Rythu Bharosa :రైతు భరోసాపై రేవంత్ సర్కార్ నిర్ణయం.. ఎవరికి ప్లస్ ?ఎవరికి మైనస్?
Rythu Bharosa : రైతులకు ఇచ్చే సాయాన్ని ప్రభుత్వం కోత పెడుతోందనే ప్రచారం జరిగే అవకాశం ఉంది.
Rythu Bharosa
తెలంగాణలోని రైతన్నలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న రైతు భరోసా(Rythu Bharosa ) పంపిణీపై రేవంత్ రెడ్డి సర్కార్ ఒక కీలకమైన మలుపు తీసుకుంది. వానాకాలం , యాసంగి సీజన్లలో రైతులకు అండగా నిలిచే ఈ పెట్టుబడి సాయం విషయంలో.. ఇకపై పాత పద్ధతులకు బై చెప్పనున్నారు.
దీనిప్రకారం..గతంలో పట్టా భూమి ఉన్న ప్రతి ఒక్కరికీ కూడా అంటే ఆ భూమిలో పంట వేసినా వేయకపోయినా రైతు భరోసా డబ్బులు జమయ్యేవి. కానీ ఇప్పుడు ప్రభుత్వం నిబంధనలను మార్చింది.
సాగులో ఉన్న భూములకు మాత్రమే ఈ సాయం అందించాలని .. రాబోయే యాసంగి సీజన్ నుంచే ఈ కొత్త విధానాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దీనివల్ల సాగు చేయని ఖాళీ భూములకు ఇచ్చే నిధుల వృథాను అరికట్టవచ్చొని ప్రభుత్వం భావిస్తోంది.
ఈ నిబంధనను పకడ్బందీగా అమలు చేయడానికి ప్రభుత్వం లేటెస్ట్ ‘శాటిలైట్ మ్యాపింగ్’ టెక్నాలజీని రంగంలోకి దించింది. అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో.. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా శాటిలైట్ సర్వే పూర్తవగా దీనిలో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి.
కాగితాల్లో ఉన్న పట్టా భూమికి, క్షేత్రస్థాయిలో సాగులో ఉన్న భూమికి మధ్య సుమారు 8 నుంచి 12 శాతం వ్యత్యాసం ఉన్నట్లు తేలింది. దీని ప్రకారం సుమారు 20 లక్షల ఎకరాల్లో పట్టా ఉన్నా కూడా ఎటువంటి పంటలు సాగు చేయడం లేదని తేలింది. ముఖ్యంగా నీటి లభ్యత తక్కువగా ఉన్న జిల్లాల్లోనే ఈ ఖాళీ భూముల శాతం ఎక్కువగా ఉన్నట్లు శాటిలైట్ గుర్తించింది.
ఉదాహరణకు ఒక గ్రామంలో 500 ఎకరాల భూముంటే, అందులో కేవలం 400 నుంచి 450 ఎకరాల్లో మాత్రమే పంటలు పండిస్తున్నారు. మిగిలిన భూమి ఖాళీగా ఉన్నా గతంలో సాయం అందేది, కానీ ఇకపై ఆ పరిస్థితి ఉండదు.
ఈ నెల 14వ తేదీ తర్వాత అగ్రికల్చర్ యూనివర్సిటీ ఇచ్చే పూర్తిస్థాయి రిపోర్టును ప్రభుత్వం పరిశీలించి, టెక్నికల్ కమిటీతో చర్చించాక తుది నిర్ణయం తీసుకోనుంది. ఈ శాటిలైట్ మ్యాపింగ్ కేవలం రైతు భరోసాకే కాకుండా, పంట బీమా అమలుకు, వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలులో పారదర్శకతకు కూడా ఎంతగానో ఉపయోగపడుతుందని రేవంత్ ప్రభుత్వం భావిస్తోంది.

అయితే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అటు రాజకీయంగా, ఇటు ఆర్థికంగానూ కొన్ని మార్పులకు దారితీయనుంది.
నిజమైన రైతులకు ప్లస్.. కష్టపడి పంటలు పండిస్తున్న రైతులకు, అద్దెకు తీసుకుని సాగు చేస్తున్న రైతాంగానికి ఇది శుభవార్త. అనర్హుల ఏరివేత వల్ల ప్రభుత్వంపై భారం తగ్గి, భవిష్యత్తులో రైతు భరోసా (Rythu Bharosa )సాయం పెంచే అవకాశం కూడా ఉంటుంది. అలాగే ప్రభుత్వ ధనం దుర్వినియోగం కాకుండా నిజమైన సాగుదారులకు మాత్రమే పథకం చేరుతుంది.
ప్రభుత్వానికి ప్లస్..ఖాళీ భూములకు ఇప్పటి వరకూ ఇచ్చిన వేల కోట్ల రూపాయల నిధులను ఇకపై ప్రభుత్వం ఆదా చేయవచ్చు. టెక్నాలజీ వాడుతున్నాం కాబట్టి అవకతవకలకు తావుండదని, పారదర్శకత పెరిగిందని చెప్పుకోవడానికి ప్రభుత్వానికి ఇదొక మంచి అవకాశంగా మారుతుంది.
రియల్ ఎస్టేట్ యజమానులకు మైనస్.. పట్టా ఉండి, పంటలు వేయకుండా వదిలేసిన వారు, లేదా పెట్టుబడి కోసం భూమి కొని సాగు చేయని వారికి మాత్రం ఇది పెద్ద మైనస్ అవుతంది. ఏళ్లుగా సాగు చేయకుండానే ప్రభుత్వ సాయం పొందుతున్న వీరికి ఇకపై ఆ ఆదాయం ఆగిపోనుంది.
రాజకీయంగా మైనస్.. ఈ నిర్ణయం వల్ల లబ్ధిదారులు తగ్గితే మాత్రం, ప్రతిపక్షాలకు విమర్శించడానికి ఒక ఆయుధం దొరికినట్లే అవుతుంది. రైతులకు ఇచ్చే సాయాన్ని ప్రభుత్వం కోత పెడుతోందనే ప్రచారం జరిగే అవకాశం ఉంది.అలాగే గ్రామాల్లో సర్వే సరిగ్గా జరగలేదని తెలిస్తే.. సామాన్య రైతుల నుంచి కూడా వ్యతిరేకత వచ్చే అవకాశం కూడా ఉంది.



