Just InternationalLatest News

Ooho: ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా “ఊహో!” బుడగలు..ఏంటివి?

Ooho: మనం తాగే ఒక చిన్న నీళ్ల బాటిల్ కూడా కొన్ని వందల సంవత్సరాల పాటు భూమిలో అలాగే ఉండిపోతుంది.

Ooho

ప్రస్తుతం ప్లాస్టిక్ భూతం ప్రపంచాన్ని ఏలుతుంది. చివరకు మనం తాగే ఒక చిన్న నీళ్ల బాటిల్ కూడా కొన్ని వందల సంవత్సరాల పాటు భూమిలో అలాగే ఉండిపోతుంది. ఇది పర్యావరణానికి, మన భవిష్యత్తు తరాలకు పెనుముప్పుగా మారుతుంది అని తెలిసీ కూడా అవే వాడుతూ మనకు మనమే డేంజర్లో పడుతున్నాం.

అయితే, ఈ సమస్యకు పరిష్కారం కోసం ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు, స్టార్టప్‌లు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే, లండన్‌కు చెందిన ఒక స్టార్టప్ ఈ సమస్యకు కేవలం ఒక చిన్న నీటి బుడగతో చెక్ పెట్టబోతోంది. మీరు విన్నది నిజమే… ఒక చిన్న నీటి బుడగ పేరే ‘ఊహో!’. ఇది ప్లాస్టిక్ బాటిళ్లను మాయం చేయబోతోంది.

Ooho
Ooho

ఈ ఊహో (Ooho)బుడగలు సముద్ర శైవలాలతో (seaweeds) తయారవుతాయి. ఇవి ప్లాస్టిక్ లాగా కనిపించినా, పూర్తిగా పర్యావరణహితమైనవి. వీటిని రెండు పొరల జెల్లీతో తయారు చేస్తారు. వీటి లోపల నీళ్లు నింపి, ప్లాస్టిక్ బాటిళ్లకు ప్రత్యామ్నాయంగా వాడుతున్నారు. వీటిని ఉపయోగించడం చాలా ఈజీ. ఎవరికైనా దాహం వేస్తే, ఈ చిన్న బుడగను నేరుగా నోటిలో వేసుకుని తాగేయవచ్చు. ఈ బుడగ తినదగినదే కాబట్టి, దానిని మింగేసినా ఎలాంటి ప్రమాదం ఉండదు. ఒకవేళ ఎవరికైనా తినడం ఇష్టం లేకపోతే, వాడిన తర్వాత ఎక్కడైనా పడేయవచ్చు. అలా పారేసినా అవి కేవలం 4 నుంచి 6 వారాల్లో పూర్తిగా మట్టిలో కలిసిపోతాయి.

ఈ వినూత్న ఆవిష్కరణ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పలు పెద్ద ఈవెంట్లలో విజయవంతంగా ఉపయోగించబడింది. లండన్ మారథాన్‌తో పాటు, వివిధ ఫెస్టివల్స్‌లోనూ ఈ ‘ఊహో’ బుడగలను పంపిణీ చేశారు. దీనివల్ల కొన్ని లక్షల ప్లాస్టిక్ బాటిళ్ల వినియోగం తగ్గిపోయింది. ఈ ఆవిష్కరణను పర్యావరణ నిపుణులు మరియు సైంటిస్టులు కూడా మెచ్చుకుంటున్నారు. ఇది కేవలం ఒక ప్రయోగం మాత్రమే కాదు, ప్లాస్టిక్ కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి ఒక శక్తివంతమైన పరిష్కారంగా నిలిచింది.

Ooho
OohoOoho

‘ఊహో!(Ooho) అనేది కేవలం ఒక ప్రొడక్ట్ కాదు.. పర్యావరణాన్ని రక్షించే ఒక విప్లవాత్మకమైన ఆలోచన. ఈ ఆలోచన మన భవిష్యత్తును మరింత సురక్షితంగా, స్వచ్ఛంగా మారుస్తుందని ఆశించవచ్చు. ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయాలు లేవని, దానిని వాడడం తప్పదని అనుకునే రోజులు ఇకపై ఉండవు. ఈ చిన్న బుడగలు ప్లాస్టిక్ యుగానికి ఒక ముగింపు పలకబోతున్నాయి. త్వరలోనే ప్లాస్టిక్ బాటిల్స్ మాయం కానున్నాయి.

President: అనగనగా ఒక రాష్ట్రపతి… ఆయన ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని ఎలా రక్షించారంటే!

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button