Cricket: ఈ పతనం ఎక్కడిదాకా.. ? టెస్టుల్లో టీమిండియా ఫ్లాప్ షో
Cricket: ఇప్పుడు భారత్ ను భారత గడ్డపైనే చిత్తుగా ఓడించేస్తున్నాయి. గత ఏడాది న్యూజిలాండ్ ఈ పరాజయాల పరంపరకు శ్రీకారం చుడితే ఇప్పుడు సౌతాఫ్రికా కంటిన్యూ చేసింది.
Cricket
వరల్డ్ క్రికెట్(Cricket) లో అగ్రశ్రేణి జట్టుగా పేరున్న భారత్ ఇప్పుడు గడ్డుకాలం ఎదుర్కొంటోంది. ప్రత్యేకించి సంప్రదాయ టెస్ట్ ఫార్మాట్ లో రోజురోజుకూ మన ఆటతీరు దిగజారిపోతోంది. ఒకప్పుడు భారత్ కు వచ్చి టెస్ట్ ఆడేందుకే ప్రత్యర్థి జట్లు భయపడేవి. అసలు మన పిచ్ లపై విజయం సంగతి అటుంచితే మ్యాచ్ (Cricket)ను డ్రా చేసుకుంటే చాలన్న రీతిలో ప్రత్యర్థి జట్లు ఆలోచించేవి.
అలాంటిది ఇప్పుడు భారత్ ను భారత గడ్డపైనే చిత్తుగా ఓడించేస్తున్నాయి. గత ఏడాది న్యూజిలాండ్ ఈ పరాజయాల పరంపరకు శ్రీకారం చుడితే ఇప్పుడు సౌతాఫ్రికా కంటిన్యూ చేసింది. 2024లో మూడు టెస్టుల సిరీస్ కు భారత్ వచ్చిన కివీస్ ను స్పిన్ పిచ్ లతో తిప్పేద్దామనుకున్న టీమిండియా చివరికి అదే స్పిన్ ఉచ్చులో చిక్కుకుని విలవిలలాడింది.
సిరీస్ ను న్యూజిలాండ్ 3-0తో గెలిచి భారత్ ను వైట్ వాష్ చేసింది. భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇది ఘోరపరాభవంగా మిగిలింది. తర్వాత ఆసీస్ టూర్ లో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని చేజార్చుకుంది. ఇటీవల ఇంగ్లాండ్ టూర్ లో సిరీస్ ను 2-2తో సమం చేసినప్పటకీ.. ఇప్పుడు సొంతగడ్డపై సౌతాఫ్రికా చేతిలో చావు దెబ్బతినాల్సి వచ్చింది.

నిజానికి ఈ సిరీస్ ఆరంభానికి ముందు సఫారీలపై పెద్ద అంచనాలు లేవు. తీరా సిరీస్ స్టార్ట్ అయ్యాక సీన్ మొత్తం రివర్సయింది. అనుకున్నదొక్కటి.. అయినదిఒక్కటి అన్న రీతిలో మనం 2-0తో స్వీప్ చేద్దామనుకుంటే సౌతాఫ్రికానే భారత్ ను వైట్ వాష్ చేసి పారేసింది. అసలు ఈ పరిస్థితికి కారణం ఏంటనే దానిపై చర్చ జరుగుతోంది. సోషల్ మీడియాలో అయితే హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ను నెటిజన్లు ఏకిపారేస్తున్నారు.
సీనియర్లను సాగనంపి, తుది జట్టు ఎంపికలో పనికిమాలిన నిర్ణయాలు తీసుకుంటూ.. బ్యాటింగ్ ఆర్డర్ లో ఇష్టమొచ్చిన ప్రయోగాలు చేస్తూ జట్టును నాశనం చేస్తున్నాడని మండిపడుతున్నారు. అదే సమయంలో గంభీర్ ఒక్కడినే ఈ ఓటములకు బాధ్యుడిని చేయడం సరైంది కాదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.
ఎందుకంటే గ్రౌండ్ లో ఆడాల్సింది క్రికెటర్లు కాబట్టి…. అసలు ఐపీఎల్ కు బాగా అలవాటు పడిన యువ ఆటగాళ్ళలో టెస్ట్ ఫార్మాట్ ఎలా ఆడాలన్న అవగాహన కూడా లేకుండా పోయింది. క్రీజులో కాసేపు నిలదొక్కుకునేందుకు ప్రయత్నిద్దామన్న స్పృహ కూడా కనిపించడం లేదు. రెండు టెస్టుల్లోనూ బ్యాటర్ల వైఫల్యమే భారత్ కొంపముంచింది.
సఫారీ బ్యాటర్లు భారీస్కోర్ చేసిన ఇదే పిచ్ పై మన బ్యాటర్లు ఎందుకు విఫలమయ్యారన్నది ఇప్పటికీ అర్థం కాని ప్రశ్న. గంభీర్ మాత్రం కోచ్ గా తన ప్యూచర్ ఏంటనే ప్రశ్నకు స్పందించాడు. దీనిపై బీసీసీఐనే తుది నిర్ణయం తీసుకుంటుందన్నాడు. ఇక్కడ వ్యక్తుల కంటే ఆటే ముఖ్యమని గంభీర్ స్పష్టం చేశాడు.



