Kavitha: కూతురిపై సస్పెన్సన్ వేటు వేసిన గులాబీ బాస్..
Kavitha: కల్వకుంట్ల కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం రాజకీయ వర్గాల్లో, మీడియా విశ్లేషకులలో తీవ్ర చర్చకు దారితీస్తోంది.

Kavitha
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు అత్యంత సంచలనాత్మక వార్త ఇదే. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కుటుంబంలో కీలక సభ్యురాలు, పార్టీకి ముద్దుల చెల్లెమ్మగా గుర్తింపు పొందిన కల్వకుంట్ల కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం రాజకీయ వర్గాల్లో, మీడియా విశ్లేషకులలో తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఇది కేవలం ఒక రాజకీయ నిర్ణయం మాత్రమే కాదు, పార్టీలో, కుటుంబంలో చోటు చేసుకున్న అంతర్గత విభేదాలకు అద్దం పడుతోంది.
కొద్ది రోజులుగా కవిత (Kavitha)వ్యవహారశైలి బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత కలహాలకు దారితీసింది. ఆమె సోషల్ మీడియాలో పార్టీ అధికారిక ఖాతాలను అన్‌ఫాలో చేయడం, ఇతర నేతలపై మీడియాలో వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం, ముఖ్యంగా హరీష్ రావు వంటి కీలక నేతలతో విభేదాలు పార్టీ నాయకత్వానికి అభద్రత కలిగించాయి. ఇది ఆమె పార్టీ నుంచి పూర్తిగా విడిపోవడానికి సిద్ధమవుతున్నారన్న సంకేతాలను ఇచ్చింది.
కవిత(Kavitha) సస్పెన్షన్ వెనుక ప్రధాన కారణాలుగా ఈ అంశాలు కనిపిస్తున్నాయి. కవిత వ్యాఖ్యలు పార్టీ ప్రతిష్టకు నష్టం కలిగించేవిగా ఉన్నాయి. కుటుంబ రాజకీయాల్లో వచ్చిన వ్యక్తిగత విభేదాలు పెరగడం కూడా కారణమే.అలాగే కవిత చర్యలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి. పార్టీ శ్రేణులు, మద్దతుదారులు ఆమెను తొలగించాలని కేసీఆర్‌ను కోరుతూ పోస్టులు పెట్టడం పరిస్థితిని మరింత తీవ్రతరం చేసింది.

రాజకీయంగా ఎన్నో వ్యూహాలు పన్ని విజయం సాధించిన కేసీఆర్, తన కుటుంబంలో ఈ స్థాయిలో బహిరంగంగా “క్రమశిక్షణా చర్య (Disciplinary Action)” తీసుకోవడం ఇదే మొదటిసారి. ఇది పార్టీలో క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పడానికి ఒక బలమైన ఉదాహరణ. కవిత (Kavitha)వ్యాఖ్యలు, చర్యలపై పార్టీలో ఎలా స్పందించాలనే విషయంలో నేతల్లో సందిగ్ధత నెలకొంది. ఈ సందర్బంగానే కేసీఆర్ సోమవారం రాత్రి పలువురు ముఖ్య నేతలతో ఎర్రవెల్లిలోని తన ఫామ్‌హౌస్‌లో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కేటీఆర్, జగదీష్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి వంటి కీలక నేతలు పాల్గొన్నారు. హరీష్ రావు లండన్ పర్యటనలో ఉన్నారు.
కేసీఆర్ ఈ వ్యవహారంలో ఎలా ముందుకు వెళ్తారని అంతా ఎదురుచూస్తున్న సమయంలో, కవిత సస్పెన్షన్ వార్త ఒక్కసారిగా ప్రకంపనలు సృష్టించింది. చాలా మంది విశ్లేషకులు దీనిని పార్టీకి కొంత నష్టం, కానీ భవిష్యత్తు కోసం ఒక స్పష్టమైన సందేశంగా అభివర్ణిస్తున్నారు. పార్టీలో ఇకపై క్రమశిక్షణారాహిత్యాన్ని సహించబోమని కేసీఆర్ ఈ చర్య ద్వారా స్పష్టం చేశారు.
ఈ నిర్ణయం రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ రాజకీయ ప్రవర్తనలో, అధికారంలో సంస్కరణలకు దారితీస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది కవిత రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపనుండగా, పార్టీలో అంతర్గత గందరగోళం మరింత పెరిగే అవకాశం ఉంది.
One Comment