Kaleshwaram : బీఆర్ఎస్‌లో అరెస్టుల భయం.. కేసీఆర్ కీలక వ్యూహం ఏంటి?
Kaleshwaram : కేసీఆర్ ఎర్రవల్లిలో కీలక సమీక్ష... కాళేశ్వరం కమిషన్ నివేదికపై తీవ్రంగా స్పందించిన మాజీ సీఎం

Kaleshwaram
సిద్ధిపేట జిల్లాలోని ఎర్రవల్లి ఫామ్ హౌస్ ఈ రోజు రాష్ట్ర రాజకీయాలు చర్చించిన ప్రధాన కేంద్రంగా మారింది. బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ భేటీ ఇటీవలే విడుదలైన కాళేశ్వరం(Kaleshwaram) లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై కమిషన్ నివేదిక గురించి విపులంగా చర్చించారు.
ఈ సమావేశంలో మాజీ మంత్రులు హరీష్ రావు(Harish Rao), కేటీఆర్(KTR), జగదీష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి వంటి కీలక నేతలు పాల్గొన్నారు. సుమారు ఆరు గంటలపాటు కొనసాగిన ఈ భేటీలో కాళేశ్వరం నివేదికపై తీవ్ర చర్చ జరిగింది. పార్టీలోని నేతలపై కేసులు, అరెస్టుల భయం, ప్రజల్లో విరోధ భావన రావడంతో భవిష్యత్ రాజకీయ వ్యూహం ఎలా ఉండాలో కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.
ఇది అసలు కాళేశ్వరం (Kaleshwaram) కమిషన్ కాదు, కాంగ్రెస్ కమిషన్ అని కేసీఆర్ తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఇప్పటికే తామందరూ ఊహించినట్లుగానే ఈ నివేదిక బయటకు వచ్చిందని, అది పూర్తిగా రాజకీయ కుట్రల నడుమ తయారైన పత్రంగా తప్ప మరొకటి కాదని అభిప్రాయపడ్డారు. కాళేశ్వరం నిర్మాణంలో ఎటువంటి అవినీతి జరగలేదని, పార్టీ నేతలను మచ్చలేసేందుకు కాంగ్రెస్ కుట్రపూరితంగా ఇది వెలుగులోకి తెచ్చిందన్నారు.
అయితే, కొందరు బీఆర్‌ఎస్ నేతలను అరెస్ట్ చేసే అవకాశముందన్న కేసీఆర్, దీనిపై భయపడాల్సిన పనిలేదన్నారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం వేసిన బూటకపు డ్రామా. మాకు భయం లేదు. ప్రజల్లోకి వెళ్లి నిజాలు చెప్పాలి. కాళేశ్వరం వల్ల వచ్చిన లాభాలను విపులంగా ప్రచారం చేయాలంటూ నేతలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.

బీఆర్ఎస్ (BRS) హయాంలో కాళేశ్వరం (Kaleshwaram) లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ను తెలంగాణ(telangana) రాష్ట్రం భారీ అంచనాలతో ప్రారంభించింది. గోదావరి నదిని ప్రధానంగా ఆధారంగా చేసుకుని, రాష్ట్రంలోని ఉత్తర, మధ్య, దక్షిణ జిల్లాలకు సాగునీరు అందించడమే లక్ష్యం. రూ. 80 వేల కోట్లకు పైగా వ్యయం చేసిన ఈ ప్రాజెక్టును కేసీఆర్ ప్రభుత్వం “తెలంగాణకు జీవనాడి”గా అభివర్ణించింది. అయితే 2022లో మేడిగడ్డ బ్యారేజ్‌లో బసిన్ దిగజారడం మొదలైన తర్వాత వివాదాలు ఒక్కొక్కటిగా పుట్టుకొచ్చాయి.
ప్రాజెక్టు నిర్మాణ నాణ్యత, డిజైన్ లోపాలు, అనుమానాస్పద ఖర్చులు వంటి అంశాలపై విమర్శలు వెల్లువెత్తాయి. యాంటీ కరప్షన్ వర్గాలు, టెక్నికల్ నిపుణులు, మాజీ అధికారులు ఈ పనుల్లో పారదర్శకత లేదని ఆరోపించారు. ఇందుకుగాను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ప్రత్యేక కమిషన్ వేసి నివేదిక రూపొందించింది.
ప్రాజెక్టు ప్రారంభించిన కొన్ని సంవత్సరాల్లోనే నిర్మాణ లోపాలు బయటపడటంతో ప్రజల్లో అనుమానాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, “ప్రాజెక్టు పనుల్లో అవినీతి జరిగిందా?”, “బిల్లులు పెంచడంలో ఎవరెవరు పాత్రధారులు?”, “డిజైన్ మార్పులు ఎందుకు జరిగాయి?” అనే కీలక ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలనే ఉద్దేశంతో కమిషన్ ఏర్పాటు చేశారు.
కమిషన్ నివేదికలో కొన్ని కీలక వ్యాఖ్యలు ఉండటం, బీఆర్ఎస్ నేతలపై వ్యక్తిగత వ్యాఖ్యలు ఉన్నట్లు సమాచారం. ఈ నివేదికను కేంద్ర పర్యవేక్షణ సంస్థలకు పంపే యోచన కూడా ఉందన్న ప్రచారం పార్టీ వర్గాల్లో కలకలం రేపింది.
కేసీఆర్ వ్యూహం ఏంటి?
ఈ నివేదికపై పార్టీ ఎలా స్పందించాలి? ప్రజల్లోకి పార్టీ వాదనను ఎలా తీసుకెళ్లాలి? ఎవరు అరెస్టు అయినా, పార్టీ స్థాయిలో ఎలా మద్దతుగా నిలవాలి? అనే అంశాలపై కేసీఆర్ స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. “కళేశ్వరం ప్రాజెక్ట్‌ను పనికిరాదని అంటున్నవారు అజ్ఞానులు” అని వ్యాఖ్యానించిన కేసీఆర్, దీనిపై జరుగుతున్న ప్రతీ దుష్ప్రచారాన్ని బలంగా తిప్పికొట్టాలని పార్టీ నేతలకు సూచించారు.

ప్రజల్లోకి వెళ్లే పనిని వెంటనే ప్రారంభించాలని, వాట్సాప్, ఫేస్‌బుక్, యూట్యూబ్ లాంటి మాధ్యమాల్లో కాళేశ్వరం లాభాలను వివరించే విధంగా ప్రచారం జరగాలని, క్షేత్రస్థాయిలో పార్టీ నేతలు సిద్ధంగా ఉండాలని సూచించారు.
ఇక రాష్ట్ర కేబినెట్ సమావేశం ముగిశాక కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకునే నూతన చర్యలపై బీఆర్‌ఎస్ రాజకీయంగా ఎలా స్పందించాలన్న దానిపై కూడా వ్యూహం రూపొందించనున్నట్టు తెలిసింది.
Also Read: Sign of death: వాసన కోల్పోతే మరణానికి సంకేతమా? శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారు?
One Comment