Just TelanganaJust NationalLatest News

Chinese Manja: సరదా వెనుక పొంచి ఉన్న మృత్యుపాశం.. ఎందుకీ చావులు ఆగడం లేదు?

Chinese Manja: పతంగులకు వాడే చైనా మాంజా మనం వాడే సాధారణ నూలు దారం కాదు. దీనిని నైలాన్ కానీ సింథటిక్ ఫైబర్ తో కానీ తయారచేస్తారు.

Chinese Manja

సంక్రాంతి పండుగ వస్తుందంటే చాలు.. తెలుగు రాష్ట్రాల్లో సందడి మొదలవుతుంది. ముఖ్యంగా హైదరాబాద్ వంటి నగరాల్లో గాలిపటాల జోరు మొదలవుతుంది. అయితే ఈ రంగురంగుల పతంగుల వెనుక చైనా మాంజా(Chinese Manja) ఉండటమే కాస్త కలవరపరుస్తుంది. ఏటా పదుల సంఖ్యలో మనుషుల ప్రాణాలు, వందల సంఖ్యలో పక్షుల ప్రాణాలు ఈ చైనా దారం వల్లే పోతున్నాయి.

పతంగులకు వాడే చైనా మాంజా మనం వాడే సాధారణ నూలు దారం కాదు. దీనిని నైలాన్ కానీ సింథటిక్ ఫైబర్ తో కానీ తయారచేస్తారు. దీనికి పదును పెంచడం కోసం గాజు పొడి, అల్యూమినియం ఆక్సైడ్ వంటి రసాయనాలను వాటికి పూస్తారు.

దీనివల్ల ఈ దారం ఎంత స్ట్రాంగ్‌గా తయారవుతుందంటే.. ఇది ఎప్పటికీ కూడా తెగిపోదు. బైక్ మీద వేగంగా వెళ్తున్న వ్యక్తి మెడకు కనుక ఈ దారం తగిలితే.. అది ఒక పదునైన కత్తిలా పనిచేసి క్షణాల్లో మెడను కోసి పారేస్తుంది. రక్త నాళాలు తెగిపోవడంతో ఆసుపత్రికి తీసుకెళ్లే లోపే ఆ బాధితుడు మరణించే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

నిజానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఈ చైనా మాంజాపై దేశవ్యాప్తంగా నిషేధాన్ని విధించింది. అయినా కూడా.. కేవలం లాభాల కోసమే వ్యాపారులు దొడ్డిదారిన వీటిని విక్రయిస్తున్నారు. ఇవి చైనా నుంచి నేరుగా దిగుమతి కాకపోయినా.. మన దేశంలోని నోయిడా, జైపూర్ వంటి ప్రాంతాల్లోనూ ఇవి తయారవుతున్నాయి. పాత స్టాక్ పేరుతో లేదా ఇతర వస్తువుల చాటున వీటిని రహస్యంగా రవాణా చేస్తున్నారు.

తక్కువ ధరకే దొరకడంతో పాటు గాలిపటాల పోటీలో ఈజీగా అవతలి వాళ్ల పతంగులను కోసేయవచ్చన్న దురాశతో పిల్లలు, యువకులు వీటినే ఎక్కువగా కొంటున్నారు.

Chinese Manja
Chinese Manja

ఏటా పండుగకు కొద్ది రోజుల ముందు పోలీసులు నామమాత్రపు చెకింగ్‌లు చేసి వందల కొద్దీ చక్రాలను స్వాధీనం చేసుకుంటారు. కానీ మూలాల మీద మాత్రం దాడులు జరగడం లేదు. ఈ దారాలు అమ్మే షాపుల లైసెన్స్‌లను శాశ్వతంగా రద్దు చేయడం లేదు. తయారీదారులను పట్టుకోవడం లేదు.

పోలీసులు, మున్సిపల్ అధికారులు , కాలుష్య నియంత్రణ మండలి మధ్య సమన్వయం లేకపోవడం వల్లే ఈ మాంజా పంజా విసురుతోంది. ప్రభుత్వాలు కేవలం హెచ్చరికలతో సరిపెడుతున్నాయే తప్ప.. కఠినమైన శిక్షలు అమలు చేయడం లేదు.

ఐదు సంవత్సరాల గణాంకాలను పరిశీలిస్తే పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. కేవలం హైదరాబాద్‌లోనే ఈ ఐదేళ్లలో చైనా మాంజా వల్ల సుమారు 15 వరకూ మరణాలు సంభవించినట్లు తెలుస్తోంది. తీవ్రంగా గాయపడిన వారి సంఖ్య అయితే వందల్లో ఉంటుంది.

2020 లో హైదరాబాద్‌లో బైక్‌పై వెళ్తున్న ఓ యువకుడి గొంతుకు మాంజా దారం (Chinese Manja)తగిలి గొంతు చీరుకుపోయి అక్కడికక్కడే మరణించాడు. 2022 లో ఒక చిన్నారి తన తండ్రితో కలిసి బైక్‌పై వెళ్తుండగా మాంజా చిన్నారి మెడకు చుట్టుకోవడంతో తీవ్ర రక్తస్రావమై చనిపోయింది. 2024 సంక్రాంతి సమయంలో కూడా ఇద్దరు వాహనదారులు మాంజా వల్ల ప్రాణాలు కోల్పోయారు.

ఇక పక్షుల విషయానికి వస్తే.. ప్రతి ఏటా సంక్రాంతి సమయంలో కేవలం ఒక్క హైదరాబాద్‌లోనే దాదాపు 500 నుంచి 800 పక్షులు ఈ మాంజా వల్ల రెక్కలు తెగిపోయి ప్రాణాలు కోల్పోతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

ఈ ఏడాది అయినా మార్పు వస్తుందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వాలు ఇప్పటికైనా మేల్కొని కేవలం జరిమానాలతో సరిపెట్టకుండా.. చైనా మాంజా (Chinese Manja)అమ్మే వారందరిపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. అలాగే ప్రజల్లో కూడా మార్పు రావాలి.. మన సరదా పక్కవారి ప్రాణం తీయకూడదని ప్రతి ఒక్కరూ గుర్తించినప్పుడే ఈ మృత్యుపాశం నుంచి మనం బయటపడగలం.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button