Pawan Kalyan:తెలంగాణలో పవన్ కళ్యాణ్ ..ఎంట్రీకి ముందే కాంగ్రెస్ మాటల దాడి ఎందుకు?
Pawan Kalyan: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనాని సాధించిన 100% స్ట్రైక్ రేట్ చూశాక, పవన్ 'పవర్' ఏంటో అందరికీ బాగానే అర్థమైంది.
Pawan Kalyan
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఊపు అందుకున్న ఈ సమయంలో, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రచారానికి రానున్నారన్న వార్త రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపింది. ఈ నెల 7, 8 తేదీల్లో పవన్ తెలంగాణలో బీజేపీ అభ్యర్థులతో పాటు, అలాగే జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్న స్థానాల్లో ప్రచారం చేయబోతున్నారు. అయితే, ఆయన రాకకంటే ముందే కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలు తెలంగాణ పొలిటికల్ వాతావరణాన్ని హీటెక్కిస్తున్నాయి.
నిన్నమొన్నటి వరకు పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కేవలం ఒక సినిమా హీరో అని, పవన్ను చూడటానికి జనం వస్తారు కానీ ఓట్లు వేయరని ప్రత్యర్థులు ఎద్దేవా చేసేవారు. కానీ, ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనాని సాధించిన 100% స్ట్రైక్ రేట్ చూశాక, పవన్ ‘పవర్’ ఏంటో అందరికీ బాగానే అర్థమైంది. అంతెందుకు పక్కనే ఉన్న మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ ప్రచారం చేసిన చోట బీజేపీ కూటమి కూడా క్లీన్ స్వీప్ చేయడంతో, పవన్ను ఇప్పుడు రాజకీయంగా ఒక గోల్డెన్ లెగ్గా చూస్తున్నారంటేనే పవన్ ప్రభావం ఎంత ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు.
అందుకే పవన్ తెలంగాణ సంస్కృతిని తక్కువ చేశారని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ విమర్శించడం కూడా రాజకీయ ఎత్తుగడలా కనిపిస్తోందని విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే పవన్ ప్రచారం చేస్తే పార్టీకి అతీతంగా పవన్ను అభిమానిస్తున్న యువతతో సెటిలర్ల ఓట్లు గంపగుత్తగా బీజేపీ-జనసేన కూటమికి పడతాయని కాంగ్రెస్ ఆందోళన చెందుతోంది. ఒకవేళ పవన్ ప్రభావంతో హైదరాబాద్ పరిసరాల్లో కనుక బీజేపీ పుంజుకుంటే, అది కాంగ్రెస్ అధికారానికి ముప్పుగా మారుతుందనేది వారి అసలు భయం అని అంటున్నారు.
మరోవైపు తెలంగాణలో జనసేన బలపడటానికి ఇదే సరైన సమయమని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తులో భాగంగా అలాగే రిస్క్ చేయడం ఎందుకన్న భావనతో తక్కువ సీట్లలోనే పోటీ చేశారు. కానీ ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో జనసేన అభ్యర్థులు నిజామాబాద్, నల్లగొండ, వరంగల్ వంటి కీలక జిల్లాల్లో పోటీ చేస్తున్నారు.

ఏపీలో ఉప ముఖ్యమంత్రిగా పవన్ కు ఉన్న పాపులారిటీ.. ఇప్పుడు తెలంగాణలోని జనసేన కేడర్ లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ప్రాంతీయ విభేదాలను దాటి పవన్ ను ఒక నాయకుడిగా తెలంగాణ ప్రజలు స్వీకరిస్తే.. ఇక్కడ కూడా జనసేన మూడవ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగే అవకాశం కచ్చితంగా ఉంటుంది.
తెలంగాణ జనసేన ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్ అన్నట్లుగా.. పవన్ ప్రచారంలోకి దిగితే తమ సీట్లు ఎక్కడ గాలిలో కలిసిపోతాయో అని కాంగ్రెస్ అడ్డుకోవాలని చూస్తోందన్న వాదన కూడా నిజమే అన్పిస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రాంతీయ పార్టీ హోదా ఉన్న జనసేన.. ఏ రాష్ట్రంలోనైనా పోటీ చేసే హక్కు ఉందని, కాంగ్రెస్ ఇలా మాట్లాడటం తన ఓటమిని ముందే అంగీకరించినట్లు అవుతుందని అంటున్నారు.
మరి సినిమా గ్లామర్ ఓట్ల రూపంలోకి మారుతుందా? పవన్ పొలిటికల్ మేనియా తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలను తలకిందులు చేస్తుందా? అనేది తెలియాలంటే ఈ నెల 7, 8 తేదీల్లో జరిగే బహిరంగ సభల రెస్పాన్స్ అలాగే ఓట్ల ఫలితాల రోజు చూడాల్సిందే. ఒకవేళ పవన్ మేనియా క్లిక్ అయితే మాత్రం, తెలంగాణ రాజకీయాల్లో జనసేన ప్రస్థానం కొత్త పుంతలు తొక్కడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు
Bottle:ప్లాస్టిక్ ,గాజు బాటిల్లో ఏది బెస్ట్? అసలు మంచినీళ్లు తాగడానికి సరైన బాటిల్ ఏది?



