Just TelanganaJust PoliticalLatest News

Telangana Municipal Elections :మున్సిపోల్స్‌లో హస్తం హవా..కాంగ్రెస్ గెలుపునకు కారణాలివే

Telangana Municipal Elections : తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల హడావుడి ముగిసింది. పోలింగ్ పూర్తయి కౌంటింగ్ కూడా జరిగి ఫలితాలు వచ్చేశాయి. అధికార కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటింది

Telangana Municipal Elections

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల(Telangana Municipal Elections) హడావుడి ముగిసింది. పోలింగ్ పూర్తయి కౌంటింగ్ కూడా జరిగి ఫలితాలు వచ్చేశాయి. ఊహించినట్టుగానే అధికార కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటింది. చాలా చోట్ల తమ పట్టు నిలుపుకుంటూ మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుంది. దాదాపు 90కి పైగా మున్సిపాలిటీల్లో హస్తం పార్టీనే పైచేయి సాధించింది.

మెదక్ తప్పిస్తే మిగిలిన జిల్లాల్లో కాంగ్రెస్ కే పట్టణ ఓటర్లు జై కొట్టారు. చాలా జిల్లాల్లో అధికార పార్టీ ఏకపక్ష విజయాలను అందుకుంది. అయితే కాంగ్రెస్ విజయానికి కారణాలను విశ్లేషిస్తే సహజంగానే స్థానిక ఎన్నికలు ఎప్పుడు జరిగినా అధికార పార్టీవైపే ప్రజలు మొగ్గుచూపుతుంటారు.

విపరీతమైన ప్రభుత్వ వ్యతిరేకత ఉంటే తప్పిస్తే పెద్దగా ఫలితాల్లో సంచలనాలు చోటు చేసుకునే పరిస్థితి ఉండదు. ఇటీవల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పార్టీలకు సంబంధం లేకున్నా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులే ఎక్కువ చోట్ల గెలిచారు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లోనూ అదే జరిగింది. అయితే కాంగ్రెస్ విజయానికి కారణాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పలు నియోజకవర్గాల్లో స్వయంగా ప్రచారం నిర్వహించారు. బహిరంగసభల్లో పాల్గొని పార్టీ శ్రేణుల్లో జోష్ పెంచారు.

అటు మంత్రులకు కూడా కీలక జిల్లాల బాధ్యతలు అప్పగించడం కూడా ఫలితాలపై ప్రభావం చూపించింది. బీఆర్ఎస్ కు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా మున్సిపల్ ఎన్నికల్లో పూర్తి ఆధిపత్యం కనబరచాలన్న రేవంత్ వ్యూహం విజయవంతమైంది. ఇటు సీఎం, అటు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ప్రచారంలో చురుగ్గా పాల్గొనడం కూడా కాంగ్రెస్ విజయానికి కారణమైంది.

Telangana Municipal Elections
Telangana Municipal Elections

మరోవైపు ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ మాత్రం ప్రచారంలో వెనుకబడిందనే చెప్పాలి. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు వరుసగా కేటీఆర్, హరీశ్ రావు, కేసీఆర్ , సంతోష్ వంటి కీలక నేతలను పిలిచి ఒత్తిడికి గురి చేయడంతో గులాబీ పార్టీ శ్రేణులు మున్సిపల్ ఎన్నికలపై పూర్తిగా దృష్టి పెట్టలేకపోయాయి.

అటు కేటీఆర్, హరీశ్ రావు కూడా కేవలం తమ నియోజకవర్గం పరిధిలోనే ప్రచారానికి పరిమితం కావడం కూడా గట్టి ప్రభావం చూపించింది. అందుకే గెలుపు అవకాశాలున్న స్థానాల్లోనూ వెనుకబడింది. మరోవైపు తెలంగాణలో బీజేపీ ప్రభావం అంతంత మాత్రంగానే ఉంటుందన్నది ముందు నుంచీ అంచనా వేసింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడిని తీసుకొచ్చి ప్రచారం చేసినా ఆయన ఇక్కడ చాలా మందికి తెలీదు. ఇలా కొన్ని వ్యూహాత్మక తప్పిదాలతో బీజేపీ ప్రభావం చూపలేకపోయింది. ఇవన్నీ కాంగ్రెస్‌కు కలిసొచ్చే అంశాలుగా మారడంతో తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో తాము అనుకున్న ఫలితాలను అందుకుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button