Rahul Gandhi: ఓట్ల చోరీకి ఆధారాలు ఇవే..రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు
Rahul Gandhi:బయటి రాష్ట్రాల నుంచి ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లోకి నకిలీ ఐడీలతో లాగిన్ అయ్యి ఓట్లను తొలగిస్తున్నారంటూ రాహుల్ గాంధీ తాజాగా ఆరోపించారు.

Rahul Gandhi
కొన్నిరోజులుగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎన్నికల సంఘంపై గుప్పిస్తున్న ఆరోపణలు ఇప్పుడు తారస్థాయికి చేరుకున్నాయి. సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత పలు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లోనూ కాంగ్రెస్ కు ప్రతికూల ఫలితాలే వచ్చాయి. ఈ క్రమంలో ఆయా రాష్ట్రాల ఫలితాలపై కాంగ్రెస్ పోస్ట్ మార్టం చేసుకునే పనిలో పడింది.
అయితే ఓట్ల చోరీ కారణంగానే పలు స్థానాల్లో కాంగ్రెస్ ఓడిపోయిందంటూ రాహుల్ గాంధీ (Rahul Gandhi)చెబుతున్నారు. తమ పార్టీకి గట్టిపట్టున్న స్థానాల్లోనూ ఓటమి పాలవడంతో డీప్ గా స్డడీ చేశామంటూ ఓట్ చోరీ అంశాన్ని లేవనెత్తారు. ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘంపై పలుసార్లు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. అలాగే మీడియాను పిలిచి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఇచ్చారు.
దీనిపై చర్చ జరుగుతున్నప్పుడు తనపై సాలిడ్ ఫ్రూఫ్స్ ఉన్నాయంటూ గతంలోనే చెప్పిన రాహుల్ గాంధీ తాజాగా ప్రెస్ మీట్ పెట్టి ఈసీకి సవాళ్ళు విసిరారు. ఈ ప్రెస్ మీట్ లో రాహుల్ గాంధీ(Rahul Gandhi) పలు సంచలన ఆరోపణలు చేశారు. బయటి రాష్ట్రాల నుంచి ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లోకి నకిలీ ఐడీలతో లాగిన్ అయ్యి ఓట్లను తొలగిస్తున్నారంటూ రాహుల్ గాంధీ తాజాగా ఆరోపించారు.

తన ఆరోపణలకు సాక్ష్యాలుగా పలు అంశాలను వివరించారు. కర్ణాటకలోని ఆళంద నియోజకవర్గంలో ఓట్ల తొలగింపు జరిగిందని చెబుతున్నారు. ఆళందలో 6 వేల ఓట్లను తొలగించేందుకు ప్రయత్నించారన్నది రాహుల్ ఆరోపణ. యాదృఛ్ఛికంగా ఈ విషయం బయటపడిందని రాహుల్ చెబుతున్నారు. ప్రతిపక్ష పార్టీలకు మద్ధతుగా ఉన్న ఓట్లు లేకుండా చేయడమే వారి టార్గెట్ గా ఉందన్నారు. కాంగ్రెస్ అత్యంత బలంగా ఉన్న నియోజకవర్గాల్లో అజ్ఞాత శక్తులు ఇదే పని చేస్తున్నాయని ఆయన ఆరోపిస్తున్నారు. దీనికి ఉదాహరణగా గోదాబాయి పేరును వాడుకున్నారంటూ వెల్లడించారు.
గోదాబాయి పేరుతో లాగిన్ అయ్యి 12 ఓట్లు తొలగించారని, ఇలా నకిలీ ఐడీలతో లాగిన్ కావడం.. ఓట్లు తొలగించడం క్రమం తప్పకుండా జరుగుతోందంటూ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న బూత్ లే లక్ష్యంగా ఈ ఓట్ల తొలగింపు జరుగుతోందని రాహుల్ ఆరోపిస్తున్నారు. ఈ మొత్తం తతంగం నడిపించేందుకు ప్రత్యేకంగా సాఫ్ట్ వేర్ నే రూపొందించారని చెబుతున్నారు. తాను పూర్తి ఆధారాలుంటేనే మాట్లాడతానని, 100 శాతం ఆధారాలు ఉన్నాయని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.
వారం రోజుల్లో ఈసీ ఓటర్ల డేటాను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ఈసీ డేటా విడుదల చేయకుంటే ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజ్యాంగాన్ని నాశనం చేస్తున్న వ్యక్తులకు అండగా ఉంటున్నారని తాము భావించాల్సి ఉంటుందంటూ హెచ్చరించారు. కాగా రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఈసీపై ఆరోపణలు చేస్తూ ప్రెజెంటేషన్ ఇవ్వడం ఇది రెండోసారి. ఆగష్ట్ మొదటి వారంలోనూ ఇలాంటి ప్రెజెంటేషనే ఇచ్చిన రాహుల్ గాంధీ.. ఈసీ, బిజెపి కుమ్మక్కై ఓట్ల చోరీ తతంగం నడిపిస్తున్నాయని ఆరోపించారు.