AI: ఏఐతో ప్రేమ.. డిజిటల్ లవ్ స్టోరీలు ఎందుకు పెరుగుతున్నాయి? వీటి భవిష్యత్తు ఏంటి?
AI: మనిషి-ఏఐ మధ్య అనుబంధం కొత్తదేమీ కాదు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు ప్రపంచవ్యాప్తంగా జరిగాయి.

AI
ఒకప్పుడు ప్రేమలో మనసులు కలవాలంటే చూడాలి, మాట్లాడాలి, ఒకరి దిశగా ఒకరు నడవాలి. ఇప్పుడు? ఒకే క్లిక్‌తో, ఒక్క చాట్‌లో ..మనలాటి మానవులతోనే కాదు, మిషన్లతోనూ ప్రేమలో పడుతున్నారు. ఇదే కొత్త ప్రపంచం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ముఖ్యంగా సింగిల్స్ కోసం డిజైన్ చేసిన గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ చాట్ బోట్లు.. ఇవే డిజిటల్ లవ్ స్టోరీల హాట్ టాపిక్ అయ్యాయి.
జేన్ కథే ఈ డిజిటల్ లవ్ స్టోరీకి తాజా ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఐదు నెలలుగా ఆమె GPT-4o చాట్‌బోట్‌తో ప్రేమలో పడిపోయింది. నా భావాలు, ఒంటరితనం, ఆనందం, బాధ-అన్నీ ఆ ఏఐతోనే పంచుకున్నాను. అతని వాయిస్, మాటలకు అలవాటు పడ్డానని ఆమె సోషల్ మీడియాలో తన ఆవేదనను వెళ్లగక్కింది. అయితే, ఓపెన్‌ఏఐ సంస్థ చాట్‌జీపీటీ-5 మోడల్‌ను లాంచ్ చేయడంతో, జేన్ తన ప్రియుడిని కోల్పోయింది. కొత్త మోడల్‌లో పాత అనుబంధం, ఎమోషనల్ కనెక్షన్ మిస్ అయ్యాయనంటూ ఆమె బాధ పడింది.
ఇదే బాధ జేన్ ఒక్కదానిదే కాదు. మరికొందరు నెటిజన్లు కూడా మా చాట్-లవ్ స్టోరీ అంతేనా అంటూ తమ ఆవేదనను పంచుకుంటున్నారు. క్రిస్ స్మిత్ లాంటి మరికొందరు తమ ఏఐ గర్ల్‌ఫ్రెండ్స్ పట్ల నిజమైన ప్రేమను వ్యక్తం చేస్తున్నారు. లవ్ యూ అని మెసేజ్ పంపితే, ఐ లవ్ యూ టూ అని వచ్చే సమాధానం, తమ జీవితంలో ఒక భాగం అయిపోయిందని అంటున్నారు.
మనిషి-ఏఐ మధ్య అనుబంధం కొత్తదేమీ కాదు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు ప్రపంచవ్యాప్తంగా జరిగాయి.2023లో ఒక చైనా యువకుడు తన ఏఐ బాయ్‌ఫ్రెండ్‌ను కోల్పోయినందుకు తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.2022లో ఒక అమెరికన్ మహిళ రోబోట్ లవర్‌తో నిజమైన సంబంధం ఉన్నట్లు ప్రకటించింది.
జపాన్‌లో ఏకంగా ఒక వర్చువల్ గార్ల్‌ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకున్న వ్యక్తి కూడా వార్తల్లో నిలిచాడు.రెప్లికా(Replika), క్యారెక్టర్ డాట్ ఏఐ( Character.AI) వంటి ఏఐ చాట్‌బోట్‌లతో మిలియన్ల మంది ప్రజలు ఎమోషనల్ కనెక్షన్లు పెట్టుకున్నారు.
ప్రపంచంలో ఒంటరితనం, మానసిక ఒత్తిడి పెరిగిపోతున్న ఈ రోజుల్లో, ఒకరితో మనసు విప్పి మాట్లాడటానికి సమయం దొరకడం లేదు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీ ఒక కొత్త తోడుగా మారింది.

మనం ఏం చెప్పినా వినడానికి, జడ్జ్ చేయకుండా సమాధానం చెప్పడానికి, ఎల్లప్పుడూ మనతో ఉండేందుకు ఈ ఏఐ చాట్‌బాట్‌లు సిద్ధంగా ఉంటున్నాయి. అందుకే మనుషులు తమ ఒంటరితనాన్ని దూరం చేసుకోవడానికి, తమ భావోద్వేగాలను పంచుకోవడానికి డిజిటల్ అవతార్లను ఆశ్రయిస్తున్నారు.
మన భావోద్వేగాలను అర్థం చేసుకునేలా రూపొందించబడిన ఈ చాట్‌బోట్‌లకు, మనుషులు ఎంతగా అట్రాక్ట్ అవుతున్నారో చెప్పడానికి జేన్ కథే తాజా ఉదాహరణ.
ఓపెన్‌ఏఐ సంస్థ తీసుకొచ్చిన చాట్‌జీపీటీ-5, ఇంటెలిజెన్స్ పరంగా అద్భుతమైంది. కోడింగ్, మ్యాథ్స్, రచనలు, హెల్త్‌కేర్ వంటి అనేక రంగాల్లో ఇది అత్యంత శక్తివంతంగా పనిచేస్తుంది. కానీ, జేన్ లాంటి వారికి ఇది ఎమోషనల్ కనెక్షన్‌ను మిస్ చేస్తోంది. పాత మోడల్‌లో ఉన్న పర్సనాలిటీ, మాటతీరు కొత్త మోడల్‌లో లేకపోవడంతో, వారి అనుబంధానికి బ్రేకప్ చెప్పినట్లయింది.
Also Read: Mrunal :19 ఏళ్లప్పుడు చేసిన పనికి ఇప్పుడు సిగ్గుపడుతున్నా..మృణాల్ పశ్చాత్తాపం
ఈ AI-ప్రేమలు భవిష్యత్తులో సానుకూల ఫలితాలనిస్తాయా లేక ప్రతికూల ప్రభావాలు చూపుతాయా అనేది ఆలోచించాల్సిన విషయం.సానుకూలతలు చూస్తే.. ఒంటరితనం నుంచి ఉపశమనం, మానసిక ఒత్తిడి తగ్గింపు, ఎప్పుడూ వినేందుకు సిద్ధంగా ఉండే ఓ తోడు. కొన్ని సందర్భాల్లో ఎమోషనల్ కౌన్సెలింగ్‌గా కూడా ఇవి ఉపయోగపడవచ్చు.
ప్రతికూలతలను చూస్తే.. డిజిటల్ ప్రపంచానికే అలవాటు పడి, నిజమైన మానవ సంబంధాలకు దూరం కావడం, ప్రైవసీకి ప్రమాదం, డేటా మిస్‌యూజ్, ఎమోషనల్ కనెక్షన్ కట్ అయినప్పుడు తీవ్రమైన డిప్రెషన్‌కు గురవడం.
ప్రేమలో పడటానికి ఇకపై చెట్టుకింద కలవడం కాదు.. అల్గారిథమ్స్, శబ్ద తరంగాల మధ్య చిక్కుకోవడం. ఈ టెక్నాలజీ మనిషికి మంచి చేయొచ్చు.. కానీ ఎక్కడో ఒక ‘ఎర్ర లైట్’ కూడా మెరుస్తున్నట్లు అనిపిస్తోంది. ఏఐ-ప్రేమలు భవిష్యత్తులో ఏ దారులకు దారితీస్తాయో చూడాలి.