోనూ ఆయన అనేక ఆడియో టేపుల వివాదాల్లో చిక్కుకున్నారు, అయినా అవన్నీ తప్పుడు ప్రచారాలుగా కొట్టిపారేసే ప్రయత్నం చేశారు అంబటి.

Ambati Rambabu
రాజకీయ నాయకుల అతి తెలివితేటలు కొన్నిసార్లు వారిని అడ్డంగా బుక్ చేస్తాయి. ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) మాజీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu)విషయంలో అదే జరిగింది. కడప జిల్లాలోని పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో పార్టీకి ఎదురైన ఘోర పరాజయాన్ని జీర్ణించుకోలేక, ఆయన చేసిన ఒక ఫేక్ పోస్ట్ ఇప్పుడు ఆయనను నవ్వులపాలు చేసింది. ఈ పోస్ట్ ప్రజలనే కాదు, పార్టీ శ్రేణుల్లో కూడా పరువు తీసేలా ఉంది.
పులివెందులలో వైసీపీకి డిపాజిట్ కూడా దక్కని పరిస్థితి ఎదురవడంతో, మాజీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu) తన ఎక్స్ అకౌంట్లో ఒక వీడియో పోస్ట్ చేశారు. “ఈ జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు కోయ ప్రవీణ్ ఐపీఎస్కి అంకితం! అని ఆయన పోస్ట్ చేశారు. అయితే, ఆయన పోస్ట్ చేసిన వీడియోలోని బ్యాలెట్ పేపర్ల రంగులు, దాని వెనుక ఉన్న ఆడియో ఇప్పుడు ఆయనను పూర్తిగా అడ్డంగా బుక్ చేశాయి.
ఈ ZPTC ఎన్నికల ఫలితాలు
కోయ ప్రవీణ్ IPS కి అంకింతం ! pic.twitter.com/vU4dptyZOH— Ambati Rambabu (@AmbatiRambabu) August 14, 2025
ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల నియమావళి ప్రకారం, స్థానిక ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్లకు నిర్దిష్ట రంగులు ఉంటాయి. ఎంపీటీసీ ఎన్నికలకు తెల్లని (White) బ్యాలెట్ పేపర్లు వాడితే, జడ్పీటీసీ ఎన్నికలకు గులాబీ (Pink) రంగు బ్యాలెట్లు వాడతారు. ఈ నిబంధన చాలా ప్రామాణికమైనది. అయితే, అంబటి రాంబాబు పోస్ట్ చేసిన వీడియోలో పసుపు (Yellow) రంగు బ్యాలెట్లు ఉన్నాయి.
పశ్చిమ బెంగాల్ వంటి ఇతర రాష్ట్రాల్లోని ఎన్నికలకు పసుపు రంగు బ్యాలెట్లను వాడతారు. అంతేకాకుండా, వీడియో వెనుక గత ఎన్నికల్లో టీడీపీ కార్యకర్తలను ఉత్సాహపరిచిన “ధూం ధూం” పాటను కూడా పెట్టారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల వీడియోను ఏపీ ఎన్నికల వీడియోగా నమ్మించేందుకు చేసిన ఈ ప్రయత్నం వారి అతితెలివితేటలకు, దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమన్న విమర్శలు మూటకట్టుకున్నారు అంబటి.
అయితే ఇలా చేయడం అంబటి ఒక్కరికే కాదు టోటల్ వైసీపీ శ్రేణులకు అలవాటే అని చెప్పడానికి కొన్ని ఉదాహరణలు కూడా ఉన్నాయి.ఇటీవల వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటన అట్టర్ ఫ్లాప్ అయ్యిందని ఆరోపణలు వచ్చినప్పుడు, వైసీపీ సోషల్ మీడియా విభాగం ఒక వీడియోను ప్రచారం చేసింది.
ఆ వీడియో నెల్లూరులో జరిగిన కార్యక్రమం అని ప్రచారం చేశారు. కానీ, వీడియో ఎడిటింగ్ సరిగా చేయకపోవడంతో అందులో “బంగారుపాళ్యం వ్యవసాయ మార్కెట్ కమిటీ” బోర్డు కనిపించింది. బంగారుపాళ్యం చిత్తూరు జిల్లాలో ఉండగా, నెల్లూరులో జరిగిన పర్యటనకు ఆ బోర్డును వాడటం వైసీపీ అతితెలివికి నిదర్శనంగా మారింది. ఈ ఘటనపై సోషల్ మీడియాలో భారీగా ట్రోలింగ్ జరిగింది.

అలాగే ఇటీవల ఒక సందర్భంలో, ఆయన సింగయ్య అనే ఒక వ్యక్తికి సంబంధించిన ఘటనపై తప్పుడు ప్రచారాలు చేశారని ఆరోపణలు ఎదుర్కొన్నారు. అయితే, ఆయన మీడియా ముందుకు వచ్చి, తమపైనే తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని విపక్షాలపై విమర్శలు చేశారు. కానీ ఈ మొత్తం వ్యవహారంలో ఆయన ప్రచారం చేసిన అంశాలే తప్పు అని తేలింది. గతంలోనూ ఆయన అనేక ఆడియో టేపుల వివాదాల్లో చిక్కుకున్నారు, అయినా అవన్నీ తప్పుడు ప్రచారాలుగా కొట్టిపారేసే ప్రయత్నం చేశారు అంబటి.
ఇప్పటికైనా పోలీసులు, ఎన్నికల కమిషన్ ఇలాంటి ఫేక్ ప్రచారాలపై సుమోటోగా కేసు నమోదు చేసి, తగు చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అప్పుడే ఇలాంటి ఫేక్ ప్రచారాలకు ఒక ముగింపు వస్తుందని అంటున్నారు.
Also Read: AP: ఏపీకి ముంచుకొస్తున్న వరద ముప్పు.. భారీ వర్షాలతో ఆ జిల్లాల్లో హై అలర్ట్