IPL: ఐపీఎల్ వాల్యూ డౌన్.. కారణాలివే
IPL: ఐపీఎల్ ప్రాభవం క్రమంగా తగ్గుతోందా అంటే అవుననే అనాల్సి వస్తోంది. గత రెండు మూడేళ్ళుగా ఐపీఎల్ వాల్యూ పడిపోతోంది.

IPL
ఇండియన్ ప్రీమియర్ లీగ్… ప్రపంచ క్రికెట్ స్వరూపాన్నే మార్చేసింది. ఈ లీగ్ ఎంట్రీతో బీసీసీఐ తలరాతే మారిపోయింది. ఫ్రాంచైజీలకు,ఆటగాళ్ళకు, స్పాన్సర్లకు కాసుల వర్షం కురిపిస్తూ బీసీసీఐకి బంగారు బాతులా మారింది. ఐపీఎల్(IPL) స్ఫూర్తితో పలు లీగ్స్ వచ్చినా దీనిని మించి సక్సెస్ కాలేదు. ఇప్పటికీ వరల్డ్ క్రికెట్ లో క్రేజ్ పరంగా ఐపీఎల్ టాప్ లో కొనసాగుతోంది.
మిగిలిన లీగ్స్ కు అందనంత దూరంలో నిలిచింది. 2008లో ప్రారంభమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ మొదట్లో వందల కోట్ల వాల్యూనే ఉంది. కానీ కొద్దికాలంలోనే వేలకోట్లను దాటేసింది. క్రమంగా లక్ష కోట్లకు ఐపీఎల్ వాల్యూ చేరుతుందన్న వార్తలు వినిపించాయి. దీనికి కారణాలను చూస్తే పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, కార్పొరేట్ కంపెనీలు ఫ్రాంచైజీలను కొనుగోలు చేశాయి. స్పాన్సర్లుగానూ వ్యవహరించాయి.
దీంతో ఇటు బీసీసీఐపై , అటు ప్లేయర్లపై కాసుల వర్షం కురిసింది. ఫ్రాంచైజీ యాజమాన్యాలు కూడా భారీగానే లాభపడ్డాయి. ప్రైజ్ మనీ, బ్రాడ్ కాస్టింగ్ హక్కుల అమ్మరంలో వాటాలు, గేట్ రెవెన్యూ ఇలా ఆదాయపరంగానూ ఎలాంటి ఢోకా లేకుండా పోయింది. దీంతో ఫ్రాంచైజీలను దక్కించుకోవడానికే కాదు ఐపీఎల్ లో ఏదో ఒకవిధంగా భాగమయ్యేందుకు చాలా కంపెనీలు క్యూ కట్టాయి.

అలాంటి ఐపీఎల్ ప్రాభవం క్రమంగా తగ్గుతోందా అంటే అవుననే అనాల్సి వస్తోంది. గత రెండు మూడేళ్ళుగా ఐపీఎల్ వాల్యూ పడిపోతోంది. ఇంతటి క్రేజ్ ఉన్న ఈ క్యాష్ రిచ్ లీగ్ వాల్యూ తగ్గిపోవడం ఒకవిధంగా అభిమానులకు షాకింగ్ గానే ఉంటుంది. కానీ లీగ్ విలువ క్రమంగా తగ్గిపోతోందన్న వాస్తవం లెక్కల్లో క్లియర్ గా తెలుస్తోంది. 2023లో ఐపీఎల్ విలువ 93,500 కోట్లుగా ఉంటే…. 2024 సీజన్ వరకూ 82,700 కోట్లకు పడిపోయింది. తాజాగా 2025లో 76,100 కోట్లకు తగ్గిపోయింది. అంటే కేవలం ఒక ఏడాదిలోనే ఐపిఎల్ విలువ దాదాపు 6600 కోట్లు తగ్గింది. గత ఏడాదితో పోల్చి చూస్తే ఏకంగా 8 శాతం తగ్గుదల కనిపించింది.
ఐపీఎల్(IPL) వాల్యూ తగ్గడానికి కారణాలను పరిశీలిస్తే ముఖ్యంగా బ్రాడ్ కాస్టింగ్ హక్కుల అమ్మకంలో బీసీసీఐకి దెబ్బ పడింది. 2024లో హాట్‌స్టార్, వయాకామ్18 విలీనమవ్వడం దీనికి కారణంగా చెప్పొచ్చు. 2023 నుంచి 2028 వరకు మీడియా హక్కుల కోసం వయాకామ్18, హాట్‌స్టార్ మధ్య గట్టి పోటీ ఉండేది. ఈ పోటీ కారణంగా బీసీసీఐకి బ్రాడ్ కాస్టింగ్ బిడ్డింగ్ లో భారీ లాభం వచ్చింది.
కానీ ఇప్పుడు ఈ రెండు సంస్థలు కలిసిపోవడం బీసీసీఐ ఆదాయానికి గండిపడింది. అలాగే ఫాంటసీ యాప్‌ల ప్రమోషన్, ప్రకటనల ద్వారా ఐపీఎల్‌లో పెద్ద మొత్తంలో ఆదాయం వచ్చేది. ఇటీవల ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు కారణంగా ఈ యాప్‌లపై నిషేధం విధించడంతో బీసీసీఐకి దెబ్బ పడింది. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో బీసీసీఐకి ఇబ్బందులు తప్పేలా లేవు.