Dreams:నిద్ర, కలలు.. మన జీవితంలో సైన్స్ ,రహస్యాలు
Dreams: నిద్ర కేవలం శరీర విశ్రాంతి కోసమే కాదు, అది మన మెదడుకు, శరీరానికి అత్యంత ముఖ్యమైన ఒక పునరుత్తేజ ప్రక్రియ.

Dreams
మనిషి జీవితంలో మూడో వంతు సమయం నిద్రలోనే గడుస్తుంది. కానీ నిద్ర కేవలం శరీర విశ్రాంతి కోసమే కాదు, అది మన మెదడుకు, శరీరానికి అత్యంత ముఖ్యమైన ఒక పునరుత్తేజ ప్రక్రియ అని తెలిసిన విషయమే. ఈ ప్రక్రియ లేకుండా మనిషి జీవించడం అసాధ్యం. ఆహారం, నీరు ఎంత అవసరమో నిద్ర కూడా అంతే అవసరం.
నిద్ర రెండు ప్రధాన దశల్లో ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతూ ఉంటారు. నాన్ రేపిడ్ ఐ మూమెంట్(Non-REM) రేపిడ్ ఐ మూమెంట్( REM). Non-REM దశలో శరీరం నెమ్మదిగా విశ్రాంతిలోకి వెళ్తుంది..కండరాలు సడలుతాయి, గుండె కొట్టుకునే వేగం, శ్వాస వేగం తగ్గుతాయి. ఆ తర్వాత వచ్చే REM దశలో మాత్రం మెదడు అత్యంత చురుకుగా మారుతుంది. ఈ దశలోనే మనిషికి ఎక్కువగా కలలు వస్తాయి. అంటే, శరీరం నిద్రలో ఉన్నా, మెదడు ఆలోచనల్లో, ఊహల్లో నిమగ్నమై ఉంటుంది.
కలలు(Dreams) ఎందుకు వస్తాయనేది ఇప్పటికీ సైన్స్‌కు పూర్తిగా అంతుచిక్కని రహస్యమే. కొన్ని సిద్ధాంతాల ప్రకారం, కలలు(Dreams) మనలోని అణగారిన కోరికలు, భావోద్వేగాలు బయటపడే రూపం. ఆధునిక న్యూరోసైన్స్ మాత్రం, మెదడు పగటిపూట సేకరించిన జ్ఞాపకాలను, భావోద్వేగాలను రాత్రిపూట వర్గీకరించే ప్రక్రియలోనే కలలు పుడతాయని చెబుతుంది.

అందుకే, మన భయాలు, కోరికలు, గత అనుభవాలు కలల రూపంలో ప్రతిబింబిస్తాయి. కలలు కేవలం వినోదం మాత్రమే కాకుండా, మన భావోద్వేగాలను సరిచేయడంలో కూడా పెద్ద పాత్ర పోషిస్తాయి. ఉదాహరణకు, ఒక భయంకరమైన సంఘటన ఎదురైనప్పుడు, మెదడు దానిని కలల్లో “రిప్లే” చేసి, దానిని ఎదుర్కోవడానికి మనకు సహాయపడుతుంది.
నిద్ర లేకపోతే కలిగే నష్టాలు చాలా ఎక్కువ. కేవలం ఒక రాత్రి సరిగా నిద్రపోకపోయినా, ఆలోచన శక్తి మందగిస్తుంది, ఏకాగ్రత తగ్గుతుంది, భావోద్వేగాలు అదుపు తప్పుతాయి. దీర్ఘకాలికంగా నిద్రలేమి ఉంటే గుండె జబ్బులు, మధుమేహం, ఊబకాయం వంటి శారీరక సమస్యలతో పాటు, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఎక్కువ. నిద్ర లేకపోతే శరీరంలో రోగనిరోధక శక్తి (Immunity) కూడా పడిపోతుంది.
ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, చిన్నపిల్లలకు ఎక్కువగా కలలు వస్తాయి, ఎందుకంటే వారి మెదడు ఇంకా అభివృద్ధి దశలో ఉంటుంది. మొత్తంమీద, నిద్ర అనేది ఒక అద్భుతమైన శాస్త్రీయ ప్రక్రియ. శాస్త్రవేత్తలు ఇప్పటికీ ఈ రహస్యాలను పూర్తిగా ఛేదించలేకపోయినా, నిద్ర లేకుండా జీవితం అసాధ్యం, కలలు లేకుండా మెదడు అసంపూర్ణం అని మాత్రం తెలుసుకోవాలి.