Goddess Lakshmi: చంద్రుడికి లక్ష్మీదేవి సోదరి అని తెలుసా?
Goddess Lakshmi: లక్ష్మీ నారాయణులు వేర్వేరు కారని, ఒకరి శక్తి మరొకరిలో ఉందని భక్తులు విశ్వసిస్తారు.లక్ష్మీదేవి అవతారాల గురించి అనేక కథలు ఉన్నాయి.

Goddess Lakshmi
హిందూ పురాణాలలో, ఇతిహాసాలలో శ్రీ మహాలక్ష్మి స్థానం అత్యంత ఉన్నతమైనది. ఆమె కేవలం సంపదలకు అధిష్ఠాన దేవత మాత్రమే కాదు, శ్రీ మహావిష్ణువుకు ఆది నుండి తోడుగా ఉన్న శక్తి స్వరూపిణి. అందుకే ఆమెను ‘నిత్యానపాయిని’ అని అంటారు. లక్ష్మీ నారాయణులు వేర్వేరు కారని, ఒకరి శక్తి మరొకరిలో ఉందని భక్తులు విశ్వసిస్తారు.
లక్ష్మీదేవి (Goddess Lakshmi)అవతారాల గురించి అనేక కథలు ఉన్నాయి. దేవీ భాగవతం ప్రకారం, సృష్టి ఆరంభంలోనే సృష్టిని పాలించమని పరమాత్మ విష్ణువుకు లక్ష్మీదేవిని తోడుగా ఇచ్చింది. ఒకానొక సందర్భంలో లక్ష్మీదేవి విష్ణువు నుంచి వేరు కావడం వల్ల ఆయన శక్తిహీనుడయ్యారని పురాణాలు చెబుతాయి. అప్పుడు బ్రహ్మ ఆజ్ఞతో భృగు మహర్షి తపస్సు చేయగా, లక్ష్మీదేవి ఆయనకు, ఖ్యాతికి కుమార్తెగా జన్మించింది. అందుకే ఆమెను ‘భార్గవి’ అని పిలుస్తారు.
మరో ప్రసిద్ధ కథనం ప్రకారం, దూర్వాస మహర్షి శాపం వల్ల లక్ష్మీదేవి వైకుంఠాన్ని వీడి పాలసముద్రంలో నివసించింది. దేవతలు, రాక్షసులు అమృతం కోసం మందర పర్వతాన్ని కవ్వంగా, వాసుకిని తాడుగా చేసుకుని క్షీరసాగర మథనం చేసినప్పుడు, అందులో నుంచి ఎన్నో దివ్య వస్తువులతో పాటు శ్రీ మహాలక్ష్మి ఉద్భవించింది. పాలసముద్రం నుంచి పుట్టింది కాబట్టి ఆమె సముద్రరాజ తనయగా కీర్తించబడింది. ఆమెతో పాటు జన్మించిన చంద్రుడు ఆమెకు సోదరుడయ్యాడు. ఇలా వివిధ అవతారాలను ధరించిన లక్ష్మీదేవి విష్ణువు యొక్క శక్తికి, మాయకు కారణభూతురాలుగా పూజలందుకుంటుంది. భూదేవి కూడా లక్ష్మీదేవి మరో అంశమని చెబుతారు.
శ్రీ మహావిష్ణువు ఏ రూపంలో అవతరించినా లక్ష్మీదేవి(Goddess Lakshmi) ఆయనకు తోడుగా అవతరిస్తుందని పురాణాలు చెబుతాయి. రామావతారంలో సీతగా, కృష్ణావతారంలో రుక్మిణిగా, కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామికి అలవేలుమంగగా లక్ష్మీదేవి ఆవిర్భవించారు. ఈ అంశం లక్ష్మీ నారాయణుల అన్యోన్యతను, వారి శక్తి ఒక్కటేనని చాటి చెబుతుంది.
లక్ష్మీదేవి(Goddess Lakshmi)కి ఎన్నో పేర్లు ఉన్నాయి. లక్ష్మీ, శ్రీ, సిరి, పద్మ, పద్మాక్షి, పద్మాసన, రమ, ఇందిర వంటివి ఆమె అష్టోత్తర, సహస్రనామాల్లో కొన్ని. ఆమెను సాధారణంగా నాలుగు చేతులతో, చేతుల్లో పద్మాలు, ధన కుంభంతో, పద్మాసనంలో ఆసీనురాలై ఉన్నట్లుగా చిత్రిస్తారు. ఆమె వాహనం గుడ్లగూబ.

పురాణాల ప్రకారం లక్ష్మీదేవి ప్రతిమ చాలా అందంగా, యవ్వనాకృతిలో ఉండాలి. ఎర్రని పెదాలు, గుండ్రని ముఖం కలిగి, దివ్యాభరణాలతో మెరిసిపోతూ ఉండాలని మత్స్య పురాణం వివరిస్తుంది. ఆమె ఒక చేతిలో పద్మం, మరో చేతిలో బిల్వఫలాలను ధరించి, ఇరువైపులా ఏనుగులు కలశాలతో అభిషేకాలు చేస్తున్నట్లు చిత్రిస్తారు. విష్ణుధర్మోత్తర పురాణం ప్రకారం, దేవి స్వతంత్ర మూర్తిగా ఉన్నప్పుడు శంఖం, చక్రం, గద, పద్మం వంటి వాటిని ధరించి చతుర్భుజాలతో ఉంటుంది.
లక్ష్మీదేవి వివిధ రూపాలలో అష్టలక్ష్ములుగా (Ashta Lakshmi )ప్రసిద్ధి చెందారు. వారు: ఆదిలక్ష్మి, ధైర్య లక్ష్మి, ధాన్య లక్ష్మి, గజలక్ష్మి, సంతాన లక్ష్మి, విజయ లక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి. ఈ ఎనిమిది రూపాల్లో భక్తులకు ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క ఫలితం లభిస్తుందని నమ్మకం. ఈ విధంగా లక్ష్మీదేవి కేవలం సంపదకే కాకుండా, జ్ఞానం, విజయం, ధాన్యం, సంతానం, ధైర్యం వంటి అనేక శుభాలకు అధిష్టాన దేవతగా పూజలందుకుంటుంది.
Also Read: Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ దర్శన టికెట్లు, గదుల బుకింగ్ తేదీలు ఇవే