Lionel Messi: 3 రోజులకు రూ.89 కోట్లు అయినా మెస్సీ ఆగ్రహం
Lionel Messi: కోల్ కత్తా పర్యటనలో సాల్ట్ లేక్ స్టేడియంలో గందరగోళం నెలకొనడం, అభిమానులు ఫర్నిచర్ ను ధ్వంసం చేయడంతో నిర్వాహకుడు శతద్రు దత్తాను పోలీసులు అరెస్ట్ చేశారు.
Lionel Messi
భారత్ లో అర్జెంటీనా ఫుట్ బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ(Lionel Messi) పర్యటన ఎంత భారీ ఎత్తున జరిగిందో అందరికీ తెలుసు. ఈ టూర్ కేవలం మూడురోజులే జరిగినా భారత సాకర్ అభిమానుల్లో మంచి జోష్ నింపింది. అయితే మొదటి నుంచీ చెబుతున్నట్టుగానే మెస్సీ పర్యటన పూర్తిగా కమర్షియల్ అన్నది పూర్తిగా స్పష్టమైంది. తాజాగా ఈ టూర్ ఆర్గనైజర్ శతద్రు దత్తా పోలీసుల విచారణలో కీలక విషయాలు వెల్లడించారు.
కోల్ కత్తా పర్యటనలో సాల్ట్ లేక్ స్టేడియంలో గందరగోళం నెలకొనడం, అభిమానులు ఫర్నిచర్ ను ధ్వంసం చేయడంతో నిర్వాహకుడు శతద్రు దత్తాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో టూర్ మొత్తం వివరాలపై అతన్నే అడిగి తెలుసుకుంటున్నారు. దీనిలో భాగంగా శతద్రు దత్తా పలు ఆసక్తికర విషయాలను పోలీసులకు చెప్పినట్టు సమాచారం. ఈ మూడు రోజుల పర్యటన కోసం మెస్సీ(Lionel Messi)కి భారీ మొత్తంలో చెల్లించినట్టు తెలిపాడు. రూ.100 కోట్లు మెస్సీ టూర్ కోసం వెచ్చించామని, వీటిలో రూ.89 కోట్లు మెస్సీకి, 11 కోట్లు ప్రభుత్వానికి పన్ను కట్టినట్టు వెల్లడించాడు.
గోట్ టూర్ ఆఫ్ ఇండియాకు పేరు పెట్టిన మెస్సీ పర్యటనలలో కోల్ కత్తా , హైదారాబాద్, ముంబై, ఢిల్లీ ఉన్నాయి. నిజానికి ముందు తిరువనంతపురం ఉండగా.. అక్కడ నిర్వాహకులు తప్పుకోవడంతో అనూహ్యంగా హైదరాబాద్ కు అవకాశం దక్కింది. మెస్సీ (Lionel Messi)టూర్ పేరులో నిర్వాహకులు ప్రతీ నగరంలో భారీ ఎత్తున వసూలు చేసినట్టు వార్తలు వచ్చాయి.

సెల్ఫీ, ఆటోగ్రాఫ్ కోసం రూ.10 లక్షలు వసూలు చేసినట్టు కూడా తెలుస్తోంది. పలు కార్పొరేట్ కంపెనీల అధినేతలు, ఇతర వీఐపీలు మెస్సీని కలిసి ఫోటో దిగేందుకు కోటి వరకూ ఖర్చు చేసినట్టు , నిర్వాహకులు భారీగా ఆర్జించినట్టు కూడా వార్తలు వచ్చాయి.
తాజాగా పోలీసులు ఇదే విషయాలపై నిర్వాహకులను లోతుగా ప్రశ్నించారు. మెస్సీకి చెల్లించిన మొత్తానికి లెక్కలు ఉండడంతో శతద్రు దత్తా పూర్తి వివరాలు వెల్లడించేశారు. రూ.89 కోట్లు ఇచ్చినా మెస్సీ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలిపారు. కోల్ కత్తా టూర్ లో పలువురు వీఐపీలు తనను కౌగిలించుకోవడం, టచ్ చేయడం వంటివి మెస్సీకి నచ్చలేదని చెప్పినట్టు వివరించారు.
దీనిపై సెక్యూరిటీకి ముందే చెప్పినా కోల్ కత్తా సాల్ట్ లేక్ స్టేడియంలో ఎవ్వరూ నియంత్రించలేకపోయారని చెప్పుకొచ్చారు. మెస్సీని దగ్గరగా చూడాలనే ఆతృతలో వీఐపీలు సైతం ప్రోటోకాల్ పాటించలేదని పోలీసుల ముందు శతద్రు దత్తా చెప్పారు. దీనిపై అప్పుడే మెస్సీ తమతో కోపంగా మాట్లాడినట్టు తెలిపారు. ఇదిలా ఉంటే మెస్సీ ఈవెంట్ కోసం వెచ్చించిన రూ.100 కోట్లలో 30 శాతం స్పాన్సర్లు, 30 శాతం టికెట్ల అమ్మకం ద్వారా వచ్చినట్టు శతద్రు దత్తా పోలీసుల విచారణలో వెల్లడించారు.



