Latest News

PBKS vs GT : సమఉజ్జీల సమరం..నేడు గుజరాత్‌తో పంజాబ్ ఫైట్

PBKS vs GT : ఐపీఎల్ 19వ సీజన్ లో మంగళవారం ఆసక్తికర పోరు జరగబోతోంది. శుభమన్ గిల్ సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్ , గత ఏడాది రన్నరప్ గా నిలిచిన పంజాబ్ కింగ్స్ ను ఢీకొంటోంది

PBKS vs GT

ఐపీఎల్ 19వ సీజన్ లో మంగళవారం ఆసక్తికర పోరు జరగబోతోంది. శుభమన్ గిల్ సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్ , గత ఏడాది రన్నరప్ గా నిలిచిన పంజాబ్ కింగ్స్ ను ఢీకొంటోంది. బలాబలాల పరంగా రెండు జట్లు సమానంగా కనిపిస్తున్న వేళ సమఉజ్జీల సమరంగా చెబుతున్నారు. 2022లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన గుజరాత్ తొలి సీజన్ లోనే దుమ్మురేపింది.

అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఏకంగా ఛాంపియన్ గా నిలిచింది. ఆ తర్వాత సీజన్ లోనూ రన్నరప్ గా నిలిచింది. అయితే హార్థిక్ పాండ్యా ముంబైకి వెళ్లిపోవడంతో శుభమన్ గిల్ కు సారథ్య బాధ్యతలు దక్కాయి. గత సీజన్ లో ఎలిమినేటర్ కే పరిమితమైన గుజరాత్ ఈ సారి టైటిల్ పై గురి పెట్టింది.

మినీవేలానికి ముందు జట్టులో ఎక్కువ మార్పులు చేయలేదు. వేలంలో ఆల్ రౌండర్ హోల్డర్ తో పాటు టామ్ బాంటన్, ల్యూక్ వుడ్ లను తీసుకుంది. కెప్టెన్ గానే కాకుండా టీ20 ఫార్మాట్ లో తన సత్తా నిరూపించుకునేందుకు గిల్ కు ఈ సీజన్ మంచి అవకాశం. ఎందుకంటే పొట్టి క్రికెట్ కు తగినట్టు ఆడలేకపోతున్నాడన్న కారణంతోనే టీ20 ప్రపంచకప్ జట్టులో గిల్ ను పక్కన పెట్టారు.

భవిష్యత్తులో టీమిండియా టీ20 కెప్టెన్సీ కూడా అందుకుంటాడని అంచనాలున్న గిల్ కు ప్రస్తుత సీజన్ పరీక్షగానే చెప్పాలి. కాగా గుజరాత్ కు గిల్, సాయి సుదర్శన్ ఓపెనింగ్ కాంబినేషన్ అతిపెద్ద బలం. వీరి జోడీ గత సీజన్ లో దుమ్మురేపింది. సాయి సుదర్శన్ 2025 సీజన్ లో ఆరెంజ్ క్యాప్ సాధించగా.. గిల్ , బట్లర్ కూడా పరుగుల వరద పారించారు.

అయితే మిడిలార్డర్ లో నిలకడలేమి టైటాన్స్ కు మైనస్ పాయింట్. గ్లెన్ ఫిలిప్స్ , రాహుల్ తెవాటియా, వాషింగ్టన్ సుందర్ ఎంతవరకూ రాణిస్తారో చూడాలి. అటు బౌలింగ్‌లో మాత్రం హోల్డర్ రాకతో పేస్ బలం పెరిగినట్టేనని చెప్పొచ్చు. సిరాజ్ , ప్రసిద్ధ కృష్ణ గత సీజన్ లో రాణించారు. స్పిన్ విభాగంలో రషీద్ ఖాన్ మునుపటి ఫామ్ అందుకోవాల్సి ఉండగా.. సాయి కిషోర్ పై అంచనాలున్నాయి.

మరోవైపు గత సీజన్ లో ఫైనల్ వరకూ చేరినా ట్రోఫీని ముద్దాడలేకపోయిన పంజాబ్ కింగ్స్ సీజన్(PBKS vs GT) ను విజయంతో ఆరంభించాలని భావిస్తోంది. శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీ పంజాబ్ కు బలంగా చెప్పొచ్చు. వేలంలో భారీ ధరకు దక్కించుకుని అతనికి పగ్గాలు అప్పగించింది.

ఫ్రాంచైజీ యాజమాన్యం నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ శ్రేయాస్ అద్భుతంగా రాణించాడు. బ్యాటర్ గానే కాకుండా సారథిగానూ జట్టును బాగా నడిపించాడు. ప్రస్తుత సీజన్ లో పంజాబ్ కు విదేశీ ఆల్ రౌండర్లే ప్రధాన బలంగా భావిస్తున్నాయి. స్టోయినిస్, యాన్సెన్ , ఒమర్జాయ్ , మిఛెల్ ఓవెన్,కూపర్ కానోలీ వంటి హిట్టర్లు టీ20ల్లో భారీ షాట్లతో విరుచుకుపడుతుంటారు. ప్రపంచవ్యాప్తంగా పలు విదేశీ లీగ్స్ లో ఆడిన అనుభవం ఉన్న వీరంతా పంజాబ్ కు ఈ సారి కీలకం కానున్నారు.

PBKS vs GT
PBKS vs GT

అలాగే స్వదేశీ బ్యాటర్లలో ప్రభ్ సిమ్రన్ సింగ్, ప్రియాన్ష్ ఆర్యతో పాటు శ్రేయాస్ పైనా అంచనాలున్నాయి. బౌలింగ్ లో అర్షదీప్ సింగ్ పంజాబ్ ప్రధాన అస్త్రం. అయితే అర్షదీప్ ఇటీవలి కాలంలో పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాడు. దీంతో ఐపీఎల్ 19వ సీజన్ అర్షదీప్ సత్తాకు పరీక్షగా చెప్చొచ్చు. స్పిన్ విభాగంలో యజ్వేంద్ర చాహల్ పైనే పంజాబ్ ఆశలు పెట్టుకుంది.

గత రికార్డులను చూస్తే ఐపీఎల్ చరిత్రలో పంజాబ్, గుజరాత్ ఆరు మ్యాచ్ లలో తలపడగా చెరో మూడింటిలో విజయం సాధించాయి. గత సీజన్ లో పంజాబ్ పైచేయి సాధించింది. ఇక మ్యాచ్ కు ఆతిథ్యమిస్తున్న న్యూ ఛండీఘడ్ బాలెన్సింగ్ గా ఉంటుందని అంచనా. ఇక్కడ సగటు స్కోరు 180 నుంచి 200 మధ్య నమోదవుతుంది. మంచు ప్రభావంతో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవచ్చు.

CSK vs RR : కింగ్స్ వర్సెస్ రాయల్స్…నేడు చెన్నైతో రాజస్థాన్ ఢీ

Related Articles

Back to top button