Vamana Jayanti: శ్రీమహావిష్ణువు ఐదో అవతారం.. వామన జయంతి మహత్యం, ప్రాముఖ్యత
Vamana Jayanti: వామనావతారం ద్వారా ఆయన కేవలం దుష్ట శిక్షణ మాత్రమే కాకుండా, దానగుణానికి, వినయానికి ప్రతీకగా నిలిచిన బలిచక్రవర్తికి మోక్షాన్ని ప్రసాదించాడు.

Vamana Jayanti
సెప్టెంబర్ 4, వామన జయంతి(Vamana Jayanti). హిందూ పురాణాల ప్రకారం శ్రీమహావిష్ణువు దశావతారాల్లో ఐదవది వామనావతారం. ఈ అవతారం ద్వారా ఆయన కేవలం దుష్ట శిక్షణ మాత్రమే కాకుండా, దానగుణానికి, వినయానికి ప్రతీకగా నిలిచిన బలిచక్రవర్తికి మోక్షాన్ని ప్రసాదించాడు.
బలి చక్రవర్తి మహాత్మ్యం..అసురుల రాజైన బలిచక్రవర్తి మహాభక్తుడైన ప్రహ్లాదుని మనుమడు. విశ్వజిత్ యాగం చేసి, అనేక దానాలు చేసి అమోఘమైన శక్తిని సంపాదించి ఇంద్రలోకాన్ని తన వశం చేసుకున్నాడు. దీనితో దేవతలు తమ రాజ్యాన్ని కోల్పోయి నిస్సహాయంగా మారారు. దేవతల తల్లి అదితి, తన భర్త కశ్యప మహర్షి వద్దకు వెళ్లి తమ కష్టాలను వివరించింది. అప్పుడు కశ్యపుడు ఆమెకు పయో వ్రతం చేయమని ఉపదేశించాడు. ఆ వ్రత ఫలితంగా, భాద్రపద శుద్ధ ద్వాదశి నాడు మధ్యాహ్నం శ్రీమహావిష్ణువు వామన (పొట్టి బ్రాహ్మణుని) రూపంలో ఆమె గర్భం నుంచి అవతరించాడు.
వామనుని యాచన, శుక్రాచార్యుని హెచ్చరిక.. బలిచక్రవర్తి తన యాగశాలలో దానాలు చేస్తున్నప్పుడు, వామనుడు అక్కడికి వచ్చాడు. చిన్న బ్రాహ్మణుని రూపంలో ఉన్న వామనుడిని చూసి బలిచక్రవర్తి ఆయనకు స్వాగతం పలికి ఏమి కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు వామనుడు కేవలం మూడు అడుగుల నేల మాత్రమే యాచించాడు.
వామనుడు సామాన్య వ్యక్తి కాదని గ్రహించిన బలి గురువు శుక్రాచార్యుడు, “ఇతడు సామాన్యుడు కాదు, స్వయంగా శ్రీమహావిష్ణువు. ఈయనకు దానం చేస్తే నీ రాజ్యాన్ని కోల్పోతావు” అని హెచ్చరించాడు. కానీ బలి “మాట ఇచ్చి వెనక్కి తగ్గను, ప్రాణాలు పోయినా సరే ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను” అని దృఢంగా చెప్పాడు. దానితో ఆగ్రహించిన శుక్రాచార్యుడు బలిని శపించి వెళ్లిపోయాడు.

దానం, వామనుని విరాటరూపం..బలి వామనుడి పాదాలు కడిగి, దానం ఇవ్వడానికి కలశం నుండి నీరు పోస్తుండగా, శుక్రాచార్యుడు ఒక కీటకం రూపంలో కలశం రంధ్రాన్ని మూసివేశాడు. అప్పుడు వామనుడు దర్భతో ఆ రంధ్రాన్ని పొడవగా, శుక్రాచార్యుడు ఒక కన్ను కోల్పోయాడు. దానం పూర్తయిన తర్వాత వామనుడు అకస్మాత్తుగా విరాట రూపం ధరించాడు. ఒక పాదంతో భూమిని, రెండవ పాదంతో ఆకాశాన్ని కొలిచాడు. మూడవ పాదం ఎక్కడ పెట్టాలని బలిని అడగగా, బలి వినయంగా తన తలపై పెట్టమన్నాడు. వామనుడు మూడో పాదాన్ని బలి తలపై ఉంచి అతన్ని అధఃపాతాళానికి నెట్టాడు.
బలికి వరం..బలి దానగుణానికి, ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ధర్మానికి సంతోషించిన శ్రీమహావిష్ణువు, ప్రతి సంవత్సరం ఒక రోజు భూమిపైకి వచ్చి తన ప్రజలను దర్శించుకునే వరం ఇచ్చాడు. కేరళలో జరిగే ఓనం పండగ ఈ బలి చక్రవర్తి రాకకు సంకేతంగా జరుపుకుంటారు.
వామన జయంతి(Vamana Jayanti) రోజున శ్రీమహావిష్ణువును స్మరించడం, ఆలయాలలో ప్రత్యేక పూజలు చేయడం శుభప్రదం. ఈ రోజున చేసే పూజలు, దానాలు పాపనాశనం చేసి, ఐశ్వర్యాన్ని, సుఖసంతోషాలను ఇస్తాయని భక్తులు నమ్ముతారు. వామన జయంతి దానగుణానికి, వినయానికి, ధర్మపాలనకు ఒక స్మారక దినం.