Temple: ఇంట్లో దేవుడిని పూజిస్తున్నా గుడికి ఎందుకు వెళ్తారు?
Temple: ఒక దేవాలయం కేవలం రాతి గోడల మధ్య ఉండే విగ్రహం కాదు, అది ఒక శక్తిమంతమైన క్షేత్రం అని పురాణాలు చెబుతూ ఉంటాయి.

Temple
మన ఇంట్లోనే దేవుడిని పూజిస్తున్నప్పుడు దేవాలయాని(Temple)కి వెళ్లి దర్శనం చేసుకోవాల్సిన అవసరం ఏమిటని చాలామందికి అనుమానం వస్తూ ఉంటుంది. కానీ, ఈ ప్రశ్నకు సమాధానం మన పురాతన శాస్త్రాల్లోనే కాదు, దేవాలయ నిర్మాణంలోని ప్రత్యేకమైన శాస్త్రీయ రహస్యాలలోనూ దాగి ఉంది. ఒక దేవాలయం కేవలం రాతి గోడల మధ్య ఉండే విగ్రహం కాదు, అది ఒక శక్తిమంతమైన క్షేత్రం అని పురాణాలు చెబుతూ ఉంటాయి.
ఆలయ ప్రతిష్ట , శక్తి క్షేత్రం..దేవాలయంలోని శక్తికి ప్రధాన కారణం, మూలవిరాట్టు కింద స్థాపించే బీజాక్షర యంత్రం. ఇది సాధారణంగా రాగి లోహంతో తయారు చేస్తారు. ఈ యంత్రంపై వివిధ కోణాలు, వృత్తాలు, బీజాక్షరాలను చెక్కుతారు. శాస్త్రీయంగా చూస్తే, రాగి ఒక అద్భుతమైన విద్యుత్, శక్తి వాహకం. భూమిలో ఉండే విద్యుదయస్కాంత తరంగాలను ఈ యంత్రం ఆకర్షించి, ఒక చోట కేంద్రీకరిస్తుంది. యంత్రంలోని జ్యామితి ఆకృతులు, కోణాలు ఆ శక్తిని మరింతగా విస్తరింపజేస్తాయి. అందుకే ఒక ఆలయానికి వెళ్లినప్పుడు మనకు తెలీకుండానే ఒక ప్రత్యేకమైన శక్తి ప్రవాహం అనుభూతి కలుగుతుంది.
గుడి(Temple)కి వెళ్లినప్పుడు గర్భగుడిపై ఉండే గోపురం లేదా విమానం ఎప్పుడూ త్రిభుజాకారంలో అంటే పిరమిడ్ ఆకారంలో ఉంటాయి. ఈ పిరమిడ్ ఆకారం ఒక సహజ ఎనర్జీ యాంప్లిఫైయర్ (శక్తిని పెంచేది) లాగా పని చేస్తుంది. ఇది విశ్వంలోని కాస్మిక్ ఎనర్జీ, మాగ్నెటిక్ ఫీల్డ్ వంటి శక్తి తరంగాలను లోపలికి లాగి, గర్భగుడిలో ఉన్న మూల విగ్రహంపై కేంద్రీకరిస్తుంది. అందుకే గుడిలో నిలబడి ధ్యానం చేస్తే మనసు త్వరగా ఒక చోట నిలుస్తుంది. ఆలయాలలోని ఈ పిరమిడ్ ఆకార నిర్మాణాలు ఒక పాజిటివ్ ఎనర్జీ ఫీల్డ్‌ను సృష్టిస్తాయి. భక్తులు లోపలికి ప్రవేశించినప్పుడు, ఆ సానుకూల శక్తి వారి మనసును ప్రశాంతంగా, తేలికగా మారుస్తుంది.
మంత్రబలం, భక్తి తరంగాల ప్రభావం.. ఆలయాలను స్థాపించేటప్పుడు కేవలం విగ్రహాన్ని ప్రతిష్ఠించరు. వేద మంత్రాల శక్తితో, పవిత్రమైన ముహూర్తంలో విగ్రహాలకు ప్రాణప్రతిష్ఠ చేస్తారు. ఇది విగ్రహాలకు ఒక అలౌకిక శక్తినిస్తుంది. ఆ తర్వాత ప్రతిరోజూ జరిగే వేద మంత్ర పఠనాలు, అర్చనలు, పూజలు, జపాలు ఆ శక్తిని నిరంతరం పెంచుతుంటాయి.

దీనికి తోడు, శతాబ్దాలుగా ఎందరో భక్తులు దేవాలయాన్ని సందర్శిస్తుంటారు. వారి నమ్మకం, విశ్వాసం, భక్తి తరంగాలు కూడా ఆ ఆలయంలోని ఆ పాజిటివ్ శక్తితో కలిసిపోతాయి. అందుకే పురాతన దేవాలయాలు అత్యంత పవిత్ర క్షేత్రాలుగా మారాయి.
అందుకే, ఇంట్లో దేవుడున్నా, దేవాలయాని(Temple)కి వెళ్ళడం కేవలం ఒక ఆచారం కాదు. అది ఒక ఆధ్యాత్మిక అనుభవం. ఆలయం అనేది మంత్రబలం, భక్తి విశ్వాసాలు, మరియు శక్తి తరంగాల సమ్మేళనం. ఈ అపారమైన శక్తి క్షేత్రంలోకి ప్రవేశించడం ద్వారా మన శరీరం, మనసు, ఆత్మ పునరుత్తేజం పొందుతాయి. ఇది ఇంటి వద్ద చేసే పూజ కన్నా భిన్నమైన, శక్తివంతమైన అనుభూతిని ఇస్తుంది.