Latest NewsJust Lifestyle

PTSD :గతం వెంటాడుతున్నట్లు అనిపిస్తుందా? ఇది PTSD కావచ్చు, జాగ్రత్త

PTSD: మెదడులోని భయాన్ని గుర్తించే భాగం (అమిగ్డాలా) అతి సున్నితంగా మారిపోతుంది.అలాగే జ్ఞాపకాలను నియంత్రించే భాగం (హిప్పోక్యాంపస్) దెబ్బతింటుంది. అందుకే సాధారణ జ్ఞాపకం "ఫ్లాష్‌బ్యాక్‌"గా మారి వారిని వెంటాడుతుంది.

PTSD

ఒకసారి ఊహించండి.. మీరు ఓ భయంకరమైన ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డారు. ఆ ఘటన ముగిసింది. అందరూ “నువ్వు ఇప్పుడు సురక్షితంగా ఉన్నావు” అని అంటున్నారు. కానీ మీ మనసు మాత్రం ఆ ప్రమాదం జరిగిన క్షణంలోనే ఇరుక్కుపోయింది. రాత్రి పడుకుంటే అదే దృశ్యాలు భయంకరమైన కలలుగా వెంటాడుతాయి. ఏ చిన్న శబ్దం వచ్చినా, అదే ప్రమాదం మళ్లీ జరుగుతోందనిపిస్తుంది. మీరు భౌతికంగా బయటకు వచ్చినా, లోపల మాత్రం ఇంకా ఆ ట్రామాలో బందీ అయ్యే ఉంటే దానిని PTSD (పోస్ట్-ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్) అంటారని చెబుతున్నారు సైకాలజిస్టులు.

PTSD అనేది ఒక తీవ్రమైన మానసిక ఆరోగ్య సమస్య. జీవితాన్ని అతలాకుతలం చేసే భారీ షాక్ లేదా ట్రామాటిక్ సంఘటనలు – ఉదాహరణకు, ప్రమాదాలు, ప్రకృతి విపత్తులు, యుద్ధం లేదా దాడులు – దీనికి ప్రధాన కారణాలు అవుతాయి. ఈ ఘటన తర్వాత నెలలు లేదా ఏళ్ల తరబడి కూడా మనసు ఆ భయం నుంచి బయటపడలేకపోవడమే. ఈ సమస్య ఉన్నవారికి ఆ అనుభవం కేవలం ఒక జ్ఞాపకం కాదు, అది మళ్లీ మళ్లీ మనసులో ఆడే ఒక భయానక సినిమా లాంటిది. పగటిపూట కూడా ఆ దృశ్యాలు ఫ్లాష్‌బ్యాక్‌ల రూపంలో కళ్ళ ముందు మెరుస్తూ ఉంటాయి. ఏదైనా శబ్దం, వాసన లేదా ప్రదేశం ఆ ఘటనను గుర్తు తెచ్చి వారి మనసును తీవ్రంగా కలచివేస్తుంది. దీనివల్ల వారు ఎప్పుడూ ఒక తెలియని భయంతో, ఆందోళనతో బతుకుతారు.

PTSD
PTSD

శాస్త్రవేత్తలు చెబుతున్నదాని ప్రకారం, PTSDలో మెదడులోని భయాన్ని గుర్తించే భాగం (అమిగ్డాలా) అతి సున్నితంగా మారిపోతుంది. అలాగే జ్ఞాపకాలను నియంత్రించే భాగం (హిప్పోక్యాంపస్) దెబ్బతింటుంది. అందుకే సాధారణ జ్ఞాపకం “ఫ్లాష్‌బ్యాక్‌”గా మారి వారిని వెంటాడుతుంది. దీనివల్ల స్ట్రెస్ హార్మోన్ అయిన కార్టిసోల్ ఎక్కువై, శరీరం ఎప్పుడూ ప్రమాదంలో ఉన్నట్టుగానే అలర్ట్‌లో ఉంటుంది.

PTSD తో బాధపడేవారు నిరంతరం అలసట, చిరాకు, ఒంటరితనంతో ఉంటారు. ఈ సమస్య వారి కుటుంబ సంబంధాలు, ఉద్యోగం, చదువుపై తీవ్రమైన ప్రతికూల ప్రభావం చూపుతుంది. కొంతమంది ఒత్తిడి నుంచి బయటపడటానికి మద్యపానం లేదా ఇతర మత్తు పదార్థాలకు బానిసలుగా మారవచ్చు. అత్యంత ప్రమాదకరంగా, కొందరు ఆత్మహత్య ఆలోచనల వరకు కూడా వెళ్తారు.

అయితే, PTSD కి సరైన చికిత్స అందుబాటులోనే ఉంది. కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ (CBT)లో భాగంగా వచ్చే ప్రత్యేకమైన థెరపీలు రోగిని ఆ భయంకరమైన జ్ఞాపకాలను ఎదుర్కొనేలా చేస్తాయి. అలాగే, కళ్ళ కదలికల ద్వారా జ్ఞాపకాలను రీప్రాసెస్ చేసే EMDR (ఐ మూవ్‌మెంట్ డీసెన్సిటైజేషన్ అండ్ రీప్రాసెసింగ్) వంటి చికిత్సలు కూడా చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. అవసరమైతే, వైద్యులు మందులను కూడా సిఫార్సు చేస్తారు. ఈ చికిత్సలో కుటుంబం , స్నేహితుల సహకారం అత్యంత ముఖ్యం. “నీ బాధ నిజమే” అని అంగీకరించడం, వారికి అండగా నిలబడటం చాలా అవసరం.

PTSD అనేది గతాన్ని మర్చిపోలేకపోవడం కాదు, అది మనసు గాయపడి, ఎంత కాలం గడిచినా మానకపోవడం. ఇది ఒక కనిపించని గాయం. కానీ, సరైన సహాయం, శాస్త్రీయ చికిత్సలు ఉంటే ఆ గాయం కూడా పూర్తిగా నయమవుతుంది.

Jr. NTR : యాడ్ షూటింగ్‌లో జూనియర్ ఎన్టీఆర్‌కు గాయం.. అభిమానులలో ఆందోళన

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button