Surgery :సర్జరీ తర్వాత వచ్చే సమస్యలను ముందే కనిపెట్టే మైసర్జరీరిస్క్
Surgery :రోగికి సంబంధించిన క్లినికల్ డేటాను సేకరించి, ఆపరేషన్ తర్వాత ఏయే సమస్యలు వచ్చే అవకాశం ఉందో అంచనా వేసి, ఆ సమాచారాన్ని వైద్యుడి మొబైల్‌కు పంపుతుంది.

Surgery
ఆపరేషన్ చేయించుకోవాలంటే ఎవరికైనా భయమే. సర్జరీ (Surgery)విజయవంతమైనా.. తర్వాత ఏమైనా సమస్యలు వస్తాయోనని ఆందోళన పడుతుంటారు. ఆపరేషన్ తర్వాత వచ్చే ప్రమాదాలను ముందే పసిగట్టగలిగితే ఎంత బాగుంటుంది కదా? ఇప్పుడు అదే నిజం కాబోతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సహాయంతో, ఆపరేషన్ తర్వాత రోగికి రాబోయే సమస్యలను ముందే కనిపెట్టే విప్లవాత్మకమైన వ్యవస్థ అందుబాటులోకి రావడంతో ఇది ఈజీ అయిపోయింది.
ఆపరేషన్ తర్వాత వచ్చే వైద్యపరమైన సమస్యలు రోగికి, వైద్యుడికి ఇద్దరికీ పెద్ద సవాలుగా మారుతాయి. కానీ, ఇప్పుడు కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వ్యవస్థతో ఈ సమస్యలను ముందే పసిగట్టవచ్చు. ఈ అత్యాధునిక సాంకేతికత భవిష్యత్తులో రోగికి రాబోయే ఇబ్బందులను విజయవంతంగా అంచనా వేస్తోంది.
‘MySurgeryRisk’ అనే ఈ వ్యవస్థను యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడా పరిశోధకులు రూపొందించారు. ఇది రోగికి సంబంధించిన క్లినికల్ డేటాను సేకరించి, ఆపరేషన్ తర్వాత ఏయే సమస్యలు వచ్చే అవకాశం ఉందో అంచనా వేసి, ఆ సమాచారాన్ని వైద్యుడి మొబైల్‌కు పంపుతుంది.

ఈ ఏఐ వ్యవస్థను సుమారు 7 సంవత్సరాల డేటా, 74 వేల చికిత్సా విధానాల ఆధారంగా తయారు చేశారు. ఇది రోగుల వైద్య చరిత్ర, మందులు, ల్యాబ్ ఫలితాలు, వైద్య రికార్డులను శస్త్రచికిత్సకు ఏడాది ముందు వరకు సేకరించి విశ్లేషిస్తుంది.
ఈ వ్యవస్థ గుండె, మూత్రపిండాలు, నాడీ సంబంధిత సమస్యలతో సహా ఎనిమిది ప్రధాన శస్త్రచికిత్స అనంతర సమస్యల ప్రమాదాన్ని కచ్చితంగా లెక్కిస్తుంది. 2019లో జరిగిన ఒక అధ్యయనంలో, ఈ వ్యవస్థ 20 మంది వైద్యుల అంచనాలతో సమానంగా పనిచేసింది. అలాగే, 2000-2010 మధ్యకాలంలో 51 వేల మంది రోగులకు సంబంధించిన డేటాను విశ్లేషించి, వారికి వచ్చిన సమస్యలను 70 నుంచి 80 శాతం కచ్చితత్వంతో అంచనా వేసింది. ఇది రోగులకు, వైద్యులకు సరైన నిర్ణయాలు తీసుకోవడంలో ఎంతో ఉపయోగపడుతోంది.
One Comment