T20 World Cup : భారత్ తో మ్యాచ్ బాయ్ కాట్..పాకిస్తాన్ కీలక నిర్ణయం
T20 World Cup : పాకిస్థాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 2026 టీ20 వరల్డ్‌కప్‌లో భారత్‌తో ఆడాల్సిన మ్యాచ్‌ను బాయ్‌కట్ చేస్తున్నట్లు ప్రకటన చేసింది
T20 World Cup
టీ20 ప్రపంచకప్(T20 World Cup) కు ముందు పాకిస్తాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మెగాటోర్నీలో ఆడుతుందా లేదా అన్న ఉత్కంఠకు తెరదించుతూ ప్రపంచకప్ లో పాల్గొంటున్నట్టు తెలిపింది. అయితే భారత్ తో మ్యాచ్ బాయ్ కాట్ చేస్తున్నట్టు ప్రకటించింది. ఫిబ్రవరి 15న భారత్ తో జరిగే మ్యాచ్ ఆడొద్దని పాకిస్థాన్ ప్రభుత్వం తమ క్రికెట్ జట్టును ఆదేశించింది. దీంతో తమ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం టీమిండియాతో మ్యాచ్ ఆడడం లేదని పాక్ బోర్డు తెలిపింది.
టోర్నీలో మిగిలిన మ్యాచ్ లు ఆడతామని వెల్లడించింది. ఐసీసీ ద్వంద్వ వైఖరి కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నామంటూ పాక్ బోర్డు చెబుతోంది. నిజానికి పాక్ బోర్డు వైఖరి మొదటి నుంచీ వివాదాస్పదంగానే ఉంది. తమకు సంబంధం లేని వ్యవహారంలో జోక్యం చేసుకున్న పీసీబీ బంగ్లాదేశ్ కు మద్ధతుగా నిలిచింది. బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులకు నిరసనగా ముస్తాఫిజుర్ రహమాన్ ను ఐపీఎల్ నుంచి తప్పించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన బంగ్లాదేశ్ వరల్జ్ కప్ మ్యాచ్ ఆడేందుకు భారత్ కు వచ్చేది లేదని మొండిపట్టు పట్టింది.
బంగ్లా మ్యాచ్ లను మరో చోటుకు మార్చేందుకు పరిస్థితులు సహకరించకపోవడంతో ఐసీసీ, బీసీసీఐ బంగ్లా బోర్డుకు విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయింది. దీంతో ప్రపంచకప్ నుంచి బంగ్లాదేశ్ తప్పుకోగా.. వారిస్థానంలో స్కాట్లాండ్ కు అవకాశం వచ్చింది. అయితే బంగ్లా మ్యాచ్ లు కొలంబోలో నిర్వహించాలంటూ పాక్ బోర్డు హడావుడి చేయడం విమర్శలకు దారితీసింది.

ఒకదశలో బంగ్లాకు మద్ధతుగా టోర్నీని బహిష్కరించాలంటూ ఆలోచన చేసినా అది నష్టపరిహారం వంటి అంశాలతో ముడిపడి ఉండడంతో వెనక్కి తగ్గింది. ఇప్పుడు మళ్లీ తమ ప్రభుత్వంతో చర్చించి టీమిండియాతో మ్యాచ్ బాయ్ కాట్ చేస్తున్నట్టు వెల్లడించింది.
అయితే పాకిస్తాన్ నిర్ణయంతో భారత్ కు మ్యాచ్ ఆడకుండానే 2 పాయింట్లు రానున్నాయి. ఐసీసీ టోర్నీ నిబంధనల ప్రకారం ఏ జట్టయినా తప్పుకుంటే ప్రత్యర్థికి పాయింట్లు ఇస్తారు. ప్రస్తుతం లీగ్ స్టేజ్ మ్యాచ్ కావడంతో పెద్దగా ప్రభావం ఉండదు. ఒకవేళ పాకిస్తాన్ జట్టు సెమీఫైనల్ లేదా ఫైనల్స్ లో భారత్ తో ఆడాల్సి వస్తే ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు పాక్ జట్టు ఆడినా భారత్ చేతిలో చావుదెబ్బ తప్పదని, అది తెలిసే ముందుగానే తప్పుకున్నారంటూ భారత క్రికెట్ అభిమానులు సెటైర్లు వేస్తున్నారు.



