Married Daughters : పెళ్లయిన కుమార్తెలకు కారుణ్య నియామకాలు..సుప్రీం కోర్టు సంచలన తీర్పు
Married Daughters : కారుణ్య నియామకాల్లో పెళ్లయిన కుమారులకు అర్హతలు వర్తిస్తే పెళ్లయిన కుమార్తెలకు ఎందుకు వర్తించవంటూ సుప్రీం కోర్టు మంగళవారం చారిత్రాత్మక వ్యాఖ్యలు చేసింది.
Married Daughters
గవర్నమెంట్ జాబ్ చేస్తున్నప్పుడు ఉద్యోగి అకాల మరణం చెందడమో.. అనారోగ్య కారణాల వల్ల విధుల నుంచి తప్పుకోవడమో జరిగితే.. ఆ కుటుంబం రోడ్డున పడకుండా ఉండటానికి కారుణ్య నియామకాల కింద ఉద్యోగాన్ని కల్పిస్తుంటారు.
అయితే, ఈ కారుణ్య నియామకాలకు సంబంధించి సుప్రీం కోర్టు.. మంగళవారం ఒక చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. పెళ్లయిన కొడుకులకు ఈ కారుణ్య నియామకాల కింద అన్ని అర్హతలు వర్తిస్తున్నప్పుడు, పెళ్లయిన కూతుళ్లకు(Married Daughters) ఎందుకు వర్తించవంటూ దేశ అత్యున్నత న్యాయస్థానం నిలదీసింది. దీనిపై గతంలో అలహాబాద్ హైకోర్టు.. ఇచ్చిన ఒక తీర్పును సర్వోన్నత న్యాయస్థానం పూర్తిగా పక్కన పెట్టేసింది.
యూపీకి చెందిన ఒక మహిళ కేసును విచారించిన సుప్రీంకోర్టు.. జస్టిస్ ఎస్ నరసింహ, జస్టిస్ అలోక్ అరాధేల ధర్మాసనం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. సదరు మహిళ తన తల్లి మరణం తర్వాత కారుణ్య నియామకం కింద రేషన్ షాప్ డీలర్షిప్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకుంది.
అయితే ఆమెకు వివాహం అయిందనే ఒకే ఒక్క కారణంతో యూపీ ప్రభుత్వం ఆమె అప్లికేషన్‌ను రిజెక్ట్ చేసింది. దీనిని అలహాబాద్ హైకోర్టు కూడా సమర్థించడంతో ఆమె సుప్రీం కోర్టును ఆశ్రయించింది.
ఈ కేసును నిశితంగా పరిశీలించిన సుప్రీం కోర్టు ధర్మాసనం.. కేవలం వివాహిత కుమార్తె(Married Daughters) అనే సాకుతో దరఖాస్తును తిరస్కరించడం రాజ్యాంగ విరుద్ధమని తేల్చిచెప్పింది. సదరు మహిళ పెళ్లయినా సరే అదే గ్రామంలో ఉంటూ తన తల్లికి దుకాణం చూసుకోవడంలో తోడుగా ఉందని, తల్లి మరణం తర్వాత దివ్యాంగురాలైన తన సోదరి బాధ్యతను కూడా ఆమే చూసుకుంటోందని కోర్టు గుర్తు చేసింది.
ఇలాంటి పరిస్థితుల్లో ఆమెకు కారుణ్య నియామకం నిరాకరించడం ఎంతమాత్రం సరికాదని స్పష్టం చేస్తూ.. రాబోయే 4 వారాల్లోగా ఆమెకు లైసెన్స్ జారీ చేయాలని అధికారులను ఆదేశించింది.

ఇదిలా ఉండగా, ప్రస్తుతం సర్వోన్నత న్యాయస్థానం తీర్పు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారి తీసింది. ఎందుకంటే ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వాలు కారుణ్య నియామకాల కోటా కింద ఎక్కువ జాబ్స్ ఇవ్వాల్సి వస్తోందని.. దీనివల్ల సాధారణ నోటిఫికేషన్ల ద్వారా వచ్చేవారికి అవకాశాలు తగ్గుతున్నాయని భావిస్తున్నాయి.
ఈ క్రమంలోనే కారుణ్య నియామకాలను వీలైనంత వరకు తగ్గించాలనే ఆలోచనలో ప్రభుత్వాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు సుప్రీం కోర్టు వివాహిత కుమార్తెలకు(Married Daughters) కూడా ఈ నియామకాల్లో సమాన హక్కులు కల్పించాలని చెబుతూ తీర్పు ఇవ్వడం ఆటోమొబైల్, రాజకీయ, సామాజిక వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.





