CPI Narayana: చిరు, నాగ్ సీపీఐ నారాయణకు టార్గెట్ అయ్యారా?
CPI Narayana: మాట అనేసి వెనక్కి తీసుకుంటే ఒప్పయిపోతుందా నారాయణా..జస్ట్ ఆస్కింగ్ అంటున్న నెటిజన్లు

CPI Narayana
నిజాలను నిర్భయంగా ప్రశ్నించాల్సిన చోట మౌనంగా ఉండే నాయకులు.. సెలబ్రిటీల విషయంలో మాత్రం తమ నోటికి పదును పెట్టడం అనేది సాధారణం అయిపోయింది. ఇలాంటి నాయకుల్లో ముందుండే వ్యక్తి సీపీఐ నారాయణ అని నెటిజన్ల ట్యాగ్ లైన్ వేయించుకున్న సంగతి తెలిసిందే. గతంలో సినీనటులు నాగార్జున, సమంత విషయంలో తన విమర్శలతో వివాదాస్పదమైన ఈయన, ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవిపై మరోసారి అడ్డదిడ్డంగా మాట్లాడి వార్తల్లోకి ఎక్కారు. ఈ ఘటనతో నారాయణపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రాజకీయాలనుంచి తప్పుకున్నా కూడా చిరంజీవిని కొందరు రాజకీయ నాయకులు వదలడం లేదు. అయితే తాజాగా దీనిపై స్పందించిన మెగాస్టార్ సోషల్ మీడియాలో విమర్శలు, దూషణలు సర్వసాధారణంగా మారాయని..దీనిపై నేను మాట్లాడనక్కర్లేదు… నా పని మాట్లాడుతుంది” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే చిరంజీవి చేసిన ఈ వ్యాఖ్యలపైన సీపీఐ నారాయణ (CPI Narayana) మరోసారి రెచ్చిపోయారు.

చిరంజీవి విజ్ఞతతో మాట్లాడాలని చెప్పిన నారాయణ(CPI Narayana) ..గతంలో చిరంజీవి గురించి తాను మాట్లాడిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నానని అన్నారు. ఇప్పుడు ఆ వీడియోలను వైరల్ చేసి తనను బద్నాం చేయడం సరికాదని అది ఆయనకే వదిలేస్తున్నానంటూ చిరంజీవికి కౌంటర్ ఇచ్చారు. ఆ మాటలను వెనక్కి తీసుకున్నా ముందుకు తీసుకున్నా మాట అయితే అన్నారు కదా నారాయణ..అందుకే అనే ముందు ఆలోచించుకోవాలి కానీ ఇలా చీటికిమాటికి మీడియా ముందు గగ్గోలు పెట్టడం దేనికి అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
నిజానికి నారాయణ ఇలా మాట్లాడటం ఇదే మొదటిసారి కాదు. ఇది ఆయనకు అలవాటుగా మారిపోయిందని నెటిజన్లు అంటున్నారు. గతంలో నాగార్జున(Nagarjuna)పై పరువు లేని వాడు పరువు నష్టం పిటిషన్ వేయడం హాస్యాస్పదం అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే, నాగార్జున బిగ్ బాస్ షో హోస్ట్‌గా వెళ్లి ప్రజాదరణ కోల్పోవడం హాని చేసిందని కూడా విమర్శించారు.

అంతేకాకుండా, చిరంజీవి(Chiranjeevi)పైన కూడా గతంలోనే ఇలాగే మాట్లాడారు. సినిమా కార్మికుల వేతన పెంపు కోసం నిర్మాతలు చిరంజీవితో సమావేశమైనప్పుడు, నిర్మాతలు చిరంజీవితో కలవడం అంటే పులికి మేకని అప్పగించడంలోనూ తేడా లేదని కామెంట్లు చేశారు.తర్వాత ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నా మెగా ఫ్యాన్స్ మాత్రం నారాయణపై నెట్టింట్లో వీర లెవల్లో ఫైరయ్యారు.
సెలబ్రెటీలపై పదేపదే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం నారాయణకు ఒక వ్యసనంగా మారిందని, ఏదో ఒక విధంగా వార్తల్లో నిలవడానికి ఈ వ్యూహాన్ని వాడుతున్నారని నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. అసలు మొదటి నుంచీ కూడా చిరంజీవి, నాగార్జున పైనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. మరి ఈ వివాదం ఇక్కడితో ముగుస్తుందా లేక ఇంకా కొనసాగుతుందా అనేది వేచి చూడాలి.
Also Read: CM Chandrababu: వారిని దూరం పెట్టండి..సీఎం చంద్రబాబు వార్నింగ్