Just PoliticalJust NationalLatest News

Nepal:కొత్త అధ్యాయాన్ని సృష్టించిన జెన్-Z.. నేపాల్ సంక్షోభం భారత్, చైనాలకు సవాల్ విసురుతోందా?

Nepal: ఇంటర్నెట్‌తో పుట్టి పెరిగిన జెన్-జీ తరం. సాంప్రదాయ పత్రికలు, టీవీ ఛానెళ్లు అణచివేయబడినప్పుడు, ఈ తరం సోషల్ మీడియాను తమ ఆయుధంగా మార్చుకుంది.

Nepal

నేపాల్‌(Nepal)లో సోషల్ మీడియాపై నిషేధం విధించినప్పుడు, ప్రభుత్వం ఒక సాధారణ నిర్ణయం తీసుకున్నామని భావించింది. కానీ, వారికి తెలియని విషయం ఏమిటంటే, ఆ నిర్ణయం ఒక నిద్రపోతున్న శక్తిని మేల్కొల్పింది. అదే, ఇంటర్నెట్‌తో పుట్టి పెరిగిన జెన్-జీ తరం. సాంప్రదాయ పత్రికలు, టీవీ ఛానెళ్లు అణచివేయబడినప్పుడు, ఈ తరం సోషల్ మీడియాను తమ ఆయుధంగా మార్చుకుంది.

నిరసనకారులు వాట్సాప్ గ్రూపులు, ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లు, టిక్‌టాక్ వీడియోల ద్వారా వేగంగా ఒక్కటి అయ్యారు. ప్రభుత్వం విధించిన నిషేధాలను దాటవేస్తూ, వీపీఎన్‌ల (VPNs) సహాయంతో తమ సమాచారాన్ని ప్రపంచానికి చేరవేశారు. పోలీసులు ఎక్కడ అడ్డుకుంటున్నారో, నిరసనకారులు ఎక్కడ గుమికూడుతున్నారో, అణచివేత చర్యలు ఎలా జరుగుతున్నాయో వారు లైవ్ స్ట్రీమ్‌ల ద్వారా ప్రజలకు చూపించారు.

Nepal
Nepal

ఈ డిజిటల్ రిపోర్టింగ్, నిజమైన వార్తలను వేగంగా ప్రజల్లోకి తీసుకెళ్లి, ప్రజాగ్రహాన్ని పెంచింది.ముఖ్యంగా డిజిటల్ యుగంలో పుట్టి పెరిగిన జెన్-జీ తరం, ఈ చర్యను తమ జీవన విధానంపై దాడిగా భావించారు. రాజకీయ నాయకుల పిల్లల విలాసాల చిత్రాలు, వీడియోలు షేర్ చేస్తూ, వారి అవినీతిని ప్రపంచానికి ఎత్తిచూపారు. ఈ డిజిటల్ ఆర్గనైజింగ్ సామర్థ్యమే నేపాల్‌ రాజకీయ చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని సృష్టించింది.

సోషల్ మీడియా నిషేధానికి వ్యతిరేకంగా మొదలైన నిరసనలు, పోలీసుల కాల్పుల్లో 19 మంది నిరసనకారులు ప్రాణాలు కోల్పోవడంతో అల్లకల్లోలంగా మారాయి. ఈ ఘటన యావత్ దేశాన్ని కదిలించింది. ప్రజల ఆవేశానికి అడ్డూఅదుపు లేకుండా పోయింది. దీని వల్ల ఏకంగా, ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ, అధ్యక్షుడు రామ్ చంద్ర పౌడెల్ ప్రభుత్వాలు ప్రజాగ్రహానికి బలై అధికార పీఠం నుంచి దిగిపోవాల్సి వచ్చింది. ఆగ్రహంతో ఊగిపోయిన ప్రజలు పార్లమెంటు భవనాన్ని తగలబెట్టారు. ఈ పరిణామం నేపాల్‌లో తీవ్రమైన అధికార శూన్యతను సృష్టించింది.

ఈ తిరుగుబాటు కేవలం సోషల్ మీడియా నిషేధం వల్ల మాత్రమే జరగలేదు. దీని వెనుక దశాబ్దాల రాజకీయ అస్థిరత, నిరుద్యోగం, అపారమైన అసమానతలు ఉన్నాయంటున్నారు విశ్లేషకులు. 17 ఏళ్లుగా నేపాల్ గణతంత్ర దేశంగా ఏర్పడినప్పటి నుంచి, వరుస సంకీర్ణ ప్రభుత్వాలు కేవలం ఘర్షణలతోనే కాలాన్ని గడిపాయి.

Nepal
Nepal

దేశంలో నిరుద్యోగం 21 శాతానికి చేరగా, మూడింట ఒక వంతు జనాభా బతుకుదెరువు కోసం విదేశాలకు వలస వెళ్తున్నారు. అదే సమయంలో, పాలక వర్గాల పిల్లలు విదేశాల్లో విలాసవంతమైన జీవితం గడపడం, ఆ చిత్రాలు సోషల్ మీడియా ద్వారా ప్రజలకు చేరడం వారిలో అగ్గి రాజేసింది. తమ కష్టానికి, పాలకుల భోగాలకు మధ్య ఉన్న వ్యత్యాసం పాలకవర్గాలపై ఉన్న నమ్మకాన్ని పూర్తిగా దెబ్బతీసింది.

అయితే నేపాల్‌(Nepal)లో ఏర్పడిన ఈ అధికార శూన్యత ..పొరుగు దేశాలైన భారత్, చైనాలకు ఒక కొత్త వ్యూహాత్మక సవాలుగా మారింది. గద్దె దిగిన ప్రధాని ఓలీ చైనాకు సన్నిహితుడిగా అందరికీ తెలుసు. ఇప్పుడు నేపాల్‌పై పట్టు కోసం ఈ రెండు దేశాల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అయితే, నేపాల్‌ను ఒక వివాదాస్పద అంశంగా మార్చుకోవడం రెండు దేశాలకూ ఇష్టం లేదు. ఈ ఉమ్మడి ఆసక్తి నేపాల్‌లో త్వరగా స్థిరత్వం తిరిగి రావడానికి సహాయపడొచ్చు.

ఈ సంక్షోభం పాత రాజకీయ వ్యవస్థకు అంతం పలికి, కొత్త నాయకత్వానికి దారి తీస్తోంది. ఖాట్మండు మేయర్ బలేంద్ర షా వంటి యువ నాయకులు జెన్-జీ నిరసనకారులకు ఆశాకిరణంగా మారారు. ఈ పరిణామం నేపాల్ రాజకీయాల్లో ఒక కొత్త శకానికి నాంది పలుకుతోంది. పాతతరం నాయకులను కాదని, సాంకేతికతతో పెరిగిన కొత్తతరం నేపాల్ భవిష్యత్తును ఎలా నిర్మిస్తుందో చూడాలి.

Nepal: నేపాల్‌లో ఉద్రిక్తత..తెలుగు వారిని రప్పించడానికి ఏపీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button