Trump: జనరిక్ ఔషధాలపై ట్రంప్ యు-టర్న్.. భారత ఫార్మాకు ఉపశమనం!
Trump: అమెరికాలో ఉపయోగించే జనరిక్ ఔషధాలలో దాదాపు 47% భారతదేశం నుండే దిగుమతి అవుతాయి. భారతదేశాన్ని అందుకే "ప్రపంచ ఫార్మసీ" అని పిలుస్తారు.

Trump
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Trump) అనుసరించిన కఠినమైన సుంకాల విధానం ప్రపంచంలోని అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ సుంకాల యుద్ధం నుంచి భారతదేశం కూడా తప్పించుకోలేకపోయింది. అయితే, తాజాగా ఒక స్వాగతించదగిన పరిణామం చోటుచేసుకుంది. ట్రంప్ సర్కార్ జనరిక్ ఔషధాలపై సుంకాలు విధించాలనే తమ ప్రణాళికలను తాత్కాలికంగా పక్కన పెట్టింది. ఈ నిర్ణయం భారతదేశ ఔషధ పరిశ్రమకు గణనీయమైన ఉపశమనం కలిగించింది.
అమెరికా ఆరోగ్య సంరక్షణ రంగంలో భారతీయ ఔషధాల పాత్ర చాలా కీలకం. IQVIA అనే మెడికల్ డేటా అనలిటిక్స్ కంపెనీ నివేదిక ప్రకారం, అమెరికాలో ఉపయోగించే జనరిక్ ఔషధాలలో దాదాపు 47% భారతదేశం నుండే దిగుమతి అవుతాయి. భారతదేశాన్ని అందుకే “ప్రపంచ ఫార్మసీ” అని పిలుస్తారు. మధుమేహం, రక్తపోటు, కొలెస్ట్రాల్, యాంటీబయాటిక్స్ వంటి ప్రాణాలను రక్షించే మందులు భారతీయ కంపెనీల నుంచే పెద్ద మొత్తంలో అమెరికాకు చేరుతాయి. ఈ మందులు అమెరికాలో స్థానికంగా ఉత్పత్తి చేసిన వాటి కంటే చాలా తక్కువ ధరకు లభిస్తాయి. ఒకవేళ సుంకాలు విధించినట్లయితే, భారతీయ మందులు అమెరికా మార్కెట్లో ఖరీదైనవిగా మారి, వాటి డిమాండ్ తగ్గి, చివరికి అమెరికన్ పౌరుల జేబులపైనే భారం పడేది.
ది వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం ప్రకారం, ట్రంప్(Trump) సర్కార్ మొదట్లో జనరిక్ ఔషధాలపై సుంకాలు విధించడంపై దర్యాప్తు ప్రారంభించింది. ఈ దర్యాప్తులో తయారైన ఔషధాలతో పాటు వాటి తయారీకి ఉపయోగించే ముడి పదార్థాలు (APIలు) కూడా చేర్చారు. అయితే, దర్యాప్తు తర్వాత, వాణిజ్య శాఖ తమ పరిధిని తగ్గించాలని సిఫార్సు చేసింది.

దీనికి ప్రధాన కారణం, జనరిక్ ఔషధాలపై సుంకాలు విధిస్తే, అమెరికాలో ఔషధ ధరలు పెరుగుతాయని, ముఖ్యమైన ఔషధాల మార్కెట్ కొరత ఏర్పడవచ్చని చాలా మంది నిపుణులు స్పష్టంగా అభిప్రాయపడ్డారు. ఒక వర్గం విదేశీ ఔషధాలపై అధిక సుంకాలు విధించడం ద్వారా ఉత్పత్తిని అమెరికాకు తిరిగి తీసుకురావాలని కోరినా కూడా.. అలాంటి చర్య అమెరికన్ ప్రజలకు హానికరం అని మరొక వర్గం బలంగా వాదించింది. ఈ అంతర్గత ఒత్తిడి, ప్రజారోగ్యంపై పడే ప్రభావం కారణంగానే ఈ యు-టర్న్ తీసుకున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
డొనాల్డ్ ట్రంప్(Trump) సుంకాల విధానాలు ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే అనేక ప్రభావాలు చూపాయి. ఉదాహరణకు, చైనాపై సుంకాలు విధించినప్పుడు, చైనా ప్రతిగా అమెరికన్ వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లను నిలిపివేసింది. ఇది అమెరికన్ రైతులకు భారీ దెబ్బగా మారింది. అదేవిధంగా, భారతదేశంపై ఔషధ సుంకాలు విధించి ఉంటే, అది కేవలం భారతీయ కంపెనీలకే కాకుండా, మొత్తం US ఆరోగ్య సంరక్షణ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపేది. సరసమైన భారతీయ మందులు అందుబాటులో లేకపోతే, అదే చికిత్స కోసం అమెరికన్ రోగులు భారీగా చెల్లించాల్సి వచ్చేది.
భారత ఔషధ పరిశ్రమ జనరిక్ ఔషధాలలో ప్రపంచవ్యాప్తంగా అగ్రగామిగా ఉంది. అధిక నాణ్యత గల మందులను అమెరికాకే కాకుండా, యూరప్, ఆఫ్రికా, ఆసియా దేశాలకు కూడా పెద్ద మొత్తంలో ఎగుమతి చేస్తుంది. అమెరికా మార్కెట్ భారతదేశానికి అతిపెద్ద ఎగుమతి గమ్యస్థానం. ఏటా బిలియన్ డాలర్ల విలువైన మందులను భారత్ అక్కడికి పంపుతుంది. కాబట్టి, ఈ సుంకాల పెంపును వాయిదా వేయాలనే ట్రంప్ సర్కార్ నిర్ణయం భారతీయ ఫార్మా కంపెనీలకు ఒక పెద్ద ఊరట అని చెప్పొచ్చు.
One Comment