Kalabhairava: కాలభైరవ అష్టమి విశిష్టత ..మీ కష్టాలన్నీ తీర్చే క్షేత్రపాలక ఆరాధన
Kalabhairava: ముఖ్యంగా జాతకంలో శని దోషం, రాహు దోషం ఉన్నవారు కాల భైరవుడిని ఆరాధిస్తే త్వరగా ఉపశమనం లభిస్తుందని పురాణాలు చెబుతాయి.
Kalabhairava
పరమశివుని ఉగ్ర రూపమైన కాలభైరవుడిని కాలానికి , మృత్యువుకు అధిపతిగా భావిస్తారు. మార్గశిర మాసంలో వచ్చే కాలభైరవ(Kalabhairava) అష్టమి రోజున ఆయన్ని పూజించడం వల్ల మనకున్న ఎన్నో దోషాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. ముఖ్యంగా జాతకంలో శని దోషం , రాహు దోషం ఉన్నవారు కాల భైరవుడిని ఆరాధిస్తే త్వరగా ఉపశమనం లభిస్తుందని చెబుతాయి.
కాశీ క్షేత్రానికి ఈయన రక్షకుడు (క్షేత్ర పాలకుడు). అందుకే కాశీ వెళ్లే భక్తులు మొదట కాలభైరవుడి అనుమతి తీసుకుని, ఆ తర్వాతే విశ్వేశ్వరుడిని దర్శించుకోవడం ఆచారంగా వస్తుంది. భైరవుడి(Kalabhairava) వాహనం కుక్క (శునకం). ఈ రోజు కుక్కలకు ఆహారం పెట్టడం వల్ల భైరవుడి అనుగ్రహం లభిస్తుందని పురాణాలు చెబుతాయి.

కాలభైరవ అష్టమి రోజు భైరవుడికి వడమాల సమర్పించడం,అలాగే నువ్వుల నూనెతో దీపం వెలిగించడం వల్ల ఆకస్మిక ప్రమాదాల నుంచి మీకు రక్షణ లభిస్తుంది. భైరవుడు అంటే భయం కలిగించే దైవం కాదు, మనలో ఉన్న భయాన్ని తొలగించే దైవం అని అర్ధం చేసుకోవాలి.
సమయాన్ని వృధా చేయకుండా, క్రమశిక్షణతో జీవించే వారికి కాలభైరవుడు ఎప్పుడూ తోడుంటాడు. కాలం అనేది ఎవరి కోసమూ ఆగదు, ఆ కాలాన్ని సరైన మార్గంలో నడిపించే శక్తే..ఈ కాల భైరవుడు. ఈ రోజు, అలాగే కష్టాలు కమ్ముకున్నప్పుడు కాలభైరవ అష్టకాన్ని పఠించడం వల్ల కష్టాలు తొలిగి మానసిక ప్రశాంతత లభిస్తుంది.అంతేకాదు సమస్యల్లో ఉన్నప్పుడు భైరవుడిని స్మరిస్తే ఆయనే స్వయంగా రక్షిస్తాడని భక్తుల ప్రగాఢ నమ్మకం.



