Virat Kohli : విరాట్ కోహ్లీ దూకుడు..తొలి వన్డేలో భారత్ గెలుపు
Virat Kohli : విరాట్ కోహ్లీ జోరుకు తోడు టాపార్డర్ లో గిల్, శ్రేయాస్ అయ్యర్ కూడా రాణించారు
Virat Kohli
కొత్త ఏడాదిని టీమిండియా విజయంతో ప్రారంభించింది. వడోదర వేదికగా జరిగిన తొలి వన్డేలో 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ పై విజయం సాధించింది. విరాట్ కోహ్లీ (Virat Kohli) జోరుకు తోడు టాపార్డర్ లో గిల్, శ్రేయాస్ అయ్యర్ కూడా రాణించారు. చివర్లో హర్షిత్ రాణా మెరుపులు కూడా తోడవడంతో భారత్ భారీ లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత బౌలర్లు ఆరంభంలో నిరాశపరిచారు. పైగా ఫీల్డర్లు క్యాచ్ లు వదిలేశారు.
దీంతో కివీస్ ఓపెనర్లు మంచి ఆరంభాన్నిచ్చారు. డెవాన్ కాన్వే , హెన్రీ నికోలస్ దూకుడుగా ఆడుతూ హాఫ్ సెంచరీలు సాధించాడు. తొలి వికెట్ కు 117 పరుగులు జోడించారు. వీరిద్దరూ ఔటైన తర్వాత మూడో మూడు వికెట్లు కోల్పోయిన కివీస్ తక్కువ స్కోరుకే పరిమితమయ్యేలా కనిపించింది. ఈ దశలో డారిల్ మిఛెల్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. సెంచరీ దిశగా సాగుతున్న మిచెల్ ను ప్రసిద్ధ కృష్ణ ఔట్ చేయగా..చివర్లో భారత బౌలర్లు అనుకున్న రీతిలో పట్టుబిగించలేకపోయారు.
కైల్ జెమీసన్ సాయంతో క్లార్క్ మెరుపులు మెరిపించాడు. ఫలితంగా న్యూజిలాండ్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 300 పరుగులు చేసింది. భారత బౌలర్లలో సిరాజ్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ కృష్ణ రెండేసి వికెట్లు తీయగా.. కుల్దీప్ యాదవ్ 1 వికెట్ పడగొట్టాడు.
భారీ లక్ష్యఛేదనలో భారత్ కు భారీ ఆరంభం దక్కలేదు. గిల్ , రోహిత్ తొలి వికెట్ కు 39 రన్స్ మాత్రమే జోడించగలిగారు. కొన్ని మెరుపు పాట్లు ఆడిన హిట్ మ్యాన్ 26 పరుగులకు ఔటయ్యాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లి, కెప్టెన్ గిల్ తో కలిసి ఇన్నింగ్స్ నడిపించాడు. వీరిద్దరూ కివీస్ బౌలర్లపై ఆధిపత్యం కనబరిచారు.

గిల్ ఆచితూచి ఆడినా కోహ్లి మాత్రం తనదైన క్లాసిక్ బ్యాటింగ్ తో అలరించాడు. ఈ క్రమంలో వీరిద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. రెండో వికెట్ కు కోహ్లి, గిల్ 118 పరుగులు జోడించారు. గిల్ 56 రన్స్ కు ఔటైన తర్వాత శ్రేయాస్ అయ్యర్ తో కలిసి కోహ్లి తన దూకుడు కొనసాగించాడు. వీరిద్దరూ మూడో వికెట్ కు 77 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే సెంచరీ దిశగా సాగుతున్న కోహ్లి 93 పరుగులకు ఔటవగా.. ఇక్కడ నుంచి భారత్ మరో 2 వికెట్లు కోల్పోయింది.
ఈ దశలో హర్షిత్ రాణాకు ప్రమోషన్ ఇచ్చిన గంభీర్ ప్రయోగం ఫలించింది. రాణా బ్యాట్ తో మెరుపులు మెరిపించాడు. ధాటిగా ఆడుతూ 29 రన్స్ కు వెనుదిరిగాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన వాషింగ్టన్ సుందర్ వెన్నునొప్పితోనే బ్యాటింగ్ చేస్తూ రాహుల్ కు సపోర్ట్ ఇచ్చాడు. రాహుల్ నిలకడగా ఆడుతూ మ్యాచ్ ను ముగించారు. దీంతో భారత్ మరో ఓవర్ మిగిలుండగానే టార్గెట్ అందుకుంది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్ లో భారత్ 1-0 ఆధిక్యం సాధించింది. తర్వాతి మ్యాచ్ బుధవారం రాజ్ కోట్ లో జరుగుతుంది.




One Comment