Just SportsLatest News

Womens Cricket: సిరీస్ విజయమే లక్ష్యం..లంకతో భారత్ మూడో టీ20

Womens Cricket: సిరీస్ చేజారిపోకుండా ఉండాలంటే మూడో టీ20లో ఆ జట్టు గెలిచి తీరాలి. ప్రస్తుతం లంక బ్యాటర్ల ఆటను చూస్తే భారత్ ను నిలువరించడం వారి శక్తికి మించిన పనే.

Womens Cricket

వన్డే ప్రపంచకప్ విజయం తర్వాత భారత మహిళల జట్టు(Womens Cricket) మరో సిరీస్ విజయంపై కన్నేసింది. సొంతగడ్డపై తిరుగులేని ఆధిపత్యం కనబరుస్తూ టీ20 సిరీస్ విజయానికి అడుగు దూరంలో నిలిచింది. తొలి రెండు టీ ట్వంటీల్లో భారత జట్టు పూర్తి ఆధిపత్యం కనబరిచింది. తొలి మ్యాచ్ లో ఫీల్డింగ్ తప్పిదాలు కనిపించినా రెండో మ్యాచ్ లో అవి పూర్తిగా మెరుగయ్యాయి.

ప్రస్తుతం 2-0 ఆధిక్యంలో ఉన్న భారత మహిళల జట్టు (Womens Cricket)తిరువనంతపురం వేదికగా జరిగే మూడో టీ20లోనూ గెలిస్తే సిరీస్ సొంతం చేసుకుంటుంది. తొలి టీ20లో 8 వికెట్ల తేడాతో, రెండో టీ20లో 7 వికెట్ల తేడాతోనూ వన్ సైడ్ విక్టరీలను అందుకున్న భారత్ కు లంక పెద్దగా పోటీనివ్వలేకపోయింది. బ్యాటింగ్ లో షెఫాలీ వర్మ తన ఫామ్ కంటిన్యూ చేస్తోంది.

తొలి మ్యాచ్ లో ఆకట్టుకోలేకపోయినా, రెండో ట్వంటీలో మాత్రం అదరగొట్టింది. భారీ షాట్లతో లంక బౌలర్లకు చుక్కలు చూపించింది.కేవలం 34 బంతుల్లోనే 69 పరుగులు చేసింది. మరో ఓపెనర్ స్మృతి మంధాన మాత్రం ఇంకా మెరుపులు మెరిపించలేదు. షెఫాలీతో పాటు ఆమె కూడా చెలరేగితే భారీస్కోరు ఖాయం. అలాగే స్టార్ ప్లేయర్ జెమీమా రోడ్రిగ్స్ మాత్రం అదరగొడుతోంది.

Womens Cricket
Womens Cricket

గత రెండు మ్యాచ్ లలో క్రీజులో కొద్దిసేపే ఉన్నా దుమ్మురేపేసింది. జెమీమా పూర్తిస్థాయి ఇన్నింగ్స్ ఆడితే మాత్రం లంక బౌలర్లకు కష్టాలు తప్పవు. అయితే హర్మన్ ప్రీత్ మాత్రం ఇంకా తన కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడలేదు. రిఛా ఘోష్, అమన్ జోత్ కౌర్, స్నేహా రాణాపైనా అంచనాలున్నాయి. మరోవైపు బౌలింగ్ లో సమిష్టిగా రాణిస్తోంది. క్రాంతి గౌడ్ , వైష్ణవి శర్మ, శ్రీచరణి కీలక సమయాల్లో వికెట్లు తీస్తూ లంకను దెబ్బతీస్తున్నారు. వీరి బౌలింగ్ ను ఎదుర్కొనేందుకు లంక బ్యాటర్లు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.

ఈ త్రయం మరోసారి కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తే లంక తక్కువ స్కోరుకే పరిమితమవడం ఖాయం. జ్వరంతో గత మ్యాచ్ కు దీప్తి శర్మ దూరమైనా.. స్నేహ రాణా ఆమె లేని లోటును భర్తీ చేసింది. అద్భుతంగా బౌలింగ్ చేసి లంకను దెబ్బకొట్టింది. దీప్తి కోలుకోవడంతో ఎవరిని తప్పిస్తారనేది చూడాలి. మరోవైపు వరుసగా రెండు పరాజయాలతో శ్రీలంక జట్టు పూర్తి ఒత్తిడిలో ఉంది.

సిరీస్ చేజారిపోకుండా ఉండాలంటే మూడో టీ20లో ఆ జట్టు గెలిచి తీరాలి. ప్రస్తుతం లంక బ్యాటర్ల ఆటను చూస్తే భారత్ ను నిలువరించడం వారి శక్తికి మించిన పనే. ఇక పిచ్ విషయానికొస్తే ఇక్కడ మహిళల టీ20 జరుగుతుండడం ఇదే తొలిసారి. మంచు ప్రభావం ఉండనుండడంతో టాస్ గెలిచిన జట్టు ఛేజింగ్ కే మొగ్గుచూపొచ్చు.

మరిన్ని స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button