Winter Season: వింటర్‌లో హార్ట్ అటాక్ ముప్పు.. చలికాలంలో గుండె భద్రంగా ఉండాలంటే ఏం చేయాలి?
Winter Season: సాధారణ రోజుల కంటే చలికాలంలోనే హార్ట్ అటాక్స్ ఎక్కువగా వస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Winter Season
తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత రోజురోజుకూ పెరిగిపోతోంది. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో సామాన్య ప్రజలు గజగజ వణికిపోతున్నారు. అయితే ఈ చలికాలం(Winter Season) కేవలం జలుబు, దగ్గు మాత్రమే కాదు, గుండె ఆరోగ్యానికి కూడా పెద్ద సవాలుగా మారుతుంది. సాధారణ రోజుల కంటే చలికాలంలోనే హార్ట్ అటాక్స్ (Heart Attacks) ఎక్కువగా వస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ముఖ్యంగా తెల్లవారుజామున వచ్చే చలి (Winter Season)వల్ల గుండెపై విపరీతమైన ఒత్తిడి పడుతుంది. మరి ఈ చలికాలంలో మన గుండెను ఎలా కాపాడుకోవాలి? వైద్యులు ఇస్తున్న ముఖ్యమైన సూచనలు ఏంటి? అనే విషయాలు తెలుసుకుంటే ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు.
శాస్త్రీయంగా చూస్తే, చలికాలం(Winter Season)లో మన రక్తనాళాలు కుచించుకుపోతాయి (Vasoconstriction). దీనివల్ల రక్త ప్రవాహానికి ఆటంకం కలిగి, రక్తపోటు (Blood Pressure) ఒక్కసారిగా పెరుగుతుంది. రక్తపోటు పెరిగినప్పుడు గుండె రక్తాన్ని పంపింగ్ చేయడానికి చాలా ఎక్కువ శ్రమ పడాల్సి ఉంటుంది.
చలి వల్ల రక్తం కూడా కొంచెం చిక్కగా మారుతుంది, దీనివల్ల గుండెకు వెళ్లే రక్తనాళాల్లో క్లాట్స్ (రక్తం గడ్డకట్టడం) ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే చలి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు గుండెపోటు వచ్చే అవకాశాలు 50 శాతం పెరుగుతాయని వైద్య పరిశోధనలు చెబుతున్నాయి.
చాలామందికి ఉదయాన్నే వాకింగ్ వెళ్లే అలవాటు ఉంటుంది. కానీ చలికాలంలో తెల్లవారుజామున 4 లేదా 5 గంటలకు బయటకు వెళ్లడం ఏమాత్రం మంచిది కాదని డాక్టర్లు సూచిస్తున్నారు. సూర్యుడు వచ్చిన తర్వాత లేదా ఎండ కొంచెం పెరిగిన తర్వాతే వాకింగ్ చేయడం మంచిది.

ఎందుకంటే బయట ఉండే అతి శీతల గాలి నేరుగా ఊపిరితిత్తుల్లోకి వెళ్లినప్పుడు శరీరం ఒక్కసారిగా ఒత్తిడికి లోనవుతుంది. దీనివల్ల గుండె వేగం పెరిగి ప్రమాదానికి దారితీయవచ్చు. ఒకవేళ బయటకు వెళ్లాల్సి వస్తే తప్పనిసరిగా స్వెటర్లు, మఫ్లర్లు , చెవులకు రక్షణగా మంకీ క్యాప్‌లు ధరించాలి. శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవడం వల్ల రక్తనాళాలు కుంచించుకుపోకుండా ఉంటాయి.
ఆహారపు అలవాట్ల విషయంలో కూడా జాగ్రత్తలు అవసరం. చలికాలంలో దాహం తక్కువగా వేస్తుంది, కాబట్టి చాలామంది నీళ్లు తాగడం తగ్గిస్తారు. ఇది చాలా తప్పు. శరీరంలో నీటి శాతం తగ్గితే రక్తం చిక్కబడి గుండెపై భారం పడుతుంది. కాబట్టి రోజుకు కనీసం 3 నుంచి 4 లీటర్ల నీటిని, వీలైతే గోరువెచ్చని నీటిని తాగడం అలవాటు చేసుకోవాలి.
అలాగే ఈ సీజన్‌లో ఉప్పు ఎక్కువగా ఉండే పదార్థాలకు దూరంగా ఉండాలి. ఉప్పు ఎక్కువగా తింటే బీపీ పెరుగుతుంది, అది నేరుగా గుండెను దెబ్బతీస్తుంది. వేడివేడి సూప్‌లు, తాజా కూరగాయలు , పండ్లను ఆహారంలో భాగంగా చేసుకోవాలి.
ముఖ్యంగా 50 ఏళ్లు పైబడిన వారు , ఇప్పటికే గుండె సమస్యలు ఉన్నవారు చలికాలంలో అప్రమత్తంగా ఉండాలి. రాత్రిపూట నిద్రపోయే ముందు భారీగా భోజనం చేయడం మంచిది కాదు. అలాగే అతిగా మద్యం సేవించడం కూడా ప్రమాదకరం. మద్యం తాగినప్పుడు శరీరం లోపల వేడిగా అనిపిస్తుంది కానీ, అది నిజానికి మీ రక్తనాళాలను మరింతగా ప్రభావితం చేస్తుంది. ఏదైనా కారణం చేత గుండెలో నొప్పి, ఊపిరి ఆడకపోవడం, విపరీతమైన చెమటలు పట్టడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలి. ఇవి సాధారణ గ్యాస్ సమస్య అని నిర్లక్ష్యం చేయకూడదు.
వ్యాయామం విషయంలో కూడా చిన్న మార్పులు చేసుకోవాలి. బయట చలి ఎక్కువగా ఉన్నప్పుడు ఇంట్లోనే యోగా లేదా చిన్నపాటి వ్యాయామాలు చేసుకోవడం మంచిది. మీ గుండెపై ఒక్కసారిగా భారం పడేలా కాకుండా, నెమ్మదిగా శరీరాన్ని కదిలించాలి.
చలికాలంలో గుండె ఆరోగ్యం అనేది మన చేతుల్లోనే ఉంటుంది. సరైన దుస్తులు ధరించడం, సరైన ఆహారం తీసుకోవడం ,సమయానికి నిద్రపోవడం ద్వారా ఈ చలికాలం నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు.



